భారత్‌లోని అతిపెద్ద విమానయానరంగ సంస్థ ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో దేశంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. వేల మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్ కలిగిన భారత్‌లో రెండు కంపెనీల గుత్తాధిపత్యం వల్ల జరిగే అనర్థాలను ఈ ఘటన బహిర్గతం చేసింది.
భారత దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగోకు 65 శాతం వాటా ఉన్నది. ఆకాశయానం చేయాలన్న వేలాది మంది కలను కొన్నేండ్లుగా ఈ సంస్థ సాకారం చేస్తున్నది. సమయపాలన, అతితక్కువ టిక్కెట్ ధరలతో మొన్నటివరకు భారత విమానయానానికి ఇండిగో కేరాఫ్‌గా నిలిచింది. అయితే, ఈ పరిస్థితి గత వారం తలకిందులైంది. పైలట్ల పని గంటలకు సంబంధించి డీజీసీఏ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం కొత్త షెడ్యూల్‌ను రూపొందించడంలో ఇండిగో విఫలమవడంతో పైలట్ల కొరత ఏర్పడి సుమారు 2 వేల విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. తత్ఫలితంగా వేల మంది ప్రయాణికుల ప్రణాళికలు తారుమారయ్యాయి. భారత విమానయాన రంగంలో ఎన్నడూ లేని విధంగా లగేజ్ బ్యాగులతో నిండిపోయిన టెర్మినళ్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోటెత్తాయి.
భారత విమానయాన రంగానికి అత్యంత కీలక సమయంలో ఇండిగో సంస్థలో ఇలాంటి సమస్య ఉత్పన్నమైంది. భారత మార్కెట్లో 27 శాతం షేర్ ఉన్న ఎయిర్ ఇండియాపై కొన్నేండ్లుగా పాత విమానాలు, నాసిరకం సేవల విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జూన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 260 మంది ప్రయాణికులు మరణించాక ఆ సంస్థపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాబోయే రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఇండిగో చెప్తున్నప్పటికీ, ఒకే సంస్థపై అతిగా ఆధారపడటం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేసింది. అంతేకాదు, ఇండిగో నిజంగా వైఫల్యాలను తట్టుకునేంత పెద్దదా? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతున్నది.
ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం వెంటనే రంగంలోకి దిగి పైలట్ల డ్యూటీ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో ఒక చిన్న ఆపరేషనల్ వైఫల్యం మొత్తం వ్యవస్థను ప్రమాదంలో పడేసే స్థాయికి ఇండిగో ఎదిగిందని స్టార్ ఎయిర్ కన్సల్టింగ్ సంస్థ చైర్మన్ హర్షవర్ధన్ తెలిపారు. ‘ఇండిగో లేదా ఎయిర్ ఇండియా ఏదైనా సమస్యలో చిక్కుకుంటే భారత విమానయాన రంగంలో అల్లకల్లోలం తప్పదు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం జెట్ ఫ్యూయల్ పన్నులను తగ్గించి, సంస్థల మధ్య పోటీని ప్రోత్సహించాలి’ అని ఆయన సూచించారు.
ఆస్ట్రేలియా, కెనడా వంటి పలు దేశాల్లో ద్వంద్వాధిపత్యం నడుస్తున్నది. చైనాలో మూడు ప్రభుత్వరంగ విమానయాన సంస్థలు, పలు ప్రైవేట్ సంస్థలున్నాయి. వాస్తవ అర్థంలో చూసుకుంటే భారత విమానయాన మార్కెట్లో ద్వంద్వాధిపత్యం ఉందని చెప్పలేం కానీ, ఇండిగో, ఎయిర్ ఇండియా కలిపి 92 శాతం మార్కెట్ వాటాతో అలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఈ రెండు సంస్థల గుత్తాధిపత్యం అసలు సమస్యగా మారుతున్నది. అంతేకాదు, దేశంలో చిన్న చిన్న నగరాలు, పట్టణాలను అనుసంధానం చేసే అనేక మార్గాల్లో ఇండిగో గుత్తాధిపత్యం కొనసాగుతున్నది.
ఏ రంగంలోనైనా సరే ఒకటి, లేదా రెండు కంపెనీల గుత్తాధిపత్యం ఉన్న దేశం అభివృద్ధి చెందదని ఒకప్పటి చౌకైన విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రికకు రాసిన వ్యాసంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాల విస్తరణ, ఆపరేషన్ నిబంధనలను సరళతరం చేయడం లాంటి చర్యలు చేపట్టినప్పటికీ, దేశంలో కొన్ని సంస్థలే నిలదొక్కుకున్నాయి. అధిక పన్నులు, తీవ్రమైన పోటీ కారణంగా కింగ్‌ఫిషర్, జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ తదితర సంస్థలు మూతబడ్డాయి.
ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఎయిర్‌లైన్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా భారత విమానరంగానికి సంబంధించి తమ ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను ప్రధాని మోదీ వివరించారు. అయితే, ఆయన ఆశయాలు నెరవేరడమనేది ఇండిగో, ఎయిర్ ఇండియా విజయంపైనే ఆధారపడి ఉన్నది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. 2024లో భారత్‌లో 17.4 కోట్ల మంది విమానయానం చేశారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ. 2006లో రాకేశ్ గంగ్వాల్, రాహుల్ భాటియా స్థాపించిన ఇండిగో సంస్థ అనతికాలంలోనే భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది.
ఇండిగో వద్ద ప్రస్తుతం 400కి పైగా విమానాలున్నాయి. 2 వేలకు పైగా రూట్లలో విమానాలను నడిపే ఆ సంస్థ ప్రతి రోజు సుమారు 3.80 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్ల ఆదాయం, 807 మిలియన్ డాలర్ల లాభాలు గడించిన ఇండిగో భారత మార్కెట్‌ను శాసిస్తున్నది. అయితే, ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థ ఆదాయానికి గండిపడే అవకాశం ఉన్నది. సమయపాలనే తమ అతిపెద్ద బలమని ఇండిగో మొదటినుంచీ ప్రచారం చేసుకుంటున్నది. జూలైలో ఇండిగో 91.4 శాతం సగటు సమయపాలనను నమోదు చేసింది. కానీ, డిసెంబర్ 5 నాటికి ఇది 3.7 శాతానికి పడిపోయింది. ఆదాయ నష్టాలను పక్కనపెడితే, సంస్థ ప్రతిష్ఠ దెబ్బతినడమే ఇండిగోకు అతిపెద్ద నష్టమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
(‘రాయిటర్స్’ సౌజన్యంతో..)
– (వ్యాసకర్త: విమానరంగ విశ్లేషకులు, ఢిల్లీ)
అభిజిత్ గణపవరం