యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాతన్ కేసుపై ఓబీసీ రిజర్వేషన్లలో అభ్యర్థులు క్రీమీలేయరా? లేదా నాన్ క్రీమీలేయరా? అనే అంశంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఓబీసీ రిజర్వేషన్లలో ప్రభుత్వ, ప్రైవేట్రంగాల్లోని ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని నిర్ధారించటాన్ని తప్పుపట్టింది. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖలో ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) సర్టిఫికెట్ జారీచేయటానికి ఇబ్బంది పెడుతున్న తహశీల్దార్లకు చెంపపెట్టుగా భావించాలి.
1992లో సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మండల కమిషన్ నివేదిక ఆధారంగా 27% రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఓబీసీ కులాల్లోని సంపన్నశ్రేణికి చెందిన వారిని ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించి అమలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది.
కేంద్ర ప్రభుత్వం 1993లో జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన జాతీయస్థాయిలో నిపుణుల కమిటీని నియమించి ఓబీసీ జాబితాలోని కులాల్లో సంపన్నశ్రేణి వర్గాలను గుర్తించాలని ఆదేశించింది. ఆ నిపుణుల కమిటీ మొత్తం ఓబీసీ జాబితాలోని కులాల్లో ఆరు గ్రూపులను సంపన్నశ్రేణి వర్గాలుగా గుర్తించి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించింది. ఉద్యోగుల పిల్లలకు సంబంధించి మూడు విభాగాలుగా గుర్తించింది. (ఏ) తండ్రి లేదా తల్లి ఇద్దరిలో ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్-1, క్యాటగిరి-ఏ, క్లాస్-ఏ ఉద్యోగాల్లో నేరుగా నియమితులైతే వారి పిల్లలు సంపన్నశ్రేణి వర్గంలోకి వస్తారు.
వారికి ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు. (బీ) తల్లి లేదా తండ్రి గ్రూప్-2, క్లాస్-2 పోస్టులో నియమితులై 40 ఏండ్లలోపు గ్రూప్-1 పదోన్నతి పొందితే, తల్లి, తండ్రి గ్రూప్-2 పోస్టులో నేరుగా నియమితులైతే వారి పిల్లలు సంపన్నశ్రేణి వర్గంలోకి వస్తారు. వారికి రిజర్వేషన్లు వర్తించవు. (సీ) ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న తండ్రి లేదా తల్లి సమానత్వపు హోదాను పైన (ఏ), (బీ)లో తెలిపిన నిబంధనల ప్రకారం వారి హోదాను బట్టి వారి పిల్లలు సంపన్నశ్రేణి వర్గానికి చెందుతారా? లేదా? అనేది నిర్ధారించాలి.
ఒకవేళ ప్రభుత్వంలోని పోస్టులకు సమానమైన పోస్టులను గుర్తించనట్లయితే వారికి ఆదాయ/సంపద టెస్టు ద్వారా వారి సంతతి క్రీమీలేయరా? కాదా? అనేది నిర్ధారించాలని తెలిపింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా 2004లో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అప్పటి నుంచి ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ల జారీలో అసలు సమస్యలు తలెత్తాయి.
2015 నుంచి నేటివరకు 100 మందికిపైగా ఓబీసీ అభ్యర్థులు నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ సమర్పించి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యారు. వారి తల్లిదండ్రులు ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రైవేట్‌రంగంలో పనిచేస్తున్నవారు కనుక కేంద్ర ప్రభుత్వలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌లోని అధికారులు అభ్యర్థులు సమర్పించిన నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లపై అభ్యంతరం తెలిపారు. అధికారుల నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది అభ్యర్థులు చెన్నైలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, తమిళనాడు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో కేసులు వేశారు.
ఈ నేపథ్యంలో ఆయా కోర్టులు కేంద్ర ప్రభుత్వ అధికారుల తీరును తప్పుపడుతూ, అసలు సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం/హోదా ఉంటుంది. కానీ ప్రైవేట్‌రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాజంలో గౌరవం/హోదా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండదని పేర్కొన్నాయి.
వెంటనే ఆ అభ్యర్థులకు ఓబీసీ నాన్ క్రీమీలేయర్ కోటాలో నియామకాలు ఇవ్వాలని ఆదేశించాయి. అయినా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆయా తీర్పులను పక్కనపెడుతూ, సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. కానీ న్యాయస్థానం తిరస్కరించింది. నష్టపోయిన అభ్యర్థులకు వెంటనే సూపర్‌న్యూమరీ పోస్టుల్లో వారికి రావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఉన్నత పోస్టుల్లో నియమించాలని ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని వెంటనే పూర్తి వివరణలతో కూడిన ఉత్తర్వులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేయాలి. ఉద్యోగుల జీతభత్యాలు లేదా వ్యవసాయ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ల జారీని తిరస్కరించకుండా బీసీ కులాలకు న్యాయం చేయాలి.
– (వ్యాసకర్త: తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
కోడెపాక కుమారస్వామి 94909 59625