ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధా న్యం ఇవ్వకపోవడం వల్ల కూడా తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయింది. గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ, తెలంగాణ జాతిజనుల ఆకాంక్షలను తీర్చే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమతుల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ప్రణాళికాబద్ధంగా ద్వితీయశ్రేణి నగరాలను ప్రగతి బాటన పరుగులెత్తిస్తున్నారు. దీంట్లో భాగమే ఐటీ విస్తరణ. గతంలో హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఐటీ కంపెనీలు నేడు పలు జిల్లాల్లో కొలువు దీరుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల యువ నిపుణుల చెంతకు ఐటీ ఉద్యోగాలు తరలి వస్తున్నాయి. ఒకనాడు కరువుతో తల్లడిల్లి, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలు నేడు ఐటీ టవర్లకు నిలయమై ఆధునిక సొబగులతో విరాజిల్లుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సాధారణంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో బీపీఓ సెంటర్లను మాత్రమే నెలకొల్పుతుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్లను, హబ్‌లను ఏర్పాటు చేసే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరమైన వరంగల్‌తో ఇది మొదలైంది. ఆ తర్వాత క్రమంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఐటీ విస్తరణ జరిగింది. ఈ హబ్‌లలో పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ఆరంభించాయి. సాంకేతిక కళాశాలల్లో చదువుకున్న వేలాది మంది విద్యార్థులకు తమ స్వస్థలాలకు దగ్గరలోనే ఉద్యోగాలు వచ్చాయి. మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐటీ టవర్లు త్వరలో ఏర్పాటు కానున్నాయి. జిల్లాలకు ఐటీ విస్తరణలో ఉన్న మరో కోణం- ప్రవాస తెలంగాణీయులను వారి స్వస్థలాలతో అనుసంధానించటం. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ బిడ్డలు సొంత జిల్లాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో ఐటీ విధానాన్ని ప్రకటిస్తూ- రూరల్ టెక్ పాలసీని కూడా ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి కంపెనీలను ఆహ్వానిస్తూనే జిల్లాలకూ ఐటీ కంపెనీలు వచ్చేలా పలు చర్యలు తీసుకున్నది. ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీలను నెలకొల్పడానికి ప్రోత్సాహకాలను అందించింది. కరెంటు చార్జీల్లో రాయితీ, పెట్టుబడిపై 50 శాతం సబ్సిడీ, నెట్, ఫోన్ చార్జీలపై 25 శాతం రీయింబర్స్మెంట్, ఆస్తి పన్ను మినహాయింపు, ఈవెంట్ నిర్వహణ ఖర్చులో రూ.5 లక్షల వరకూ రీయింబర్స్మెంట్, ఎగ్జిబిషన్లలో స్టాల్ ఏర్పాటుకు రాయితీ వంటి పలు సదుపాయాలు కల్పించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషి, సమగ్ర కార్యాచరణ ఫలితమే నేటి ఐటీ విస్తరణ. దేశానికి తెలంగాణ చూపుతున్న సరికొత్త అభివృద్ధి నమూనా ఇది.