ఫ్రస్ట్రేషన్లో అరిచే అరుపులకు, తిట్టే తిట్లకు ప్రజలు ప్రభావితం కారు. ఓట్లు పడవు. ఇది డిజిటల్ యుగం. ఎవరైనా పొరపాటు ఒక్కసారే చేస్తారు. పొరపాటు జరిగిందని తెలిశాక, దాన్ని సరిదిద్దుకొనే అవకాశం కోసం చూస్తారు. ఇప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అలాంటి అవకాశం వచ్చింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 4 లక్షల ఓటర్లు ఈ అవకాశాన్ని ఈ రోజు ఆయుధంగా వాడుకోబోతున్నారు. నవంబర్ 14 నాడు ప్రపంచానికి ఒక నిజాన్ని చాలా స్పష్టంగా తెలియజేయబోతున్నారు- అజ్ఞానం, అసమర్థతలతో నిండిన రాజకీయం వేరు, రాష్ర్టాభివృద్ధి కోసం అహరహం శ్రమించే సంకల్పం ఉన్న రాజకీయం వేరు అని.
తెలంగాణ ప్రజలకు ఇప్పుడు రాష్ర్టాభివృద్ధి కావాలి. ప్రస్తుత ప్రభుత్వం రాకముందు తెలంగాణ ఆవిర్భావం తర్వాతి పదేండ్లలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో కండ్లారా చూశారు తెలంగాణ ప్రజలు. అంతకుముందు అరువై ఏండ్లపాటు ఉమ్మడి రాష్ట్రం నేపథ్యంగా, తెలంగాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసం చూశారు. అసలు ఈ ప్రాంత అభివృద్ధినే ఎగతాళి చేసిన అహంకారాన్ని చూశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎవరు ఏంటి అన్నది వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉద్యమశక్తిగా ఏం సాధించగలరో చూశాం. ఒక కొత్త రాష్ట్ర సారథిగా రాష్ర్టాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎలా తీర్చిదిద్దగలిగారో చూశాం. అంతా బాగుందనుకున్న సమయంలో, పదేండ్ల తర్వాత మళ్లీ శత్రుగణమంతా అంతర్గతంగా ఒక్కటై, మార్పు అనే మాయతో, వందల అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చగలిగారు.
రాజకీయాల్లో మార్పు సహజం. కానీ, ఆ మార్పు మంచి కోసం జరగాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి. కానీ, గత రెండేండ్లలో అలా జరగలేదు. మిగిలిన మూడేండ్లలో కూడా ఏదో జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. జరిగేది ఒక్కటే- ఎప్పటికప్పుడు ప్రజలను పక్కదారి పట్టించేలా.. తెల్లారి లేస్తే కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, బీఆర్ఎస్ను ఆడిపోసుకోవడం, జుగుప్సాకరమైన భాషలో తిట్టడం. కానీ, ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై-ఎలక్షన్ ఫలితాలు దీనికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నాయి. ఇంకో మూడేండ్ల తర్వాతైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి తిరిగి పట్టాలెక్కడం కోసం, ఈ ఫలితాలు బీఆర్ఎస్కు అనుకూలంగా రావడం అత్యవసరం.
కట్ చేస్తే- రాజకీయాలు రాజకీయాలే. తెలిసో తెలియకో అంతకుముందు జరిగిన చిన్న చిన్న పొరపాట్లను ఒక్కొక్కటిగా సరిదిద్దుకొంటూ, పక్కా స్ట్రాటెజిక్ ప్రణాళికతో, కేసీఆర్ మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న నిర్విరామ కృషి కండ్లముందు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్ పరిచయం చేసిన ఆధునిక ఆడియో-విజువల్ ఎన్నికల ప్రచారసరళి నిజంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక గొప్ప ప్రారంభానికి సూచన. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎవరేం చేశారన్నది అంకెల్లో, గ్రాఫిక్స్ రూపంలో కచ్చితమైన ఆధారాలు, రిపోర్ట్‌లతో చూపించడం ద్వారా ప్రజలే అన్నీ తెలుసుకుంటారు. పచ్చి అబద్ధాలతో, వినడానికే సిగ్గనిపించే అపభ్రంశ భాషతో ఎవరెంత ఊదరగొట్టినా, ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా గుడ్డిగా నమ్మి మోసపోవటమనేది ఇకమీదట జరుగదు. ఈ విషయంలో ఎన్నికల్లో డిజిటల్ ప్రచారానికి తెరలేపిన కేటీఆర్‌ను అభినందించాల్సిందే.
ఈ నేపథ్యంలో… తెలంగాణ రాష్ర్టాన్ని చాలా విషయాల్లో ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ఒక వైపు. కాగా, అరవై ఏండ్ల పాటు తెలంగాణను ఒక వెనుకబడిన ప్రాంతంగానే నిలిపి, ఈ ప్రాంతానికి ఏమీ చేయకపోగా, మళ్లీ గత రెండేండ్లుగా అదే అసమర్థతను కొనసాగిస్తున్న కాంగ్రస్ ఇంకోవైపు. జూబ్లీహిల్స్‌లోని ఓటర్లకు రావల్సినంత స్పష్టత వచ్చేసింది. రాజకీయంగా, సంక్షేమం పరంగా, అభివృద్ధి పరంగా బీఆర్ఎస్ ఏం చేయగలదు, కాంగ్రెస్ ఏం చేయగలదన్నది కూడా వారికి తెలుసు. గత ఎన్నికల్లో వలె ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు. జూబ్లీహిల్స్ ఇంతకుముందు కూడా బీఆర్ఎస్దే, ఇప్పుడు కూడా బీఆర్ఎస్దే అని జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పుడు తీర్పు చెప్పబోతున్నారు.
– (వ్యాసకర్త: సినీ దర్శకుడు) మనోహర్ చిమ్మని