Co-Operative Banks | రైతులు, బలహీన వర్గాలు సమష్టిగా ఏర్పాటుచేసుకున్న ప్రాథమిక సహకార సంఘాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. దీనికోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాలను అమలుజేయ చూస్తున్నది. దీనివల్ల రైతులు సహకార వ్యాపారాన్ని చేసుకునే స్వాతంత్య్రాన్ని కోల్పోతారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.
రైతులు సమష్టిగా తమ ప్రాథమిక సహకార సంఘాల సభ్యత్వంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను, రాష్ట్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. ఎరువుల ఉత్పత్తికి ఇఫ్కో, క్రిభ్కోలను, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం కోసం నాఫెడ్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, ఈ సంస్థలను అక్రమంగా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. దీనిలోభాగంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం-2020లో సెక్షన్ 12(1)ను, బహుళ రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు-2022లో సెక్షన్ 26,63 లను పొందుపరిచింది.
సామాన్య ప్రజానీకం సంక్షేమానికి ప్రతిబంధకంగా ఉండే సంపద కేంద్రీకరణ కాకుండా విధానాలు అమలుచేయాలన్నది రాజ్యాంగ అధికరణ 39 (సీ) ఉద్దేశ్యం. దాని స్వరూపంగా ఉండే అధికరణ 43 ద్వారా సహకార విధానం అమలుచేయాలని రాజ్యాంగం ఆదేశించింది. తద్వారా రాజ్యాంగ పీఠిక లక్ష్యాలైన ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయం కల్పించడం సాధ్యమవుతుంది. అందుకని సహకార విధానం అమలు చేయడం ప్రభుత్వాల రాజ్యాంగ విధి అయింది.
ప్రభుత్వ ఆస్తులను నిర్వచించే రాజ్యాంగ అధికరణ 12 పరిధిలోకి సహకార సంస్థలు రావని సుప్రీంకోర్ట్టు తీర్పు వెలువరించింది. సహకార సంస్థలు వినియోగదారుల/ వ్యక్తుల సభ్యత్వంతో ఏర్పడుతాయని, వీటిలో పెట్టుబడిదారుని సభ్యత్వానికి అర్హత ఉండదని మరొక తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది.
ఆ తీర్పును అనుసరించి సహకార ధర్మపీఠం దేశవ్యాప్తంగా సహకార్ ధర్మ్ భారత్ యాత్రను నిర్వహించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం-2020లోని 12(1) సెక్షన్ అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.
బహుళ రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) చట్టం -2022పై అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంట్ సభ్యులకు సహకార ధర్మ పీఠం నివేదించడంతో వారు పార్లమెంట్లో వ్యతిరేకించారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని దాన్ని జాయింట్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి నివేదించింది. ఆ కమిటీ తన రిపోర్ట్‌ను పార్లమెంట్‌కు సమర్పించింది. కాగా ఈ రిపోర్ట్‌లో సభ్యులు ప్రశ్నించిన మౌలిక అంశాలను విస్మరించి ఆ బిల్లును ఇంచుమించు యధాతథంగా పార్లమెంట్‌కు సమర్పించింది.
ఈ రెండు చట్టాల్లో మూడు సెక్షన్లు రాజ్యాంగ అధికరణలను, సుప్రీంకోర్టు తీర్పులను, సహకార సూత్రాలను అతిక్రమిస్తున్నాయి. వీటి అమలు వల్ల రాజ్యాంగ మౌలిక స్వభావం మారిపోతున్నది. రైతులు, బలహీన వర్గాలు సమష్టి సహకార వ్యాపారాన్ని చేసుకొనే ప్రాథమిక హక్కును కోల్పోతారు. భారతదేశంలో ఒక్క పెట్టుబడిదారుడే వ్యాపారం చేసుకొనే వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని తొలగించేందుకు పార్లమెంట్ సభ్యులు తక్షణమే ముందస్తు చర్యలు తీసుకోవాలని సహకార ధర్మ పీఠం డిమాండ్ చేస్తున్నది.
(వ్యాసకర్త: సహకార ధర్మ పీఠం, ధర్మకర్త)