2023-24లో ఏపీకి చెందిన ఓ వ్యక్తి సగటు ఆదాయం బీహార్‌లో ఉన్నవారి కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ.భవిష్యత్‌లోనూ వృద్ధి రేట్లు గత ట్రెండ్లకు అనుగుణంగానే ఉంటాయని అనుకుందాం. అయినప్పటికీ, ఈ దశాబ్దం చివరి నాటికి రెండు రాష్ర్టాలకు చెందిన వ్యక్తుల సగటు ఆదాయం మధ్య అం తరం నాలుగున్నర రెట్లు ఉండే అవకాశం ఉంది.
ఇప్పుడు ఈ రెండు రాష్ర్టాల వృద్ధి పథాలను తారుమారు చేసి చూద్దాం. ఈ లెక్కన కూడా 15 ఏండ్ల తర్వాత బీహార్‌కు చెందినవారి కంటే ఏపీవాసుల తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. దక్షిణాదిలోని ధనిక రాష్ర్టాలన్నింటిలో ఏపీ తలసరి ఆదాయం తక్కువ కావడం గమనార్హం. ఇక్కడ ఏపీ, బీహార్ అనేవి ఉదాహరణ మాత్రమే. ఆంధ్రా స్థానంలో ఇతర దక్షిణాది రాష్ర్టాలను, బీహార్ స్థానంలో ఉత్తర, మధ్య, తూర్పు భారత్‌లోని ఇతర రాష్ర్టాలను తీసుకొని పోల్చి చూసినా ఈ అంశంలో పెద్దగా మార్పేమీ కనిపించదు.
ప్రభుత్వ విధానాలు, మార్కెట్ శక్తుల ద్వారా దక్షిణాది రాష్ర్టాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయి. ఐటీ సెక్టార్ చాలావరకు దక్షిణాదిలోనే ఉన్నది. దేశంలోని 37 శాతం వరకు పరిశ్రమలు దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాల్లోనే ఉన్నాయి. అంతేకాదు, ఈ ఐదు రాష్ర్టాల్లో 33 శాతం మంది ఉద్యోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో టాప్-20లో ఉన్న జిల్లాల్లో రెండు మినహా మిగతావన్ని దక్షిణాది, పశ్చిమ రాష్ర్టాల్లోనే ఉన్నాయి. 1990ల్లో ఈ రాష్ర్టాలు దేశ జీడీపీలో సుమారుగా పావు వంతు వాటా కలిగి ఉండేవి. కానీ, 2022-23 నాటికి ఈ రాష్ర్టాల వాటా మూడొంతులకు చేరుకున్నది. దీన్ని ఆయా రాష్ర్టాల జనాభా ప్రకారం చూసినట్టయితే, ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది. దక్షిణాది రాష్ర్టాలు మాత్రమే ధనికం కాదు, అక్కడి ప్రజలు విద్యావంతులు, వారి పిల్లలు ఆరోగ్యవంతులు, వారు ఎక్కువగా కాలం జీవిస్తారు.
యూపీ, బీహార్‌లో చాలా తక్కువకే శ్రామిక శక్తి లభిస్తున్నప్పటికీ, కంపెనీలు అక్కడికి తరలించడానికి అది ఏ మాత్రం సరిపోదు. నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, మౌలిక వసతులు, ఆర్థిక పరిపుష్ఠి తదితర అంశాలు దక్షిణ, పశ్చిమ రాష్ర్టాలకు అనుకూలం. హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె లాంటి నగరాల్లో యాపిల్, ఫాక్స్‌కాన్ లాంటి అంతర్జాతీయ సంస్థలను ఎక్కువగా నెలకొల్పుతున్నారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఐదు సెమీకండక్టర్ ప్రాజెక్టుల్లో నాలుగు గుజరాత్‌లోనే ఏర్పాటవుతుండటం గమనార్హం.
ఢిల్లీకి సమీపంగా ఉన్న కారణంగా నోయిడా, ఘజియాబాద్ లాంటి కొన్ని నగరాలు లబ్ధి పొందుతున్నాయి. యూపీలో ఈ రెండు నగరాల్లోనే 46 శాతం వేతన జీవులు ఉన్నారు. హైవేలు, విమానాశ్రయాల నిర్మాణం ద్వారా యూపీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థిక ఊపు రావడం తప్ప, దాని వల్ల అంతకుమించి ఏం జరుగుతుంది?
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో వృద్ధిరేటులో కొనసాగుతున్న వైవిధ్యం కారణంగా పేద రాష్ర్టాల నుంచి ధనిక రాష్ర్టాలకు వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధిక జనాభా ఉండే రాష్ర్టాల్లో అధిక జనాభా పెరుగుదల రేటు, తక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా దక్షిణాది, పశ్చిమ, ఉత్తర భారత్‌లోని కొన్ని నగరాలపై మరింత ఒత్తిడి పెరుగుతున్నది. ఈ వలసల ప్రభావం ధనిక ప్రాంతాల్లోని స్థానికుల నుంచి ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఉద్యోగాల కొరత కారణంగా తక్కువ ఆదాయ రాష్ర్టాల్లోని కొన్ని వర్గాలు కూడా ఇలాంటి డిమాండ్ చేసే అవకాశం ఉంది.
సైద్ధాంతిక ధోరణితో సంబంధం లేకుండా పాపులిజానికి ప్రభుత్వాలు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాయి. తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టించడంలో తమ అసమర్థత, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దక్షిణాది లాంటి ధనిక ప్రాంతాల నుంచి ఆర్థిక వనరుల బదిలీని ప్రభుత్వం ఎంచుకుంటుంది.
ఏదేమైనప్పటికీ, ఒక దేశ చరిత్రలో 15 ఏండ్లు ఎక్కువ సమయమేమీ కాదు. కానీ, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. దేశంలోని తక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో వృద్ధికి అవరోధంగా ఉన్నవాటిని తొలగించడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఈ సమయం సరిపోతుంది.
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో…
-ఇషాన్ బక్షి