తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి నేటితో 9 ఏండ్లు
ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో జిల్లాల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రజల చింతలు తీర్చి, ప్రజల చెంతకు పాలనను చేర్చేవి జిల్లాలే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేది జిల్లా యంత్రాంగాల ద్వారానే. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా నిలిచేవి జిల్లాలే. పాలనలో ఎంతో ప్రాముఖ్యమున్న జిల్లాలను ఉమ్మడి పాలకులు విస్మరించారు. స్వరాష్ట్రంగా ఏర్పడ్డ నాడు తెలంగాణలో పది జిల్లాలే ఉండగా, ఒక్కో జిల్లాలో 50-60 మండలాలు ఉండేవి. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ కష్టాలన్నింటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్టారు. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన రెండేండ్లలోనే 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించి, ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలనలో అనేక మౌలిక మార్పులు, చేర్పులు, సంస్కరణలు చేపట్టింది. అంతేకాదు, చిత్తశుద్ధితో తక్షణమే వాటిని అమలుపరిచింది. పాలనా సంస్కరణల్లో జిల్లాల పునర్విభజన చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రాదేశిక ప్రాంతాన్ని పునర్విభజన చేసి, ప్రజల సమీపానికి జిల్లా పాలనను తీసుకెళ్లింది నాటి ప్రభుత్వం.
మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో పట్టుదలను ప్రదర్శించి జిల్లాల పునర్విభజన చేశారు. గతంలో ఉన్న పది జిల్లాల్లో ఒక్క హైదరాబాద్ మినహా, మిగతా తొమ్మిది జిల్లాలను కొత్తగా రెండు నుంచి ఆరు జిల్లాలుగా విభజించారు. మొత్తం 31 జిల్లాలుగా విభజించి 2016 అక్టోబర్ 11 నుంచి అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, సుమారు 610 మండలాలు, 10,909 రెవెన్యూ గ్రామాలు, 32 జిల్లా పరిషత్తులు, 12,769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రజా అవసరాలు, భౌగోళిక స్వరూపం, పాలనా సౌలభ్యం మొదలగు అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ర్టాన్ని 33 జిల్లాలుగా, రెండు మల్టీ జోన్లుగా, 7 జోన్లుగా విభజించి పాలనను కేసీఆర్ ప్రజల చెంతకు చేర్చారు.
జిల్లా ప్రాదేశిక ప్రాంతాన్ని, పాలనను ప్రజా అవసరాలకు అనుగుణంగా వికేంద్రీకరించి, పాలనా యంత్రాంగం మొత్తాన్ని ఎక్కడో సుదూరంగా ఉన్న గ్రామీణ పేద ప్రజల ముంగిటకు కేసీఆర్ తీసుకువచ్చారు. తద్వారా గత అరవై తొమ్మిది ఏండ్ల నుంచి ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది.
జిల్లాల పునర్విభజన అంటే రాష్ట్ర భౌగోళికపరమైన ఉపరితల స్వరూపం, సరిహద్దులను మార్చే ప్రక్రియ మాత్రమేనని కొందరు భావించారు. కానీ, ఈ పాలనా సంస్కరణ ఒక మౌలిక మార్పుగా, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సమతుల్య సమాజ నిర్మాణ ప్రక్రియలో ఒక భాగంగా పరిగణించాలి. ప్రజలకు ప్రభుత్వ పాలన, ముఖ్యంగా జిల్లా పాలన అత్యంత సమీపంలో ఉండాలన్న నాటి ప్రభుత్వ నిర్ణయం, పాలకుల ముందుచూపు పాలనా దక్షతకు తార్కాణం.
విభజనకు పూర్వం తమ అవసరాల కోసం జిల్లా కేంద్రానికి ప్రజలు వెళ్లాలంటే అత్యధిక దూరం ప్రయాణించడంతో పాటు అధిక ఖర్చులను భరిస్తూ, విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ తీవ్రంగా యాతన పడేవారు. ఈ ఇబ్బందులు పడలేక సులభంగా పనులు పూర్తిచేసుకోవాలనే తలంపుతో ప్రజలు మధ్య దళారీ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడేవారు. వారికి డబ్బులు ముట్టచెప్పి పనులు చేయించుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాల పునర్విభజనతో బ్రోకర్ వ్యవస్థ చాలా వరకు కనుమరుగైపోయింది. ప్రజలే స్వయంగా జిల్లా కేంద్రానికి పొద్దున వెళ్లి తమ పనులను పూర్తిచేసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు.
గతంలో దాదాపు 50-60 మండలాలకు ఒక జిల్లా ఉండేది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల పాలనాధికారులను ప్రజలు కలవాలన్నా, కోర్టు కేసులు, విద్య, వైద్యం, వాణిజ్య అవసరాలకు జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా దాదాపు 50-100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. అంత ప్రయాసపడి వెళ్లినా పనులు పూర్తయ్యేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో బస్టాండ్లు, రోడ్ల పక్కన, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, లాడ్జిలు, బంధువుల ఇండ్లల్లో బస చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ దాదాపు 10-30 మండలాలకు ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేశారు. తద్వారా జిల్లా పాలనను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో అతి తక్కువగా పది మండలాలు మాత్రమే కలిగి ఉన్న జిల్లా ములుగు కాగా, ఎక్కువగా మండలాలున్న జిల్లా నల్గొండ.
పునర్విభజనతో గత జిల్లా కేంద్రాలపై భారం తగ్గింది. నూతన జిల్లా కేంద్రాల్లో జనసంచారం పెరిగింది. వ్యాపారాలు ఊపందుకున్నాయి. పాత జిల్లా కేంద్రాల్లో ఇండ్ల అద్దెలు గణనీయంగా తగ్గడంతో సామాన్యులకు ఉపశమనం కలిగింది. కొత్త జిల్లా కేంద్రాల్లో అద్దె ఇండ్లు, సొంత ఇండ్లు, భూములకు గిరాకీ పెరిగింది. పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ సులువైంది.
ప్రజలకు అధికారులు అందుబాటులోకి వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యాయి. రోడ్డు, రవాణా వ్యవస్థ మెరుగుపడింది. జిల్లాలవారీగా పరిశీలిస్తే విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం పాలనా వ్యవస్థలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సామాన్య ప్రజల కదలిక (మొబిలిటీ) పెరిగింది. దాంతో జిల్లా పాలనపై వ్యక్తిగత చైతన్యస్థాయి పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలోని 33 జిల్లాలకు సమీకృత పాలనా భవనాలు నిర్మించి, అన్ని పాలనా విభాగ కార్యాలయాలను ఒకేచోట కేంద్రీకరించడం మూలంగా ప్రజల సందర్శన సులభమవడమే కాదు, ప్రభుత్వాధికారుల మధ్య సమన్వయం కూడా పెరిగింది. ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. స్వయం ప్రతిపత్తితో కూడిన సుస్థిర, సంక్షేమ, అభివృద్ధి పాలన ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
గతంలో దాదాపు 50-60 మండలాలకు ఒక జిల్లా ఉండేది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల పాలనాధికారులను ప్రజలు కలవాలన్నా, కోర్టు కేసులు, విద్య, వైద్యం, వాణిజ్య అవసరాలకు జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా దాదాపు 50-100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది.