తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు ప్రకటించిన హామీలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇది నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ముఖ్యంగా ‘జాబ్ క్యాలెండర్’ విషయంలో దాని ఊసే ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం, వాగ్దానాలు చేసి మర్చిపోయిందన్న విమర్శలు నిరుద్యోగుల్లో వెల్లు వెత్తుతున్నాయి.
ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ప్రసంగాలకే పరిమితమైంది. ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేకపోవడమే కాకుండా, వివిధ శాఖల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న వేలాది పోస్టులకూ నియామక ప్రక్రియ మొదలవ్వలేదు. 2024 చివరి నాటికి 9,000 మంది ఉద్యోగ విరమణ పొందగా, 2025 ఆర్థిక సంవత్సరం చివరికి మరో 9,000 మంది రిటైరవుతారు. ఇవన్నీ భర్తీ చేయాల్సిన పోస్టులే కానీ, నియామక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, సెప్టెంబర్ 17 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించినా, ఇప్పటివరకు ఏ శాఖ నుంచి కూడా స్పష్టమైన వివరాలు వెలువడలేదు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం, క్యాడర్ స్ట్రెంత్ విభజనపై స్పష్టత లేకపోవడం, విభాగాల పునర్వ్యవస్థీకరణ జరగకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ వర్గాలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలవకుండా పోయాయి. ఇది ఆ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. సర్వే, ల్యాండ్ రికార్డుల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఇప్పటికీ పునర్వ్యవస్థీకరణ జరగక కొట్టుకుంటున్నాయి. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు మున్సిపల్ ఇంజినీర్ పోస్టులు మంజూరు కాలేదు. నీటి పారుదల శాఖలో 36 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. విద్యా శాఖలో అన్ని జిల్లాలకు డీఈవో పోస్టులు ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇంటర్మీడియట్ విద్యాధికారుల పోస్టులే లేవు. కొత్తగా ఏర్పాటైన కాలేజీలకు పోస్టులు మంజూరు చేయలేదు. నోడల్ అధికారులతోనే వ్యవస్థ నడుస్తోంది.
ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతిని అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. ఎవరి ఆధారంతో ఎలా అర్హత నిర్దేశించబడుతుందో స్పష్టత లేదు. సాంకేతికంగా ఎలా అమలు చేస్తారు అన్నదీ తెలియదు. ఏడు జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. స్కిల్ సెంటర్ల ఏర్పాటూ ఆమోద దశలోనే నిలిచిపోయింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ధ్యేయం ఆచరణకు దూరంగా ఉందనే అభిప్రాయం యువతలో నెలకొంది.
విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల భరోసా ఇవన్నీ ఓటు వేసే ముందు వినిపించిన వాగ్దానాలుగా మిగిలిపోయాయి. ఎలాంటి ప్రణాళిక గాని, నిధుల విడుదల గాని జరుగలేదు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత వైఫై, యూనివర్సిటీల రీసెర్చ్ స్కాలర్స్‌కు నెలకు రూ.10 వేల ఫెలోషిప్ వంటి హామీలు కూడా ప్రయోగ దశలోనే ఉన్నాయి.విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనం రూ.50 వేలకు పెంచుతామని చెప్పిన మాటలు అమలులోకి రాలేదు. తొలిసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేరు నమోదు చేస్తే, ఆ ఏడాదిలో మిగతా నోటిఫికేషన్లకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్న హామీ కూడా ఇంకా అమలులోకి రాలేదు. పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ అంత వేగంగా సాగడం లేదు. నియమిత ఉద్యోగాలను భర్తీ చేయకుండా, రిటైర్డ్ ఉద్యోగులనే మళ్లీ కాంట్రాక్ట్ లేదా కన్సల్టెంట్ రూపంలో కొనసాగిస్తూ, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో వ్యవస్థ నడిపిస్తున్న తీరు విస్తృత స్థాయిలో విమర్శలకు లోనవుతోంది. ఒకవైపు ఉద్యోగ ఖాళీలు పెరుగుతుంటే, మరోవైపు నియామకాలు జరగకపోవడమే కాకుండా, కింది స్థాయి ఉద్యోగాలకు కూడా ప్రమోషన్ రాకపోవడం వల్ల ఉద్యోగ వ్యవస్థ అంతా ఇబ్బందుల్లో పడుతోంది.
తెలంగాణ రాష్ట్ర యువత, ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం వృథా కాకూడదు. ఒకవేళ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైతే ప్రజాస్వామ్య వ్యవస్థపై గల విశ్వాసాన్నే దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవ్వబడినవని నిర్ధారితమైతే, అది తర తరాలకు తీవ్ర ద్రోహంగా నిలుస్తుంది.