జలవివాదాలు, జల సంబంధిత యుద్ధాలు ప్రపంచంలో కొత్తేమీ కాదు. అలాగని మన దేశంలోనూ జల వివాదాలకు నేటికీ పరిష్కారం చూపలేదు. నికర, మిగులు, వరద జలాలతో రాష్ర్ర్టాల మధ్య అంతర్యుద్ధాలకు 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో తెరపడకపోవడం విచారకరం. జల వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడం క్లిష్టమే కావచ్చు కానీ, వివాదాలకెందుకు మోక్షం లభించడం లేదు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఎందుకు పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నదనేది ఇక్కడ ప్రశ్న.
కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే ఇప్పటిదాకా కేంద్రం అనుమతులిస్తున్నది. అదే శాస్త్రీయత, ధర్మం కూడా. శ్రీశైలం, శ్రీరాంసాగర్ సహా అనేక ప్రాజెక్టులను నికర జలాల ఆధారంగానే కట్టారు. వడ్డించేవాడు మనవాడే, ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అన్నట్టుగా వరద జలాలతో రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టు కడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా.. లేదా నియంతృత్వమా? ఈ నేపథ్యంలో నీళ్ల కోసం నిప్పులు పుట్టించిన తెలంగాణ ఉద్యమ గుర్తులను మరోసారి నెమరువేసుకోవాల్సి వస్తున్నది. ఏపీ, తెలంగాణ మధ్య నిప్పు రాజేస్తున్న బనకచర్లపై మరో ఉద్యమానికి బరిగీసి కొట్లాడాల్సిన తరుణం ఆసన్నమైంది.
నదీ జలాలను పంచుకునే విషయంలో సంబంధిత రాష్ర్టాల మధ్య పరస్పర అవగాహన ఉండాలి. జలాల సమాచారం పారదర్శకంగా ఉండాలి. జల వివాదాలను పరిష్కరించడానికి సమగ్ర విధానాన్ని అనుసరించాలి. కానీ, వీటన్నింటినీ పట్టించుకోకుండా కేంద్రంలో బలం ఉంది కదా అని, తెలంగాణపై మరోసారి బాబు కుట్రలు చేస్తున్నారు. ఆయన కుట్రలను తెలంగాణ చూస్తూ ఊరుకోదు కాక ఊరుకోదు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లోని నదుల్లో ప్రవహించే నీటి పరిమాణాన్ని లెక్కించి, నీటి లభ్యతను తేల్చి ఆయా రాష్ర్టాలకు జలాల కేటాయింపులు చేసేందుకు నదీ ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. ఇలా దేశంలో దాదాపు ఎనిమిది ట్రిబ్యునళ్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఐదు మనుగడలో ఉన్నాయి. కానీ, ఏ ట్రిబ్యునల్, ఏ అంతర్రాష్ట్ర చర్చల్లేకుండా బనకచర్లను నిర్మించే కుట్రకు చంద్రబాబు తెరలేపారు. సాహసం చేశారు. దీన్నిబట్టి తెలంగాణ పట్ల ఆయనకున్న వ్యతిరేక ధోరణిని అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి తెలంగాణలో గోదావరి జలాల వినియోగాన్ని కుట్రపూరితంగా తగ్గించి చంద్రబాబుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారు.
ఒక జాతీయ ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఆయా రాష్ర్టాలు కేంద్ర జల సంఘం అనుమతితో ప్రాజెక్టులను నిర్మించాలన్నా అన్నింటికంటే ముందుగా రేకెత్తే ప్రశ్న నీటి కేటాయింపులు ఉన్నాయా? అని. ఈ నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ ఆధారంగానే జరుగుతాయి. అందుకే ఇప్పటివరకు కేంద్రం అనుమతులు ఇచ్చిన ప్రతి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులే ప్రామాణికం. కానీ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, జాతీయ నీటి ప్రమాణాలకు భిన్నంగా చంద్రబాబు చెప్తున్న వృథాజలాల ఆధారిత బనకచర్లకు మోదీ ప్రభుత్వం అనుమతులు ఎలా ఇస్తుంది?
ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృథాగాపోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగ్గా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతున్నది. కానీ, ఇక్కడే ఏపీ సర్కారు కుట్రలు దాగి ఉన్నాయి. గోదావరిలో ఏటా 2 వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ చెబుతున్నది. కానీ, ఎగువన తెలంగాణ సహా మిగిలిన రాష్ర్టాలకూ ఏపీలాగా వృథా జలాలపై వాటా ఉంటుంది.
రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దీనికి ప్రధానమంత్రి కృషి సింఛాయ్ యోజన (పీఎంకేఎస్‌వై), యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం (ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇంట్రా స్టేట్ లింక్ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం చర్చించారు.
మూడు దశల్లో గోదావరి-బనకచర్ల అనుసంధానం చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణా నదికి జలాలను మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచుతారు. ప్రస్తుతం కుడికాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులు ఉండగా, దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. కొత్తగా 25 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. రెండో దశలో కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వలో 80వ కిలోమీటరు వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు. మూడో దశలో బొల్ల్లపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అరణ్యం మీదుగా బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు.
మొత్తంగా తొలి దశ పనులకు రూ.13,511 కోట్లు, రెండో దశ పనులకు రూ.28,560 కోట్లు, మూడో దశ పనులకు రూ.38.041 కోట్లు మొత్తంగా రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకోసం 48 వేల ఎకరాల భూసేకరణ జరుపుతున్నారు. ఇందులో 17 వేల ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ బనకచర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరమని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. అంటే పేరుకు గోదావరి నీళ్లే అయినా ఇత్తేసి పొత్తుకూడి కృష్ణా జలాలకు సూటి పెడుతున్నారని చెప్పాలి.
సముద్రంలో కలిసే వృథా జలాలకు కేంద్రం అనుమతులు ఇచ్చి, నిధులు సమకూరిస్తే భవిష్యత్తులో మిగిలిన రాష్ర్టాలు కూడా సముద్రంలో కలిసే జలాల ఆధారంగానే ప్రాజెక్టులను రూపొందించుకుంటాయి. ఇదే జరిగితే ఎగువ రాష్ర్టాల హక్కుల్ని కాపాడేదెవరు? ప్రధానంగా కృష్ణాలో కూడా ఈ ఏడాది (2024-25) 858 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. 2023-24 నీటి సంవత్సరంలో 72 టీఎంసీలు, 2022-23 నీటి సంవత్సరంలో 765 టీఎంసీలు సముద్రంలోకి పోయాయి. మరి వీటి ఆధారంగా తెలంగాణ గాని, ఇతర రాష్ర్టాలు గాని ప్రాజెక్టుల రూపకల్పన చేస్తే కేంద్రం అనుమతి ఇస్తుందా? కావేరికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రం తాపత్రయ పడుతున్నది. కేంద్రం బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి కావేరీ అనుసంధానాన్ని తెరపైకి తెస్తే దక్షిణాది రాష్ర్టాల జలాల పంపిణీల్లో మరిన్ని చిక్కుముళ్లు, వివాదాలు రాజుకుంటాయి.
వైఎస్ హయాంలో వరద జలాల ఆధారంగా పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగింది. కృష్ణా బోర్డు ముందు ఏపీ పోతిరెడ్డిపాడుకు నీటి కేటాయింపులు ఉన్నట్టు గిరిగీసి మరీ ఏటా వందల టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలిస్తున్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తే పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందడం లేదని, వెంటనే నిలిపివేయాలని బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నది. ఇట్లాగే భవిష్యత్తులో బనకచర్ల, కావేరీకి నీళ్లు సరిపోవడం లేదని, వెంటనే కాళేశ్వరం, దేవాదుల ఎత్తిపోతలను నిలిపివేయాలని ఫిర్యాదులు చేసే పరిస్థితులు కూడా దాపురించే ప్రమాదం ఉంది.
పోలవరంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఎగువ రాష్ర్టాలకు కృష్ణాజలాల్లో వాటా పెంచినట్లుగా ఇందులోనూ వాటా ఇస్తారా? అస లు గోదావరిలో శాస్త్రీయంగా ఎంత నీటి లభ్యత ఉన్నది? ఎగువ రాష్ర్టాల ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు ఏమిటనే లెక్కలు తీయాలి. అవన్నీపోగా మిగులు ఉన్నాయని తేలితే బనకచర్లకు కేంద్రం అనుమతులు ఇవ్వాలి. తద్వారా ఆ ప్రాజెక్టుకు ఎంత నీళ్లు కేటాయిస్తారో, అంతమేర కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనపు వాటా ఇవ్వాలి.
గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ కుట్రలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకం.
తమిళనాట రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. దీనిపై కేసీఆర్ హయాంలోనూ కేంద్రంలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అనేక సమావేశాలు నిర్వహించింది. అయితే గోదావరిలో ఆయా రాష్ర్టాలు వాడుకోగా మిగులు జలాలుంటే శాస్త్రీయంగా లెక్క తేల్చి, అప్పుడు కావేరీకి తరలించాలని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ లెక్కలను ముందు వేసుకోవడం వృథా ప్రయాస అని భావించిన మోదీ ప్రభుత్వం చంద్రబాబును రంగంలోకి దింపింది. ఆ మేరకు చంద్రబాబు వృథా జలాలంటూ బనకచర్ల ప్రాజెక్టును రూపొందించి, గోదావరిని తరలించుకుపోవాలని స్కెచ్ వేశారు. ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలనే కాలరాసే కుట్ర జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకువెళ్లకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఊరూవాడా మరో ఉద్యమ కేంద్రం కావాలి. ప్రతి తెలంగాణ బిడ్డ మరో కేసీఆర్ అవ్వాలి.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)
-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి