భారతదేశంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే అంశం ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ, దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దేశంలో తరుచుగా ఎన్నికలను నివారించటం, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని తగ్గించటం జమిలి ఉద్దేశం. కానీ మనదేశంలో జమిలి ఎన్నిక లు సాధ్యం కావని, అయినా ఇంతటి ముఖ్యమైన అంశా న్ని అధ్యయనం చేసే బాధ్యతను ఒక మాజీ రాష్ట్రపతికి ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
జమిలి ఎన్నికలు భారత చరిత్రలో కొత్తేమీ కాదు. గతంలో జరిగినవే. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, 1951-1952లో లోక్స భ, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించింది. ఆ తర్వాత కూడా ఈ విధానం 1967 వరకు కొనసాగింది. అయితే ఆర్టికల్ 356 తో కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఈ విధానానికి అంతరాయం కలిగింది. కొన్ని కారణాల వల్ల మరి కొన్ని రాష్ర్టాల్లోనూ అంతరాయం కలగడంతో కాలక్రమేణా చాలా రాష్ర్టాల్లో ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి కొన్ని రాష్ర్టాల్లో మాత్రమే లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
2018 ఆగస్టులో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏకకాల ఎన్నికలపై ఒక ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఇది అనేక రాజ్యాంగపరమైన, చట్టపరమైన సవాళ్లను ముందుంచింది. జమిలి ఎన్నికలకు రాజ్యాం గం, 1951 ప్రజాప్రతినిధుల చట్టం, లోక్‌సభ, అసెంబ్లీల విధివిధానాల్లో సవరణలు అవసరమని కమిషన్ సూచించింది. కనీసం 50 శాతం రాష్ర్టాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాలని కూడా సిఫారసు చేసింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కమిషన్ అనేక ప్రయోజనాలను కూడా గుర్తించింది. ముఖ్యంగా ఎన్నికల ఖర్చు ఆదా, పరిపాలనా సౌలభ్యం, సకాలంలో పాలసీ అమలు, నిరంతరం ఎన్నికల ప్రచారం కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టడం లాంటి ప్రయోజనాలను గుర్తించింది . అయితే ఈ అంశం లా కమిషన్ పరిధిలోకి వెళ్లటంతో రాజకీయ పార్టీలు పెద్దగా దృష్టి సారించలేదు.
లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(2),172 ఐదేండ్ల పాటు నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశిస్తున్నందున, ముందస్తు రద్దుకు సంబంధించిన నిబంధనలతో కూడిన సాధ్యాసాధ్యాలు ప్రధానమైన ఆందోళనల్లో ఒకటి. పదవీకాలంలో మధ్యంతర ఎన్నికలు వస్తే ఏమవుతుంది? ప్రతి రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా, లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అనేది తేలాలి. దాని కి అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించడం చాలా సంక్లిష్టమైనది. దానివల్ల కలిగే పరిణామాలు తదుపరి సవరణలకు, మరిన్ని ఆందోళనలకు దారితీయవచ్చు.రాబోయే ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే లోక్‌సభ ఎన్నికలపై కొంతమేర ప్రభావం చూపవచ్చన్న అభిప్రాయం బీజేపీలో ఉన్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు పునరాలోచనలో పడ్డారు.
తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజో రం, జార్ఖండ్ రాష్ర్టాలకు ఈ డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. వీటితో పాటు వచ్చే ఏడాది మరిన్ని రాష్ర్టాలు , లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. దీన్నే అనుకూలంగా మార్చుకొని పది, పన్నెండు రాష్ర్టాలతో కలిపి లోక్‌సభకు కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జమిలి ప్రక్రియ పూర్తికానట్లయితే కనీసం ఈ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించే అవకాశాలను జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.
జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తిని సవాలు చేస్తున్నవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్న విధంగా భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఆలోచనకు ఇది పూర్తి విరుద్ధం. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని, జాతీయ సమైక్యత మధ్య వచ్చే ఉద్రిక్తతలు ఈ అంశంలో ప్రధానమైనవి. రాష్ర్టాలు తమ ఎన్నికల షెడ్యూల్‌పై నియంత్రణను కోల్పోతాయి. అలాగే దీనివల్ల రాష్ర్టాల సమస్యలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఎన్నికల ప్రచారమంతా జాతీయ సమస్యలమీదే సాగుతుంది.
ప్రస్తుతమున్న విధానం జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలకున్న వేర్వేరు వ్యవస్థలు, వివిధ సమస్యలను విడివిడిగా పరిష్కరించేలా చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ జవాబుదారీతనాన్ని సూచిస్తుంది. జమిలి ఎన్నికల నేపథ్యంలో జాతీయ సమస్యలు ప్రధానమై రాష్ర్టాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తాయి.
ఒకే దేశం, ఒకే ఎన్నికల ఆలోచన ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో అమలవుతున్న బహుముఖ సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. దీనికి చట్టపరమైన, రాజ్యాంగపరమైన మార్పులు మాత్రమే కాకుండా బలమైన రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. ప్రజాస్వామ్య సంక్లిష్టతలను నిర్వహించడానికి స్పష్టమైన ఆమోదయోగ్యమైన విధానాలు కూడా అవసరం.
(వ్యాసకర్త :భారత జాగృతి యూరోప్ ప్రెసిడెంట్)