రాష్ట్రంలో ఎటుచూసినా చీకట్లే.. కంపెనీ తెరుద్దామంటే కరెంటు లేకపాయె.. మెషిన్ కట్క ఏద్దామంటే విద్యుత్తు ఉండకపాయె.. పరిశ్రమలను నడుపుదామంటే విద్యుత్తుకు కటకట ఉండే.. అయ్యా.. బిల్లులు కడతాం.. కరెంటు ఇవ్వండని మొత్తుకున్నా..కరెంటు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమది వెరసి పరిశ్రమల మూసివేత.. పవర్ హాలీడేలు.. దీంతో ఉపాధిలేక రోడ్డునపడ్డ లక్షలాది మంది కార్మికులు.. పడకేసిన ఉత్పాదకత.. అడుగంటిన జీఎస్డీపీ.. తలసరి ఆదాయం అధఃపాతాళానికి..మొత్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమైన దుస్థితి.. ఇదీ 2014కు ముందు సమైక్యపాలనలో తెలంగాణ దురవస్థ.
Telangana | 2014 తర్వాత..: ఏ రాష్ట్రమైనా ఆర్థికప్రగతి సాధించాలన్నా.. ప్రజల జీవనప్రమాణాలు మెరుగవ్వాలన్నా ఉపాధి అవకాశాలు కల్పించడమే మార్గమని కేసీఆర్ భావించారు. పరిశ్రమలు, కంపెనీలు నిరంతరాయంగా పనిచేస్తే.. కార్మికులకు చేతినిండా పని లభిస్తుంది. తద్వారా వారి ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర జీఎస్డీపీ ఉరకలేస్తుంది. ఇదంతా కేసీఆర్‌కు తెలియంది కాదు. అందుకే, పరిశ్రమలకు అవసరమైన నిరంతరాయ కరెంటును సరఫరా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. విద్యుత్తు కోతలు, పవర్హాలీడేలే ఉండొద్దని నిశ్చయించుకున్నారు.
అలా.. మొక్కవోని దీక్షతో.. అధికారంలోకి వచ్చిన కేవలం 4 నెలల్లోనే గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును కేసీఆర్ ప్రభుత్వం సరఫరా చేసింది. వెరసి గడిచిన పదేండ్లలో రాష్ర్టానికి లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. వేలాది కంపెనీలు క్యూకట్టాయి. దీంతో లక్షలాదిగా ఉద్యోగాల సృష్టి జరిగింది. దేశ విదేశాలకు చెందిన కంపెనీలు తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చుకున్నాయి. దీంతో ఉత్పాదకత పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రారాజుగా నిలిచింది.
కరెంటు ఇవ్వండని గగ్గోలు పెట్టినా…: సమైక్య పాలనలో తెలంగాణలో పారిశ్రామికవేత్తల కరెంటు కష్టాలు అంతాఇంతాకాదు. ఉమ్మడి ఏపీలో ఎప్పుడూ కోతలే. వారంలో మూడు రోజులు మాత్రమే విద్యుత్తు సరఫరా ఉండేది. అది కూడా ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు మాత్రమే. నెలలో పరిశ్రమలు 10-15 రోజులు మాత్రమే నడిచేవి.
బిల్లులు చెల్లిస్తాం.. విద్యుత్తు సరఫరా చేయండని పారిశ్రామికవేత్తలు గగ్గోలుపెట్టినా.. తగిన విద్యుత్తును కూడా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఏలుబడి అది. పరిశ్రమల మూసివేతతో పనిలేక, గ్రామాలకు పోలేక ఎంతోమంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మరెంతో మంది వేరే రాష్ర్టాలకు వలసబాట పట్టారు. కరెంటు కష్టాలతో దాదాపు 10 వేల పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రోజూ ధర్నాలు, నిరసనలు హోరెత్తేవి.
జిగేల్మన్న పరిశ్రమలు… :ప్రత్యేక రాష్ట్రసాధన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. పరిశ్రమలకు అవసరమైన నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని సంకల్పించింది. దేశంలో ఎక్కడ కరెంటు ఉంటే అక్కడి నుంచి కొనుగోలు చేయడమే కాకుండా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని అప్పటి సీఎం కేసీఆర్ చేపట్టారు. విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు, విద్యుత్తు రంగానికి బడ్జెట్లో మెజారిటీ నిధులు కేటాయించారు. దీంతో కేవలం నాలుగు నెలల్లోనే పరిశ్రమలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు సాకారమైంది.
ఇది తెలిసి.. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబర్చారు. అలా గడిచిన పదేండ్లలో కొత్తగా 23 వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీంతో కొత్తగా 22.5 లక్షల మందికి ఉపాధి లభించింది. ఉమ్మడి పాలనలో వారానికి మూడు రోజులు మాత్రమే నడిచిన పరిశ్రమలు.. కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో పనిచేసేవి.
తొమ్మిదిన్నరేండ్లలో జీఎస్డీపీ మూడింతలు…: ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీనే ప్రామాణికం. తెలంగాణలో నిరంతరాయ కరెంటుతో పారిశ్రామిక ప్రగతి జరిగి తద్వారా రాష్ట్రంలో ఉత్పాదకత పెరిగింది. దేశ జనాభాలో 2.9 శాతం వాటా మాత్రమే ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీలో 4.9 శాతం వాటాను కలిగి ఉంది. ఇదంతా కేసీఆర్ హయాంలో జరిగిన పురోగతే. 2013-14లో తెలంగాణ జీఎస్డీపీ రూ. 3.79 లక్షల కోట్లుగా ఉంటే.. 2023 నాటికి అది మూడు రెట్లు పెరిగి రూ.13.28 లక్షల కోట్లకు చేరింది. 2020-21లో ఒకవైపు కరోనా సంక్షోభం యావత్తు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినా.. కేంద్రం చిల్విగవ్వ ఇవ్వకున్నా తెలంగాణ మాత్రం వెనుదిరిగి చూడలేదు. ఆ సమయంలో దేశ జీడీపీ -1.4 శాతం మేర పడిపోగా.. తెలంగాణలో మాత్రం 1.2 వృద్ధిరేటు నమోదైంది.
తెలంగాణ జీఎస్డీపీ కింగ్…
2014లో జీఎస్డీపీ – రూ.3.79 లక్షల కోట్లు
2023లో జీఎస్డీపీ – రూ.13.28 లక్షల కోట్లు
పెరుగుదల – 251 శాతం
మీకు తెలుసా? 
ఒక్క ఏడాదిలో తెలంగాణ నమోదు చేసే జీఎస్డీపీతో మన పొరుగున ఉన్న భూటాన్‌ను 52 ఏండ్ల పాటు పోషించవచ్చు.
తలసరిలో మనమే టాప్…: నిరంతరాయ కరెంటు సరఫరాతో పరిశ్రమలు క్యూ కడతాయి. కంపెనీలు వస్తే కార్మికులకు చేతినిండా పని ఉంటది. కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఇదే జరిగింది. నిరంతరాయ కరెంటు సరఫరాతో తెలంగాణకు పరిశ్రమలు తరలివచ్చాయి. దీంతో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకొంటారు.
అంతటి ప్రాధాన్యమున్న తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 93,151గా ఉంటే.. గత నవంబర్‌నాటికి ఇది రూ.3,12,398కి చేరింది. ఇక, దేశానికి రోల్‌మాడల్ అని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకొనే గుజరాత్ తలసరి ఆదాయ జాబితాలో టాప్-10లో కూడా లేదు. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఉన్న ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో అట్టడుగున ఉన్నది. దేశ సగటు తలసరి ఆదాయం రూ.1,72,000 కంటే తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం రూ. 1,40,398 ఎక్కువ.

తెలంగాణ తల‘సిరి’…
2014లో తలసరి ఆదాయం- రూ.93,151
2023లో తలసరి ఆదాయం – రూ.3,12,398
పెరుగుదల – 235 శాతం
మీకు తెలుసా?
మనకంటే వందేండ్ల ముందు రాష్ట్రంగా ఏర్పడి, మూడు రెట్లు ఎక్కువ జనాభా ఉన్న బీహార్ పౌరుడి తలసరి ఆదాయం రూ.54,383 మాత్రమే. అంటే బీహార్‌లోని ఆరుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఆర్జించే సంపాదనను తెలంగాణలో ఒక్క వ్యక్తే సంపాదించగలడు.
2014కు ముందు.. పదేండ్లలో : 2014 తర్వాత.. పదేండ్లలో
తెలంగాణలో ఏర్పాటైన పరిశ్రమలు – 12 వేలు : తెలంగాణలో ఏర్పాటైన పరిశ్రమలు – 23 వేలు
పరిశ్రమలకు రోజూవారీగా ఇచ్చిన విద్యుత్తు – 5 గంటలు : పరిశ్రమలకు రోజూవారీ కరెంట్ – 24 గంటలు
కరెంటు లేక మూతబడిన పరిశ్రమలు – 10 వేలు : కరెంటు లేక మూతబడిన పరిశ్రమలు – 0
పారిశ్రామిక రంగంలో ఎంతమందికి ఉపాధి – 6.64 లక్షలు : పారిశ్రామిక రంగంలో ఎంతమందికి ఉపాధి – 22.5 లక్షలు
ఎడిటోరియల్ డెస్క్
