రాష్ట్రంలో సుమారు తొమ్మిది నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలు పేరుతో గొప్పలు చెప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నది.
గత ప్రభుత్వంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకుగాను కోట్ల రూపాయల ఖర్చుచేసి హంగులు, ఆర్భాటాలు ప్రదర్శించిన కాంగ్రెస్, తమ ప్రభుత్వమే వారికి పరీక్ష నిర్వహించి, ఎంపిక చేసి నియమించుకున్నట్టుగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు కేవలం నియామక పత్రాలిచ్చి చేతులు దులుపుకొన్నదనే అసలు వాస్తవం అభ్యర్థులకు, వారి కుటుంబాలకు తెలుసు. 2023, జూలై, ఆగస్టుల్లోనే నియామకాలు జరిగాయి. వారి జీతభత్యాలకయ్యే ఖర్చుతో ప్రభుత్వం ప్రకటనల పేరిట పబ్బం గడుపుకోవడం నిజంగా విడ్డూరం.
ఇదిలా ఉంటే.. గత పదేండ్లుగా టీఎస్ అని చలామణిలో ఉండగా దానిని పనిగట్టుకొని కాంగ్రెస్ సర్కార్ టీజీ అని మార్చి గొప్ప పాలనా సంస్కరణను ప్రవేశపెట్టింది. వాస్తవానికి టీజీ అని మార్చడం ‘తెలంగాణ’ అనే పదాన్ని విడదీయడమే. అప్పుల రాష్ట్రమని పదే పదే పేర్కొంటూనే దానికోసం అందుకు దాదాపు రూ.2,800 కోట్లు ఖర్చు చేసింది. ఇక గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన ప్రాజెక్టులను తామే నిర్మించినట్టు గొప్పగా ప్రకటనలు ఇచ్చుకొని ప్రారంభించి ఆడంబరాలు చేస్తున్నది.
ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ప్రతిపక్ష శాసనసభ్యులను ఆకర్షించడానికే తమ శక్తియుక్తులను ధారపోస్తూ వారిని ఎన్ని కోట్లు పెట్టి కొనడానికైనా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం నడుస్తున్నదంటే ఇది కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం కాక మరేమవుతుంది? తమ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందోననే అభద్రతా భావం వారిని ఇంకా వెంటాడుతున్నది. అయితే, కాంగ్రెస్ నాయకులు ఒక విషయం మరిచిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎవరూ కూల్చవలసిన అవసరం లేదు. తమకు తామే కూల్చుకునే గొప్ప సంస్కృతి ఆ పార్టీ సొంతమని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నా.
ఓ పక్క బజారులో తిరిగే కుక్కల వల్ల మనుషుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. కుక్క కాటుకు చిన్నారుల ప్రాణాలు పోతుండటం శోచనీయం. మరోపక్క డెంగీ, విషజ్వరాలు ప్రజల ఆరోగ్యం తో ఆటలాడుకుంటున్నాయి. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరం. పాలనపై మంత్రులకు పట్టులేకపోవడమే ఇందుకు కార ణం. ఇక అనేక యాజమాన్యాల కింద నడుస్తున్న గురుకుల పాఠశాలల్లో మరణ ఘంటికలు మోగుతున్నాయి. ఇంతకాలం వాటికున్న ఆదరణ, గౌరవం ఇప్పుడు సన్నగిల్లాయనడంలో సందేహం లేదు.
వరదలతో హైదరాబాద్ నగర జీవనం అస్తవ్యస్తమవుతున్నా మంత్రులు, అధికారులు నగరంలోని బస్తీలను పర్యటించే ప్రయత్నం చేయలేదు. మేమున్నామనే భరోసా వారికి కల్పించలేదు. కానీ, రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలకు హాజరుకావడం వారికి ప్రజల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది. సోనియాగాంధీ కుటుంబం పట్ల కాంగ్రెస్ నాయకులు తమ భక్తిప్రపత్తులు చాటుకొని బానిసత్వాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు బస్తీలు పర్యటించి వరద బాధితులకు తోడుగా నిలవడాన్ని ఇప్పటికీ మరిచిపోలేం. కానీ, కాంగ్రెస్ పాలకులకు అవేమీ పట్టడం లేదు. పాలనానుభవం, యంత్రాంగంపై పట్టు లేకపోవడం ప్రతి విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. మన కాంగ్రెస్ హీరోలు అభినవ నీరోలు అని నిరూపించారు.
రాష్ట్ర సచివాలయం వద్ద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకయైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని నెలకొల్పాలనుకోవడం అవివేకం, అర్థ రహితం. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి కొరవడిన వారు మాత్రమే ఆ విధంగా ప్రవర్తిస్తారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించి పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిపై ముఖ్యమంత్రి రేవంత్ అవాకులు చెవాకులు పేలడం ఆక్షేపణీయం. కమ్యూనిస్టులకు కమిట్మెంట్ ఎక్కువ. తమతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా వారు నోరు మెదపడం లేదు.
రాజులు శాశ్వతం కాదు. అట్లాగే రాజ్యం, ప్రభుత్వం కూడా శాశ్వతం కావు. కానీ, రాజు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలవాలి. ప్రతిష్ఠకు, పట్టింపులకు పోకూడదు. కేంద్ర ప్రభుత్వం ల్యాటరల్ ఎంట్రీపై విపక్షాల దాడితో యూటర్న్ తీసుకున్నది. సచివాలయం ఎదురుగా విగ్రహం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవడం మంచిది. లేదంటే ప్రజాగ్రహాన్ని చవి చూడవలసి వస్తుంది. ఈ విషయమై అనేకమంది మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు కూడా పత్రికల ద్వారా తమ వినతిని, నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజాహితమే పరమావధిగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-శ్రీ శ్రీ కుమార్