CBI Enquiry on Kaleshwaram | ‘తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ కావాలని తపించిన అపర భగీరథుడిపై సీబీఐ దర్యాప్తు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం చూస్తుంటే ‘తెలంగాణ కోసం కేసీఆర్ పడ్డ కష్టానికి ఇదా ప్రతిఫలం’ అన్న నిర్వేదం ప్రజల్లో కనిపిస్తున్నది. ఏ ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణను సాధించారో, అదే ఉత్సాహంతో ప్రజల ఆశలను నెరవేర్చడానికి ఆయన కష్టించి పనిచేయడం ఇప్పుడు నేరమైపోయింది. గోదావరి-కృష్ణా నదులను కలపడానికి ఆయన చేసిన కృషి నేటి పాలకులకు తప్పులా కనిపిస్తున్నది.
ప్రాజెక్టుల నిర్మాణాల్లో చిన్న చిన్న లోపాలుండటం ప్రపంచంలో కొత్తేమీ కాదు. ఏపీలో పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. మళ్లీ కొత్తది కడుతున్నారే తప్ప సీబీఐ విచారణలు జరిపించలేదు. ప్రజాధనం దుర్వినియోగమైతే బాధ్యులను గుర్తించి శిక్షించడంలో తప్పులేదు. కానీ, ఆ పేరుతో రాజకీయ, వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటామంటే అది అభివృద్ధిని అపహాస్యం చేయడమే అవుతుంది
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరోసారి మననం చేసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అది శ్రీరాంసాగర్ వలెనో, నాగార్జునసాగర్ వలెనో ఏక ప్రాజెక్టు కాదు. ఇది పలు ప్రాజెక్టుల సమాహారం. కాళేశ్వరం గొలుసుకట్టు ఎత్తిపోతల పథకాల హారం లాంటిది. రిజర్వాయర్లలో నీటిని నిల్వచేసి, ఎత్తిపోతల పథకాల ద్వారా వాటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. దిగువన పోతున్న గోదావరిని ఎగువన ఉన్న హైదరాబాద్ వరకు ఎత్తిపోయడం, ఇందుకోసం పలుచోట్ల రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు నిర్మించడం పెద్ద ఇంజినీరింగ్ అద్భుతం. అందుకే ఈ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది.
ఈ మహోన్నత ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టులో రెండు పిల్లర్లు పగుళ్లు రావడంతో ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తున్నది. రూ.350 కోట్లు వెచ్చించి దీనికి మరమ్మతు చేయిస్తామని నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్ అండ్ టీ కంపెనీ ముందుకు వచ్చింది. దానిపై దృష్టి పెట్టకుండా ఏడాదిగా అవినీతి, దర్యాప్తులు, కేసులంటూ కాలయాపన చేయడం ఎందుకో సామాన్యులకు అర్థం కావడం లేదు. ఇంత భారీ నిర్మాణంలో ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు జరిగితే వాటిపై సంబంధిత ఇంజినీర్లపైనో, అధికారులపైనో చర్యలు తీసుకోకుండా ఏకంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపైనే దర్యాప్తునకు ఆదేశించడం విస్మయం కలిగించే విషయం. మాజీ మంత్రి హరీశ్రావుపైనా సీబీఐ కేసు పెట్టాలని కాంగ్రెస్ సిఫారసు చేసింది. తగిన పరిశీలనలు జరుపకుండా హడావుడిగా ప్రాజెక్టు పనులపై నిర్ణయాలు తీసుకున్నారన్నది కేసీఆర్పై ఉన్న ప్రధాన ఆరోపణ.
ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఒకసారి యాది చేసుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ సాధించిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఆ లక్ష్యాలను సాధించుకోవాలన్న ఆశ, ఆశయం ఉద్యమనేతకు ఉండవా? అందుకే కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణాన్ని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈలోగా ఎత్తిపోతల కోసం అవసరమైన విద్యుత్తు ఉత్పాదనపై దృష్టిపెట్టారు. మరోవైపు అత్యధికంగా నీటిని ఎత్తిపోయడానికి అవకాశాలు ఏమిటా అని మేధావులతో కలిసి ఆలోచనలు చేశారు. అందులో భాగమే ప్రాజెక్టుల రీ డిజైనింగ్. ప్రతిపాదనలకే పరిమితమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు దుమ్ముదులిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై ఆనకట్ట నిర్మించి అక్కడినుంచి రామగుండం సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీరు నింపాలన్నది ఆ ప్రాజెక్టు సారాంశం.
ప్రాణహితలో తగినంతగా నీళ్లు లేకపోవడం, ముంపు విషయమై పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు రావడం, సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతాల మీదుగా కాల్వ తవ్వాల్సి ఉండటంతో అది అంత అనువైనది కాదని భావించారు. అందుకే ప్రాణహిత, గోదావరి సంగమ ప్రాంతమైన కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించారు. అది తుమ్మిడిహట్టికి 116 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తుమ్మిడిహట్టి తర్వాత ప్రాణహిత నదిలో చెలిమెల వాగుతో పాటు, మరికొన్ని వాగులు, వంకలు కలవడంతో నీటి లభ్యత పెరిగింది. కట్టినదేదో భారీగానే ఉండాలని భావించి గొలుసుకట్టు రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి నీరందించాలని రూపకల్పన చేశారు. హైదరాబాద్లోని మూసీలో గోదావరి నీరు కలిస్తే అనంతరం అది కృష్ణలో కలిసినట్టే. ఇంత తాపత్రయం పడటమే కేసీఆర్ చేసిన నేరమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్ల రుణం తీసుకొచ్చారని ప్రభుత్వమే చెప్తున్నది. రుణం ఇచ్చినవాటిలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఉన్నది. ఎటువంటి అనుమతులు, ధ్రువీకరణలు లేకుంటే ఇన్ని కోట్ల రుణం వస్తుందా? అనుమతులు లేకపోవడం వల్ల ఏదో నష్టం జరిగిపోయిందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న నమ్మకంతోనే ఇంత భారీగా రుణాలు ఇచ్చాయి. ప్రాజెక్టుల కోసం ఎక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చారన్నది మరో ఆరోపణ. ఇచ్చిందెవరు? కేంద్ర సంస్థలు. అంటే తల్లి… బిడ్డకు అప్పు ఇచ్చినట్టు లెక్క. దీనికోసం భయపడలా? వడ్డీ రేట్లు తగ్గించుకునే అవకాశాలే లేవా? అవసరమైతే మొత్తం రుణాన్నే రద్దుచేసే పరిస్థితి రాదా? విదేశాల నుంచి తీసుకువచ్చే రుణాలంటే భయపడాలి కానీ, కేంద్రం ఇచ్చే అప్పులతో ముప్పు ఏముంటుంది? దీనిపై సీబీఐ ఏమని దర్యాప్తు చేస్తుంది?
కాళేశ్వరం కారణంగా మేలు జరగలేదని ఎవరైనా అనగలరా? వరిసాగు విస్తీర్ణం పెరుగుదలకు, నాణ్యమైన సన్నరకం ధాన్యాల ఉత్పత్తికి కాళేశ్వరం సహకరించిందనే విషయం నిజం కాదా? రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇవ్వగలుగుతున్నారన్నా, ఫిలిప్పీన్, సింగపూర్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతి చేయగలుగుతున్నారన్నా అందులో కాళేశ్వరం పాత్ర
లేదంటారా?
రైతుల కడుపు కొట్టి కేసీఆర్ ఏదో కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు వింటుంటే కడుపులో దేవినట్టవుతున్నది. ఆయన రైతులకు మోసం చేయడం ఏమిటి? ఆయన నిజంగా ‘రైతు బంధు’ కాదా? రైతుల కోసం ఆయన చేయనిదేమిటి? ఆయన రూపొందించిన రైతుబంధు పథకం ఇప్పుడు కేంద్రం పీఎం కిసాన్ పేరుతో దేశమంతటా అమలుచేయడం లేదా? ఈ పథకం వెనుక ఎంత ఆర్థికశాస్త్రం దాగి ఉన్నది. మార్కెట్ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవచ్చు. కానీ, పంటకయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వమే భరిస్తే రైతుపై భారం తగ్గుతుంది. రైతులు నాలుగు పైసలు కళ్లజూస్తారు. తద్వారా ఆత్మహత్యలు తగ్గుతాయి. ఆయన చేసిన మరో మంచి పని రైతు బీమా. బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు మరణిస్తే అతని కుటుంబానికి వారం రోజుల్లోనే రూ.5 లక్షల పరిహారం అందుతుంది. రైతుల కోసం ఇంతగా చేసిన నాయకుడిపై సీబీఐ దర్యాప్తు అంటే ఆయన పడ్డ శ్రమను పూర్తిగా విస్మరించడమే. బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టును నిష్ప్రయోజనమని, వృథా వ్యయమని విమర్శలు చేస్తే అర్థం ఏముంటుంది? ప్రాజెక్టు కోసం మొత్తం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే ఆ లక్ష కోట్లు వృథా అయ్యాయనడం ఏ మేరకు సబబు?
ప్రాజెక్టుల నిర్మాణాల్లో చిన్న చిన్న లోపాలుండటం ప్రపంచంలో కొత్తేమీ కాదు. ఏపీలో పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. మళ్లీ కొత్తది కడుతున్నారే తప్ప సీబీఐ విచారణలు జరిపించలేదు. ప్రజాధనం దుర్వినియోగమైతే బాధ్యులను గుర్తించి శిక్షించడంలో తప్పులేదు. కానీ, ఆ పేరుతో రాజకీయ, వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటామంటే అది అభివృద్ధిని అపహాస్యం చేయడమే. కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో మొక్కుబడిగా, హడావుడిగా నిర్మించలేదు. ఉద్యమ లక్ష్యసాధనలో భాగంగా జాప్యం లేకుండా సత్వరమే నిర్మించాలన్న ప్ర యత్నం జరిగింది. ఆ క్రమంలో సాంకేతికంగా, నిర్మాణపరంగా చిన్న లోపాలు దొర్లాయి. అవి సరిచేయతగ్గవే. అందుకుతగ్గ ఇంజినీరింగ్ నైపుణ్యాలూ ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికే సమస్యలన్నీ పరిష్కారమై ఉండేవి. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని చెప్పిన ప్రభుత్వం అసెంబ్లీలో చేసినదేమిటి? 665 పేజీల నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి పూర్తిగా చదువుకోవడానికి కూడా సభ్యులకు పూర్తిగా అవకాశం ఇవ్వలేదు. క్షుణ్ణంగా చర్చించడానికి వీలు కలిగించకుండా ఒక్కరోజులో సమావేశాన్ని ముగించారు. సీబీఐచే దర్యాప్తు చేయించనున్నట్టు అర్ధరాత్రి ప్రకటించారు. దురుద్దేశాలే లేకపోతే ఇంత హడావుడి ఎందుకు?
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
-గోసుల శ్రీనివాస్ యాదవ్