ప్రజాకవి కాళోజీ జన్మదినం ఇయ్యాల, ఈ పర్వదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జేసుకొని సంబర పడుతున్నం. భాషంటే కేవలం బడుల్లో నేర్చుకునే అక్షరాల గుత్తి గాదు, భాష అంటే జీవన తరీక, మన ఎరుక, మన గుండెచప్పుడు. అందునా మనదైన తెలంగాణ భాషలో ప్రతి పదం ఎనక రైతు చెమట వాసన, కూలి శ్వాస, అమ్మ ప్రేమ, ఈ మట్టి పరిమళం ఉన్నాయి.
ఎన్నో ఏండ్లుగా స్వపరిపాలన కోసం చేసిన మన పోరాటానికి కారణమైన ఎన్నో వివక్షల్లో అతి ముఖ్యమైనది మన భాష, యాసల పట్ల నాటి వలస పాలకులు మొదలు ప్రజల వరకూ చేసిన పరాచికాలే. వాటిని తట్టుకోలేని ప్రతీ తెలంగాణావాది హృదయం ఉప్పొంగింది, ‘మా భాష ఇదే, మా యాస ఇదే’ అని ఎలుగెత్తింది. కానీ, ఆ స్పృహ నేడు ఎంతమందికి మిగిలిందన్నదే ప్రశ్న. ఒకవైపు తమిళ తంబీలు తమిళం దప్ప ఇంకోటి వద్దే వద్దని, చివరకు ఆటోలు, కార్లమీద వేరే భాష కొటేషన్లు గన్పిస్తే ధ్వంసం జేసే దాకా పోతుండ్రు. ఇక మరాఠీలైతే పెద్ద ఉద్యమమే దీసుకొచ్చి భాషనే గాదు, మహారాష్ట్ర మరాఠీలదే అని నానా యాగీ జేత్తుండ్రు. ఇలాంటి అతి మన దగ్గరలేదని సంతోష పడాల్నో.. లేక తెలంగాణ భాష, యాసల పట్ల కనీస స్పృహ కూడా లేదని బాధపడాల్నో సమజ్ గాని సంగతి నేడుంది.
మన భాష ‘బడి పలుకుల భాష’ మాత్రమే కాదు, ‘పలుకు బడుల భాష’గా గౌరవం పొందే రోజు రావాలని కాళోజీ ఎంతగానో తపన పడ్డరు. అందుకోసమే తన ప్రతీ రాతల ఆ భాషకు కావ్యగౌరవం దక్కేటట్టు రాసుకొచ్చిండ్రు. కానీ, ఇప్పుడు జరుగుతున్న తంతు, నేటి యువతరం జేస్తున్నది జూస్తుంటే.. ఏమనాల్నో, ఎట్ల సమజ్ జేసుకోవాల్నో అర్థమైతలేదు. పుస్తకాలను చదివే తరం తగ్గి ఇన్స్టా రీల్లల్లనే అన్నీ తెలుసుకునే తరం మొదలైంది. ఆ రీల్లల్లనో… లేక సోషల్ మీడియా రాతలల్లనో కనిపిస్తున్న భాష మనదే అయినా… అందులో వాళ్లు చెప్తున్న సందర్భం 365 రోజుల్లో ఏ పది పదిహేను రోజుల్లో అచ్చే మన దసరా, సంక్రాంతి పండగలప్పుడు తప్ప, మిగిలిన మన జీవితం, మన కల్చర్ ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నాలు మాత్రం జరగకపోవుడు బాధను తెప్పిస్తున్నయ్.
అందుకే ముందుగా మనం మారుదాం, మన తెలంగాణ భాష ఎంత గొప్పదో… తెలంగాణ బిడ్డలమైన మనం అర్థం జేసుకోవాలె. నిజానికి ఆంధ్ర, ఇతర రాష్ర్టాల నుంచి అచ్చి ఈన్నే సెటిలైన ఎంతో మంది పిల్లలు స్వచ్ఛమైన తెలంగాణ భాష మాట్లాడుతున్నరు, తండ్రుల వారసత్వాన్ని మర్చి ఈ నేలతో మమేకమై, మన యాస భాషల్లో గలిసిపోయిండ్రు. ఇక్కడే తరతరాలుగా పుట్టి పెరుగుతున్న మనం, మన పండగలప్పుడు చేసే తంతు కన్నా మన ఇంట్ల మాట్లాడే భాషను ప్రపంచానికి తెలియజెయ్యాలె. అప్పుడే నిజమైన తెలంగాణ భాష బతికి బట్టకడ్తది.
మన రాష్ట్రం మనకొచ్చినా… మన సినిమా గిదని చెప్పుకొనేలా నిలబడలె. ఎన్ని సందేశాత్మక సినిమాలున్నా… కమర్షియల్ హిట్ లేకపోతే ఆటికి గుర్తింపు దక్కనట్టే, సినిమాలు జన బాహుళ్యానికి చేరితేనే నిలబడ్డట్టు అనే భావన చొప్పించిండ్రు. అట్లా ఒక ‘బలగం’, ‘దసరా’ వంటి కొన్ని మన తెలంగాణ యాసకు, భాషకు పట్టులా నిలిచిన సినిమాలు ఉన్నప్పటికీ… మన యాసను విలనీలకి, కామెడీలకు అంటగట్టి నాడు ఉద్యమంలో మనం ఆరోపించినట్టు ఇంకా నడుస్తనే ఉన్నయ్.
ఈ ధోరణి పోవాల్నంటే… మల్ల మనమే నడుం బిగించాలే. నాడు ఉద్యమం నడిచినన్ని రోజులు కేవలం మన భయానికి కొంత ఈ ధోరణిని తగ్గించినా… గిప్పుడు మల్లా ఆ సంస్కృతి పెరగకుండా మన యాసను, భాషను ఎక్కిరించే సినిమాల్ని దూరం బెట్టాలే. గట్లనే ఇంతకుముందు చెప్పుకొన్నట్టు సోషల్ మీడియాలో మన భాష, యాసల్ని మనమే మంచిగా ప్రమోట్ జేసుకోవాలే. దీనికి ప్రభుత్వం తరపున గూడా ప్రోత్సాహం దొరకాలే. సినిమాల్లోనైనా, టీవీ ప్రోగ్రాంలలోనైనా… తెలంగాణ యాసతో కూడిన మంచి భాషతో వచ్చిన వాటికి పన్ను ప్రోత్సాహకాలు, రిబేట్లు ఇయ్యాలె. అప్పుడు మరింతగా మన యాసతో తీయనీకి ముందుకొస్తారు. అలా హిందీని తట్టుకొని నిలబడ్డ భోజ్పురిలాగా మనదైన తెలంగాణ భాష, యాసలతో తెలంగాణ ఇండస్ట్రీ డెవలప్ అయితది. అదే నిజమైన తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీని యాజ్జేసుకోవడమే కాదు, ఆచరించినట్టయితది.
ఇక స్వపరిపాలనలో ప్రభుత్వాలపరంగా గత దశాబ్దం దాటి రెండో దశాబ్దిలోకి అడుగుపెట్టినం. గతంలో భాష కోసం కొంత తపన గనవడ్డది. కాళోజీ సంస్మరణార్థం కోట్ల రూపాయలతో స్మృతి కేంద్రం నిర్మాణం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి మాండలిక సాహిత్యానికి పెద్దపీట వేయడం, అవార్డులు అందించడం, ప్రపంచ సభలు నిర్వహించడం, కొన్ని పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ కవులు రాసిన మాండలిక సాహిత్యాన్ని పాఠాలుగా చేర్చడం జరిగినా… దాని కొనసాగింపు జరుగుతున్నట్టు అనిపిస్తలేదు. మనదైన సంస్కృతిని, అందులో భాగమైన ఆచార వ్యవహారాలు, ఆటిని ముందుకు తీస్కెల్లే భాష, యాసల పట్ల ముఖ్యంగా ప్రభుత్వానికే ఎక్కువ శ్రద్ధుండాలే. కానీ, దురదృష్టవశాత్తు నేటి ప్రభుత్వం ఆ దిశగా ఇష్టపడ్డట్టు అనిపిస్తలేదు. కేవలం పేర్లు మార్చుడు తప్ప అందులో ఉన్న ఔచిత్యాన్ని ఒంటబట్టించుకొన్నట్టు లేదు.
ఈ కృషి జరగకపోతే… కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం మరో సొంత పీడనలో చిక్కుకున్నట్టే. మన భాష, యాసలతో ప్రభుత్వం ప్రతీ పథకాన్ని ప్రచారం జేసుకోవాలే. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం చదువులు పెరుగుతున్నా… భాషగా ఉన్న సిలబస్లనన్నా మన తెలంగాణ యాసతో నింపాలె. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాక ఉన్న తెలుగు సిలబస్లనన్నా… తెలంగాణ మాండలిక రచనలు, మన కవులు, కళాకారుల గురించే తెలియజేయాలే. ఇక జీవోలు, ప్రభుత్వ గెజిట్లూ ఎక్కడ వీలైతే అక్కడ తెలంగాణ భాషను ఎంతమేరకు తేగలమో అధ్యయనం జేసి, తెలంగాణ భాషను వ్యవహారికం నుంచి అధికారిక వ్యవహారికంలోకి తేవాలే.
ఒకవైపు త్రిభాషా విధానం తెస్తున్న కేంద్రం మీద తమిళనాడు మొదలు అనేక రాష్ర్టాలు తిరగబడుతుంటే… మనదగ్గర ఎందుకో మౌనంగున్నరు. సరే ఇండ్ల మంచీచెడులు ఎలా ఉన్నా… తెలంగాణ భాషను బతికించుకోవడానికి ఏదో కాళోజీ పుట్టినరోజున ప్రభుత్వం ఏవో ఇన్ని కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకొంటే మాత్రం యావత్ తెలంగాణ సమాజానికి, మన సంస్కృతీ వైభవాలకు, ఆచార వ్యవహారాలకు, మొత్తంగా యాస, భాషలతోనే షురువైన మన అస్తిత్వానికి తీరని ద్రోహమే అవుతుంది. అందుకే పాలకులు మొదలు ప్రజల దాకా భాష పట్ల ప్రేమను తెచ్చుకోవాలే. దాన్ని కాపాడనీకి మన జీవన విధానమే మార్చుకోవాలే.
– (వ్యాసకర్త: సినీ దర్శకులు, సామాజికవేత్త)
లక్ష్మణ్ మురారిశెట్టి 90119 66666