పదకొండేండ్ల నుంచి కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో దాదాపు బుల్డోజర్లా సాగుతూ వచ్చింది బీజేపీ ప్రభుత్వం. కానీ, కమలం సర్కారుకు తీవ్ర సంక్షోభ కాలం మొదలైందని 2025 జూలై చివరి వారం నుంచి దేశంలో జరుగుతున్న పలు పరిణామాలు చెబుతున్నాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించడానికి అనుమతి కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును జూలై చివర్లో నాటి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించడంతో మోదీ సర్కారు నానాటికీ బలహీనమవుతున్నదనే వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ఎన్డీయే సర్కారును ఇబ్బందిపెట్టడానికే ఈ నోటీసుకు ధన్‌ఖడ్ ఆమోదముద్ర వేశారనే భావనతో ‘బీజేపీ కేంద్ర నాయకత్వం’ ఒత్తిడి చేయడం వల్లే ఆయన హఠాత్తుగా ‘అనారోగ్య’ కారణాలతో రాజీనామా చేశారనే ప్రచారం సర్వత్రా వ్యాపించింది. అన్ని సందర్భాల్లో బీజేపీని, కాషాయ ప్రభుత్వాల విధానాలను గట్టిగా సమర్థించే ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించారు మోదీ. దీంతో ఆయన అందరూ అనుకున్నంత బలవంతుడు కాదని, నిరంతరం ‘ఉక్కుపాదం’తో పాలన సాగించడం ఆయన వల్ల కాదని తేలిపోయింది. ఎప్పుడూ హుషారుగా, దూకుడుగా కనిపించే రాజస్థానీ జాట్ నేత ధన్‌ఖడ్ అప్పటి నుంచీ కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. తమిళనాడు ఎంపీ, వీసీకే నేత తోల్ తిరుమావలన్ ఒక అడుగు ముందుకేసి బీజేపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కేంద్ర సర్కా రు బెదిరించి ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించింది. అంతటితో ఆగకుండా ఆయనను ఇప్పుడు గృహ నిర్బంధంలో ఉంచింది’ అని ఆరోపించడం మోదీ ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తున్నది.
లోక్‌దళ్, కాంగ్రెస్ నేపథ్యం ఉన్నా ‘హిందుత్వ’ సిద్ధాంతాలను బలంగా సమర్థిస్తూ వచ్చిన ధన్‌ఖడ్‌ను అత్యంత అవమానకర రీతిలో ఇంటికి సాగనంపడం ప్రధానిగా మోదీ బలహీనతకు అద్దం పడుతున్నది.ఐదేండ్లు, అంతకన్నా ఎక్కువ జైలు శిక్షపడే అవకాశమున్న నేరారోపణలపై అరెస్టయిన ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రుల నిర్బంధం 30 రోజులు దాటితే, వారు తప్పక రాజీనామా చేయడం లేదా వారిని తొలగించడానికి అవకాశమిచ్చే మూడు బిల్లులను ఇటీవల మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియడానికి రెండు రోజుల ముందు ఈ బిల్లులను తీసుకురావడం బీజేపీ సర్కారు ఎంతటి సంక్షుభిత మానసిక స్థితిలో ఉందో చెప్పకనే చెప్తున్నది.
కోర్టు విచారణ జరిగి, శిక్షలు ఖరారు కాకుండానే నేతలపై కేవలం ఆరోపణల కారణంగా నిర్బంధం గడువు ముగిసిందనే సాకుతో పదవుల నుంచి తొలగించడం అన్యాయమని, న్యాయసూత్రాలకు విరుద్ధమని న్యాయకోవిదులు చెప్తున్నారు. పైకి మాత్రం నిర్బంధంలో ఉన్న ప్రధానికి సైతం 30 రోజుల గడువు దాటితే పదవి నుంచి ఉద్వాసన పలకడం గొప్ప ప్రతిపాదనగా పాలకపక్షం ప్రచారం చేసుకుంటున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నేరారోపణలపై అరెస్టయి జైళ్లలో ఉన్న నాటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌లను దృష్టిలో పెట్టుకొని మోదీ ఈ బిల్లులను తీసుకొచ్చారనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతానికి ఈ మూడు బి ల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాల ని నిర్ణయించారు. కానీ, ఇంత హడావుడిగా ఈ ‘ఉద్వాసన’ బిల్లులను రూపొందించడం మోదీ సర్కారు ఎంతటి సంక్షోభంలో ఉందో స్పష్టం చేస్తున్నది.
స్వాతంత్య్రం వచ్చాక భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపిన అత్యవసర పరిస్థితి ప్రకటనకు 50 ఏండ్లు నిండిన సమయంలోనే దేశం మరోసారి ‘ఎమర్జెన్సీ’ని గుర్తుచేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాషాయపక్షం ఏలుబడిలో ఎంతో కాలంగా సాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ నిజమేననే భావన ఇటు ప్రతిపక్షాల్లో, అటు ప్రజల్లో ఇప్పుడు కలుగుతున్నది. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ మాదిరిగా సుదీర్ఘకాలం ఇండియాను ఉక్కు పిడికిలితో 16 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తరచు గుర్తుచేసుకునేలా చేస్తున్నారు ‘హిందుత్వ’ నేత మోదీ. గొప్ప ప్రజాస్వామికవాదిగా పేరుగాంచిన నెహ్రూ కుమార్తె ఇందిర మాదిరిగానే అత్యంత బలమైన, నియంతృత్వ పోకడలున్న ప్రధానిగా మోదీ పేరుతెచ్చుకున్న విషయం కొత్తదేమీ కాదు. ఆరంభంలో గట్టి ప్రయత్నాలు లేకుండానే 1966లో దేశ ప్రధాని అయిన ఇందిర తన పాలనలో లోటుపాట్లు, ప్రతిపక్షాల సమరశీలత ఫలితంగా 1970ల మధ్య నాటికి భయకంపితులయ్యారు. పదవీగండం భయంతోపాటు, ప్రతిపక్షాలపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు. కక్ష సాధింపు ధోరణులతో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లకు పంపించే ఎమర్జెన్సీని 1975 జూన్ 25న ప్రకటించారు.
ఇప్పుడు దేశంలో ప్రతిపక్ష పార్టీలపై మోదీ సర్కారు కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం తరహాలో దూకుడుగా,దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నది. ప్రాంతీయ పక్షాలు ప్రతిపక్షాలుగా బలంగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, తెలంగాణ వంటి రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నది.
వచ్చే అక్టోబర్నవంబర్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్) పేరుతో 65 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించడం మోదీ సర్కారు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ద్వారా చేయించిన అత్యంత ‘చట్టబద్ధ’ అక్రమం. బీహార్‌లో ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ సహా దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలు ఈ సామూహిక ఓట్ల తొలగింపు చర్యను సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో పరిస్థితి కొంత మెరుగైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సకాలంలో జోక్యం చేసుకుని ఈ 65 లక్షల మంది ఓటర్ల పేర్లు, వారి పేర్ల తొలగింపునకు కారణాలను ప్రకటించాలని ఆదేశించింది. దీంతో భారత ప్రజాస్వామ్యం మోదీ సర్కారు అక్రమాల నుంచి కొంత మేరకు తప్పించుకోగలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం పాటించడం శుభపరిణామం. 2014లో హస్తినలో బీజేపీ సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల బాటలోనే ఎన్నికల సంఘాన్ని మరో సీబీఐగా తన పంజరంలోని పక్షిలా మార్చే ప్రయత్నంలో కమలం పార్టీ విజయం సాధించిందని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి.
ప్రపంచ చరిత్రలో పదకొండు సంవత్సరాల ఉక్కు పాలన తర్వాత అనేక మంది నియంతలు, బలవంతులైన పాలకులు పతనావస్థకు చేరుకున్నారని, ఆ సమయంలో వారు అనేక తప్పులు చేసి అధికారం కోల్పోయారని ప్రసిద్ధ చరిత్రకారుడు, హక్కుల ఉద్యమ నేత, ప్రఖ్యాత జర్నలిస్టు ఆకార్ పటేల్ ఐదు నెలల క్రితం రాసిన ఒక వ్యాసంలో గుర్తుచేశారు. ఇందిరాగాంధీ తన పదకొండు సంవత్సరాల నియంతృత్వ, ‘సంక్షేమ’ పాలన తర్వాత 1977లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం పాలయినట్టే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పాలకులు దశాబ్దం ఏలుబడి తర్వాత అధికారానికి దూరమయ్యారు. ‘చివరికి ప్రతి హీరో ప్రజలకు విసుగుపుట్టించే మనిషిగా తయారవుతాడు’ అని 19వ శతాబ్దపు ప్రసిద్ధ అమెరికా ప్రముఖుడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ చెప్పినట్టు.. ఇప్పటికీ అనేక దేశాల్లో పదేండ్లకు మించి పాలన సాగించిన పలువురు మహా నాయకులు మట్టికరిచే పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి.
ఆకార్ పటేల్ తన వ్యాసంలో వివరించినట్టు ఫ్రెంచి నియంత నెపోలియన్ తన 11 ఏండ్ల పాలన అనంతరం వాటర్లూ యుద్ధంలో ఓడిపోయి అధికారం కోల్పోయాడు. మహానేత మావో జెడాంగ్ మరణానంతరం 74 సంవత్సరాల వయసులో 1978లో చైనా పాలకుడిగా అధికారపగ్గాలు చేపట్టిన డెంగ్ జియావోపింగ్ కూడా దశాబ్దం దాటాక తియనాన్మెన్ ఊచకోత జరిగిన 1989లో పదవి నుంచి దిగిపోయారు. ప్రస్తుత పాలకుల్లో ప్రముఖులైన తుర్కియే నేత తయ్యిప్ ఎర్దోగన్, రష్యా నేత వ్లాదిమిర్ పుతిన్ దశాబ్దాల పాలన తర్వాత కూడా ఇప్పుడు అధికార పీఠాలపై ఉన్నారు. కానీ, వారు తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. ఎర్దోగన్ 2003 మార్చిలో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ అధికార పీఠాలపై కొనసాగుతూనే ఉన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గత పాతికేండ్లుగా అపరిమిత అధికారాలతో దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. పుతిన్ పాలనా కాలంలో మొదట రష్యాలో జనం తలసరి ఆదాయం విపరీతంగా పెరిగినా, ప్రస్తుతం అది తగ్గిపోతున్నది.
ఇక, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో పదకొండు సంవత్సరాల క్రితం బీజేపీ నేతగా మోదీ ప్రధాని పదవిని చేపట్టి, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అదే పదవిని చేజిక్కించుకున్నారు. మూడోసారి ఎన్నికల్లో (2024) బీజేపీకి గతంలో రెండుసార్లు వచ్చినట్టు లోక్‌సభలో సొంత మెజారిటీ రాలేదు. కానీ, ఆయన సంకీర్ణ సర్కారు ప్రధానిగా గాక మెజారిటీ పార్టీ పాలకుడిగా తన పెత్తందారీ పోకడలను కొనసాగిస్తున్నారు.
ఏ మాత్రం అవకాశమొచ్చినా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. పదేండ్ల తర్వాత లోక్‌సభలో గుర్తింపు పొందిన ప్రతిపక్షానికి అవసరమైన స్థానాలు పొందిన కాంగ్రెస్ పాలకపక్షానికి దీటైన ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడం మోదీకి కొం డంత బలాన్ని ఇస్తున్నది. అయినప్పటికీ పటిష్ఠమైన ప్రాంతీయపక్షాలు ప్రతిపక్షాలుగా ఉన్న బీహా ర్, తెలంగాణ వంటి అనేక రాష్ర్టాల్లో బీజేపీ సర్కా రు అప్రజాస్వామిక, అడ్డగోలు వైఖరితో వ్యవహరిస్తున్నది. ఉపరాష్ట్రపతి రాజీనామా వ్యవహారం, పార్లమెంటులో మూడు ‘ఉద్వాసన’ బిల్లుల ద్వా రా మోదీ కూడా అనేక మంది ప్రపంచ నేతల మాదిరిగానే సంక్షోభ దశలోకి ప్రవేశించారని భారతీయులు గుర్తిస్తున్నారు. 75 ఏండ్లు నిండిన ‘మహానేతలు’ పదవుల నుంచి నిష్క్రమించాలన్న బీజేపీ అలిఖిత నిబంధన వచ్చే నెల సెప్టెంబర్‌లో ఏడున్నర దశాబ్దాల జీవితం పూర్తి చేసుకునే మోదీ కి వర్తిస్తుందా? అనే విషయాన్ని ప్రస్తుత సంక్షోభాలు నిర్ణయించే అవకాశం లేకపోలేదు.
-నాంచారయ్య
మెరుగుమాల