దేశవ్యాప్తంగా శునకాల దాడులు ఎక్కువవుతున్నాయి. కుక్కకాటుకు గురై అనేకమంది గాయాల పాలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. దేశంలో ఏటా కుక్కకాటు వల్ల 20 వేల మంది మృత్యువాతపడుతున్నారు. అంటే రోజుకు సగటున 55 మంది మరణిస్తున్నట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న శునకాల దాడుల్లో 36 శాతం భారత్లోనే కావడం ఆందోళనకరం.
ఇరవై ఏండ్ల కిందట కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుక్కకాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుందనేది మనందరికీ తెలిసిందే. కానీ, అన్ని శునకాల వల్ల రేబిస్ సోకుతుందనేది అపోహ మాత్రమే. రేబిస్ ఒక ప్రాణాంతక వ్యాధి. శునకాలే కాకుండా పిల్లి, కోతి, ముంగిస, ఎలుక తదితర జీవులు కరిచినా రేబిస్ వ్యాధి సోకుతుంది. ఇది తెలియని చాలామంది కుక్కకాటుకు గురైనా, పిల్లి కరిచినా ఏం కాదులే అని మిన్నకుండిపోతున్నారు. నిర్లక్ష్యం వహిస్తూ చికిత్స చేయించుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో రేబిస్ సోకి మృత్యువాతపడుతున్నారు.
కుక్క, పిల్లి, ముంగిస, కోతి తదితర జంతువుల లాలాజలంలో రేబిస్ లిస్సా వైరస్ ఉంటుంది. అయితే రేబిస్ కలిగి ఉన్న, కలిగి లేని వాటిని గుర్తించడం కష్టం. కాబట్టి ఏ జంతువు కరిచినా వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. రేబిస్ వైరస్ జంతువుల్లో చేరకుండా ఉండేందుకు ముందుగానే వాటికి వ్యాక్సిన్ వేయిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. ముందస్తుగా శునకాలకు వ్యాక్సిన్లు వేయించడం వల్ల అమెరికా తదితర దేశాల్లో రేబిస్ మరణాలు చాలా తక్కువ. మన దేశంలోనూ పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయించడం మొదలైంది. దీంతో చాలా వరకు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.
శునకం లేదా మరేదైనా జంతువు కరిచిన వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది. రేబిస్ సోకి, వ్యాధి లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండటం ప్రమాదకరం. ఆలస్యం చేస్తే మరణించే ఆస్కారం ఉంటుంది. పిచ్చి కుక్క కరిస్తే రేబిస్ కచ్చితంగా సోకుతుంది. అయితే పిచ్చి కుక్కకు నిర్వచనం ఇవ్వడం అంత తేలికకాదు. మనం రెచ్చగొట్టకపోయినా కరిచిందంటే అనుమానపడాల్సిందే. కరిచిన పది రోజుల్లోపు శునకం మరణిస్తే వ్యాక్సిన్ వేయించుకున్నా ఫలితం ఉండకపోవచ్చు.
ఓ పరిశోధన ప్రకారం.. రేబిస్ వైరస్ ఉన్న శునకం కరిస్తే పది రోజుల నుంచి ఐదేండ్లలోపు ఎప్పుడైనా వ్యాధి బయటపడవచ్చు. శునకం కరిచిన నాటి నుంచి రేబిస్ సోకే వరకు ఉండే వ్యవధిని ఇంక్యూబేసిన్ పిరీయడ్గా పిలుస్తారు. మెదడుకు వైరస్ సోకితే ఆ వ్యక్తి హైడ్రోఫోబియాకి (రేబిస్)కి గురైనట్టే. ఈ స్థితికి చేరిన వ్యక్తికి మెడ భాగంలో కండరాలు వాచిపోతాయి. తీవ్రమైన నొప్పి కారణంగా ఉమ్మిని కూడా మింగలేరు. దీనివల్ల నీళ్లు తాగేందుకు కూడా జంకుతారు. కుక్కకాటుకు గురైన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్వచ్ఛమైన నీటితో గాయాన్ని కడిగి పొడి వస్ర్తాలతో తుడవాలి. గాయమైన చోట గాలి తగిలేలా చూసుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకోవాలి.
అడవులను విచక్షణారహితంగా నరకడం వల్ల చిరుతపులి, కోతులు తదితర జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఫలితంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మనుషులతో పాటు ఇతర జీవరాశులకు భూమిపై జీవించే హక్కు ఉంది. జీవవైవిధ్యం ఆవశ్యకతను గుర్తించి ఇతర జీవరాశులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉన్నది.
-యం. రామ్ ప్రదీప్