ఒక వైపు అధికార కాంగ్రెస్ ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ తమ 7వ గ్యారెంటీగా నిత్యం ప్రకటిస్తుండగా, మరోవైపు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ‘ప్రజాస్వామిక హక్కుల’పై ఆంక్షలు విధించడం తీవ్ర చర్చకు దారితీస్తున్నది. చదువుతూనే పోరాటాలకు ఊపిరులూదిన చరిత్ర ఓయూ విద్యార్థుల సొంతం. నాటి వందేమాతర ఉద్యమం నుంచి మలి తెలంగాణ ఉద్యమం దాకా ఓయూ గడ్డ ముఖ్య భూమిక పోషించింది. ఉమ్మడి ఏపీలో ఇలాంటి నిషేధాజ్ఞలు విధిస్తే మలిదశ తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా రూపాంతరం చెందేదా ? ఒక్కసారి ఆలోచించండి. శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు. ఈ విషయం అధికారులు, పాలకులు గుర్తెరగాలి.
సమాజ ప్రగతికి వర్సిటీ విద్య ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకున్న వర్సిటీలను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతించాల్సిందే. కానీ, ఓయూలో విద్యారంగ సమస్యలపై విద్యార్థులు గొంతు ఎత్తవద్దు (నిరసనలు, నినాదాలు, ఆందోళనలు నిషేధం), ఎత్తితే కఠిన చర్యలుంటాయని ఓయూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గం. ఇది సీఎం రేవంత్‌కు తెలియకుండా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే కీలక విద్యాశాఖ ఆయన వద్దే ఉన్నది. ఓయూ ప్రాంగణంలోని కళాశాలలు, వసతిగృహాల్లో సమస్యలు బలంగా తిష్ఠ వేశాయి. ప్రభుత్వం గత, ప్రస్తుత బడ్జెట్లో సైతం వర్సిటీలకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడం గమనార్హం. అంతేకాకుండా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు అంశం అటకెక్కింది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ప్రతి డిపార్ట్ మెంట్లో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక ప్రొఫెసర్ పోస్టుండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళా (వీరనారీ చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం) వర్సిటీతో కలుపుకొని మొత్తం 12 వర్సిటీల్లో 70 శాతం బోధనా సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేదు, అరకొర వేతనాలతో వారు కుటుంబాలను పోషించుకునే దుర్భర పరిస్థితి ఏర్పడింది. సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో పరిశోధనలు ముందుకు సాగడం లేదు. మౌలిక వసతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు, బ్లేడ్లు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ సమస్యల ప్రభావం చదువులపై పడుతున్నది. ‘పట్టాలు పొందే సంగతేమో గానీ, సురక్షితంగా బయటపడితే చాలన్నట్టుగా’ పలు హాస్టళ్లలో పరిస్థితి దాపురించింది. పరీక్షా ఫీజులు అమాంతంగా పెరిగాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల మంజూరులో కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలుచేయడం లేదు. తక్షణమే వర్సిటీలను ప్రక్షాళన చేయాలని సూచిస్తూ ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వానికి తమ నివేదికను సైతం అందించింది. హక్కుల కోసం ఉద్యమిస్తే దివ్యాంగ విద్యార్థులను అరెస్టు చేయించడం బాధాకరం. గ్రంథాలయాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పరిసరాల్లో రక్షణ కొరవడింది. పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలంటూ.. ‘భారత రాజ్యాంగం’లోని ఆర్టికల్-19కు లోబడి శాంతియుత మార్గంలో పలుమార్లు విద్యార్థులు నినదించారు, నిరసన తెలిపారు. ఇదెలా ‘ప్రతికూల ప్రభావం’ అవుతుంది? చదువుతూ పోరాడటం తప్పా? నినదిస్తే సంకెళ్లు వేస్తారా?
ఇటీవల నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)-2024 కింద కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన ఓవరాల్ విభాగం జాబితాలో వందేండ్ల చరిత్ర కలిగిన ఓయూ 70వ స్థానానికి దిగజారిన విషయం తెలిసిందే. సమస్యలు పరిష్కరించమని వినతులు ‘వీసీకిచ్చినా.. ఆ ‘మూసీకిచ్చినా ఒక్కటే’ అని దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ ఓ సందర్భంలో మినీ కవిత రాశారు. ఇప్పుడు అది అబద్ధమని ప్రస్తుత వీసీ నిరూపించాల్సిన అవసరం ఉన్నది. ఓయూ ప్రాంగణంలోని కళాశాలలు, విభాగాల పరిసరాల్లో ధర్నాలు, ఆందోళనలు, నినాదాలు నిషేధమంటూ జారీచేసిన ఉత్తర్వును తక్షణమే రద్దుచేయాలి. తన ప్రమాణ స్వీకారం రోజునే ‘ప్రగతి భవన్’ కంచెలు తొలగించి ‘ప్రజాపాలన’ను ప్రారంభించామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్ ఈ అంశంపై స్పందించి, ఇలాంటి అప్రజాస్వామిక చర్య పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. లేకుంటే న్యాయమైన హక్కుల సాధన కోసం విద్యార్థులు మహోద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి అనివార్యం అవుతుంది.