కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజం నిప్పులాంటిది.. అది అబద్ధపు పొరలను చీల్చుకుంటూ బయటకు రాక తప్పదు. నిన్నటి వరకు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎద్దేవా చేసి, ‘లక్ష కోట్లు గంగలో కలిశాయి‘ అంటూ గొంతు చించుకున్న కాంగ్రెస్ నాయకులు, నేడు అదే ప్రాజెక్టు పునరుద్ధరణపై హుటాహుటిన సమీక్షలు నిర్వహించడం చూస్తుంటే.. రాజకీయ నాటకాలు ఏ స్థాయికి చేరాయో అర్థమవుతున్నది. మేడిగడ్డ బరాజ్ వద్ద తలెత్తిన చిన్న సాంకేతిక లోపాన్ని భూతద్దంలో చూపి, తెలంగాణ జీవనాడిని నిర్వీర్యం చేయాలని చూసిన కుట్రల తెర నేడు వీడింది. రాజకీయంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, తెలంగాణను గర్వకారణమైన కాళేశ్వరాన్ని బద్నాం చేయాలని చూసిన వారికి ఇప్పుడు కాలమే సమాధానం చెప్తున్నది. అబద్ధాల పునాదులను వాస్తవాల సాక్ష్యాలు పెకిలిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బరాజ్ వద్ద ఒకట్రెండు పిల్లర్లు కుంగితే, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, అదొక పనికిరాని కట్టడమని కాంగ్రెస్ నేతలు ఊరూవాడా దుష్ప్రచారం చేశారు. ఆ పిల్లర్లు కుంగడం వెనుక కుట్రలు ఉన్నాయని కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే వాస్తవం ఏమిటి? వందల టీఎంసీల నీటిని ఎత్తిపోసి, బీడు పడిన తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఈ అద్భుత నిర్మాణం నేటికీ పటిష్టంగానే ఉన్నది. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే దానిని యుద్ధ ప్రాతిపదికన సరిచేయాల్సింది పోయి, దాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చుకోవాలని చూడటం దురదృష్టకరం. నేడు జూబ్లీహిల్స్ నివాసంలో కూర్చుని సీఎం రేవంత్‌రెడ్డి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారంటేనే అర్థం.. కాళేశ్వరం పటిష్టంగా ఉన్నదనే వాస్తవం వారికి తెలుసు. ఇన్నాళ్లు మాట్లాడినవన్నీ వట్టి బూటకపు మాటలు. కేవలం రాజకీయ కక్షతోనే బురద చల్లారని వారి చర్యలే నిరూపిస్తున్నాయి.
కేసీఆర్ దార్శనికతతో తెలంగాణకు జీవనాడి లాంటి ప్రాజెక్టును నిర్మించారు. కానీ ‘లక్ష కోట్లు వృథా‘ అని ఊదరగొట్టిన వారు, ఇప్పుడు అదే ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వకపోతే తెలంగాణ ఎండిపోతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ భండారం జనాలకు అర్థమైంది. కాళేశ్వరం ప్రాధాన్యతను కాంగ్రెస్ పాలకులు గుర్తించకతప్పని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ అద్భుత విజన్‌పై విషం చిమ్మిన కాంగ్రెస్ సంకుచిత రాజకీయనేతలు, కుహనా మేధావులు ఇప్పుడేం చెప్తారో మరి!
ప్రజల తరఫున ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు: కాళేశ్వరం నిజంగానే ’కూలేశ్వరం’ అయితే, ఇప్పుడు వందల కోట్ల నిధులతో మరమ్మతులు చేసి ఏం సాధిస్తారు? వృథా అని ప్రచారం చేస్తున్న నిర్మాణాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఎందుకు తహతహలాడుతున్నారు? ఎన్నికల ముందు చేసిన విషప్రచారం కేవలం ఓట్ల కోసమేనని మీ తాజా ఆదేశాలు నిరూపించడం లేదా? అన్నం పెట్టే ప్రాజెక్టులపై విషం చిమ్మడం భావ్యం కాదు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం తెలంగాణ రైతన్నల ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడానికి రూపుదిద్దుకున్న ఆధునిక దేవాలయం.
అధికారం కోసం అబద్ధాలు ఆడవచ్చు కానీ, అభివృద్ధిని ఆపలేరు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు నీళ్లు అందించడంపై దృష్టి పెట్టండి. అబద్ధాల కోటలు కూలిపోయాయి.. నిజం నిలకడ మీద తేలింది. కాంగ్రెస్ మోసాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణను అన్నపూర్ణగా మార్చే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం మానుకోవాల్సిన అవసరమున్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకురాలు)
-పి.సబితా ఇంద్రారెడ్డి