మీరు వెంటనే కోటీశ్వరులు కావాలనుకొంటే ఓ వెయ్యి రూపాయలుంటే చాలు. ఇరాన్లో వాలిపోతే ఆ వెయ్యి రూపాయల విలువ అక్కడి కరెన్సీ ప్రకారం చూస్తే రూ.1.61 కోట్లు. అవును నిజం. మన ఒక్క రూపాయికి అక్కడ 16, 100 రియాల్స్ లభిస్తాయి. ఒక డాలర్ విలువ పది లక్షల రియాల్స్. అక్కడ ఒక కోడి గుడ్డు ధర లక్షా 60 వేల రియాల్స్. కరెన్సీ కన్నా కాగితం విలువే ఎక్కువ అనిపించేట్టుగా ఇరాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పాలనలో మతం ప్రవేశిస్తే స్వర్గం కూడా ఎలా నరకంగా మారుతుందో ప్రపంచానికి ఇరాన్ ప్రత్యక్ష సాక్ష్యం. మత రాజకీయాలను నడిపించేవారికి మంటల్లో మాడిపోతున్న ఇరాన్ కనువిప్పు కలిగించాలి.
దేశ విభజన జరిగినప్పుడు పాకిస్థాన్‌కు సారవంతమైన నేల లభించింది. నదుల వద్దనే నాగరికత ఏర్పడుతుంది. సింధు నాగరికతకు నెలవైన భూములు పాక్‌కు దక్కాయి. నేల సారవంతమైనదే కానీ బుర్ర సారవంతమైనది కాకపోతే ఫలితం ఎలా ఉంటుందో ఆ దేశాన్ని చూస్తే తెలుస్తుంది. గోధుమ పిండి కోసం అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. తొక్కిసలాటలో పౌరులు మరణిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలన తీవ్రవాదుల ఘాతుకాలు వెలుగు చూసినా అక్కడ పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉంటుంది. ఉగ్రవాదులను, బిచ్చగాళ్లను ఎగుమతి చేయడంలో పాక్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా దేశాల్లో కూడా పాక్ పౌరులు వ్యాపారాలు ప్రారంభించడానికి తమ దేశం పేరు చెప్పుకోకుండా ఇండియా పేరు చెప్పుకుంటారు.
పాకిస్థాన్ దుస్థితికి, ప్రస్తుతం ఇరాన్ దుస్థితికి కారణం.. పాలనలో మతం ప్రవేశించడం. ఇరాన్ మొదటి పేరు పర్షియా. వాళ్లు సూర్యుడిని ఆరాధించే పార్సీలు. వారిది జొరాస్ట్రియన్ మతం. టాటా పేరు వింటే ప్రతి భారతీయుడు గౌరవంతో నమస్కరిస్తారు. వ్యాపారంలోనే కాదు, సేవలోనూ ముందున్నవారు. టాటాలు పార్సీ మతస్థులు. పర్షియాపై ఇస్లాం దండయాత్ర చేసి ఆ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చింది. పర్షియాగా ఉన్నప్పుడు వారిది ఘనమైన సంస్కృతి. సైన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇస్లాం దాడితో మతం మార్చుకోవడానికి ఇష్టపడక ఒక చిన్న సమూహం మన దేశానికి వచ్చింది. అలా వచ్చిన వారే పార్సీలు. వారి సంఖ్య చిన్నది కావచ్చు, కానీ మన దేశంలో వారి ప్రభావం చాలా ఉంది. హోమీ బాబాను టాటాను మనం మరిచిపోగలుగుతామా? చిన్న సమూహం నుంచే అంతమంది ప్రతిభావంతులు పుడితే దండయాత్రలతో మతం మార్చి ఉండకపోతే ప్రపంచంపై పర్షియా ఎంతో ప్రభావం చూపి ఉండేది. పర్షియా ఇస్లామిక్ దండయాత్ర తర్వాత ముస్లిం దేశంగా మారి పొందిన ప్రయోజనం ఏమిటి? నష్టం ఏమిటి? అంటే ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న ఆందోళనను చూస్తే తెలుస్తుంది.
మతం వ్యక్తిగతమైనది. తన ఇంటి వరకు, కుటుంబ సంబంధాల వరకే మతం పరిమితం కావాలి . మత పరమైన నమ్మకం అనేది మనిషికి ఊరటను ఇస్తుంది. మతాన్ని, రాజకీయాలను, పాలనను ఒకదానితో ఒకటి కలిపేస్తే ప్రతి దేశం క్రమంగా పాకిస్థాన్, ఇరాన్ అవుతుంది. అలా అయితే ఏమవుతుందో ఇరాన్ చెబుతోంది. రాజరికం ఉన్నప్పుడు ముస్లిం పాలకులు తమను తాము ఖలీఫాలుగా భావించేవారు.
ఇది 21వ శతాబ్దం జెన్జీలు ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న కాలం. మధ్య యుగాల రాజుల మాదిరిగా ఇప్పటికీ పాలకులు తమను తాము దైవ ప్రతినిధులుగా భావించి ఎలాంటి అరాచకాలకైనా పాల్పడుతాం అంటే సహించే కాలం కాదు ఇది. ఇరాన్ అగ్నిగుండంగా మారి ప్రజలు చివరకు మసీదులను కూడా తగులబెడుతున్నారు. పాలకులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నవారు దేవుడిని వ్యతిరేకించేవాళ్లు అని పాలకులు ప్రకటించడం విచిత్రం. ఇరాన్లో ద్రవ్యోల్బణం 40 నుంచి 50 శాతం ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 50 నుంచి 60 శాతం వరకు ఉంది అంటే అది దేశమేనా? అనే సందేహం వస్తుంది. ధరలు భరించలేక అక్కడి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు.
ఎప్పటి నుంచో మత పాలనకు వ్యతిరేకంగా వారి మనసులో దావానలం రగిలిపోతోంది. తాజాగా ధరల పెరుగుదలతో ఒక్కసారిగా రగిలిపోతున్నారు. ఇరాన్లో మతం అయితే మార్చగలిగారు కాని వారి సంస్కృతిని అణచివేయ లేకపోయారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదు అని ఒక యువతిని చిత్రహింసలు పెట్టి పాలకులు ఏకంగా హత్య చేశారు. ఆ సంఘటన మహిళల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలను రగిల్చింది. దేశవ్యాప్తంగా మహిళలు ఉద్యమించారు. పాలకులు 400 మంది ప్రాణాలను హరించి ఆందోళనను అణచివేశామని అనుకున్నారు. ప్రస్తుత ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చూస్తుంటే అది ఉద్యమ విరామమే కానీ, విరమణ కాదు అని అర్థమవుతుంది.
17 రోజుల నుంచి ఇరాన్ వ్యాప్తంగా ఇరానీలు ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. 6 వేల మంది ఉద్యమ కారులు ఉద్యమంలో మరణించినట్టు టైం పత్రిక కథనాన్ని వెలువరించింది. కేవలం 72 గంటల్లో 3 వేల మంది ఉద్యమకారులను ప్రభుత్వం చంపేసినట్టు ఇరాన్ మీడియా కథనాలు తెలిపాయి. ఇటీవల కాలంలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాల్లో జెన్‌జీ నవతరం ప్రధాన పాత్ర వహిస్తుండగా ఇరాన్ ఉద్యమంలో జెన్‌జీ తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఒక మహిళ పరిగెడుతూ ‘భయం లేదు. నన్ను మీరు నాలుగు దశాబ్దాల క్రితమే చంపేశారు’ అని గట్టిగా చెబుతోంది. ఇరాన్లో అయతుల్లా ఖమేనీ నాయకత్వంలో షాను గద్దె దించి ఇస్లామిక్ దేశంగా మార్చి తమ స్వేచ్ఛను హరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ నాలుగు దశాబ్దాల క్రితమే తమను చంపేశారు అని చెబుతున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏదో ఒక ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. కానీ ఏ దేశంలో కూడా తమ దేశంలో జోక్యం చేసుకోమని ఇంకో దేశాన్ని పిలవరు. కానీ ఇరాన్లో ఉద్యమకారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను స్వాగతిస్తూ దేశ వ్యాప్తంగా ట్రంప్ ఫొటోలతో పోస్టర్లు వేస్తున్నారు. ఇంటర్నెట్ కట్ చేసినా, విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఉద్యమ కారులు భయపడడం లేదు .
ఉద్యమకారులపై అణచివేత సాగిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికాకు తన కారణాలు తనకు ఉండవచ్చు కానీ ముల్లాల పాలనపైన ఇరాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది వాస్తవం. ఇస్లామిక్ దేశంగా మారకముందు పశ్చిమ దేశాల తరహాలో ఇరాన్ ప్రజలు ఆధునిక జీవనం గడిపారు. ఇస్లామిక్ దేశంగా మారిన తర్వాత హిజాబ్ సరిగా ధరించకపోయినా ప్రాణాలు కోల్పోయే విధంగా పరిస్థితి మారింది. నాలుగు దశాబ్దాలు ఒక రకంగా ఇరాన్ ప్రజలు దేశమనే బహిరంగ బందిఖానాలో గడిపారు. వెనెజువెలా అయినా, ఇరాన్ అయినా ఒక దేశంపై మరో దేశం దండయాత్ర సహించరానిది. కానీ ఇరాన్ ప్రజలు జోక్యం చేసుకోమని ట్రంప్‌ను పిలుస్తున్నారంటే ఇరాన్ ప్రజలు ఎలాంటి నిర్బంధాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది. ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముల్లాల పాలనకు రోజులు దగ్గర పడ్డట్టే. అదే జరిగితే తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తులో ఇరాన్ గత వైభవాన్ని చవిచూసే అవకాశం ఉంది.
మతం వ్యక్తిగతం. పాలనలో మతం ప్రవేశిస్తే ఏమవుతుందో పాకిస్థాన్‌ను, ఇరాన్‌ను చూసి మన దేశంతో పాటు ప్రపంచం అర్థం చేసుకోవాలి. లేకపోతే అందరిదీ ఇరాన్ గతే అవుతుంది.
-బుద్దా మురళి