రెండోసారి అధ్యక్షుడిగా గద్దెనెక్కిన తర్వాత అమెరికా ఆధిపత్యం, వివిధ దేశాలపై సుంకాల పెంపు, ఆక్షల విధింపులతో డొనాల్డ్ ట్రంప్ నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్నారు. ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దౌత్యపరమైన చారిత్రక ఘట్టానికి భారత్ తెరతీసింది. భావితరాలు గుర్తుంచుకునేలా భావసారూప్యత గల దేశాలతో మైత్రిని బలోపేతం చేసుకునే దిశగా కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సన్నద్ధమైంది. ఈ మేరకు కొలిక్కి వచ్చిన చర్చలపై భారత్, ఈయూ నేడు సంయుక్త ప్రకటన చేసే అవకాశమున్నది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భారత్, ఈయూ ఒప్పందాన్ని అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి అని దౌత్య, వాణిజ్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఒప్పందానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? భవిష్యత్తులో భారత్, ఈయూ సాధించే ఫలితాలు ఎలా ఉంటాయి? అని సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. భారత్, ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాధారణ పరిస్థితిలో ఏర్పడటంలేదు. ప్రపంచంలో పెరుగుతున్న అస్థిరత, దక్షిణ అమెరికాలో యూఎస్ సైనిక బలగాల కార్యకలాపాల నేపథ్యంలో పురుడు పోసుకుంటున్నది. విచ్ఛిన్నమవుతున్న ప్రపంచంలో ఈ ఒప్పందాన్ని కీలకమైన బంధంగా పేర్కొనవచ్చు.
రెండు వందల కోట్ల మందికి నూతన శకం
భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతున్న పరిస్థితులు, సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది కేవలం వాణిజ్యపరమైనదిగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైనది. ఢిల్లీలో జరిగిన భారతదేశ 77వ గణతంత్ర వేడుకల్లో చీఫ్ గెస్ట్‌గా ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లేయన్ హాజరుకావడం, కర్తవ్యపథ్‌లో తొలిసారి ఈయూ సైనిక బలగాలు కవాతులో పాల్గొనడం కీలక ఘట్టం. భారత్-ఈయూ మధ్య జరుగుతున్నది కేవలం కొనుగోలు-అమ్మకం తరహా వాణిజ్య ఒప్పందం కాదు. ఇది ఒక కీలకమైన భద్రతాపరమైన భాగస్వామ్య ఒప్పందం. భారత్, ఈయూ జనాభా కలిపి చూస్తే మొత్తం 200 కోట్ల వరకు ఉంటుంది. ఈయూతో ఒప్పందం ద్వారా ఆటోమొబైల్, మద్యం తయారీ రంగాల్లో ఈయూ కంపెనీలకు సుంకాల తగ్గింపు ఉంటుంది. అలాగే సేవలు, ఔషధ రంగాల్లో భారత్‌కు మెరుగైన మార్కెట్ లభిస్తుంది. భారతీయ నిపుణులు ఈయూలోకి సులభంగా వెళ్లేందుకు వీలు కలుగుతుంది.
పెట్రోడాలర్ ఒత్తిడి-ఒప్పందానికి ప్రాధాన్యత
అంతర్జాతీయ వాణిజ్యంలో చమురు, వస్తువుల ధరను డాలర్లలో నిర్ణయిస్తారు. కానీ డాలర్ ఆధిపత్యంపై భిన్నవాదనలు నెలకొన్నాయి. డాలర్ వాణిజ్యం పట్ల వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. దీంతో డీడాలరైజేషన్ అనే విధానానికి ప్రాధాన్యత సంతరించుకున్నది. పెట్రోడాలర్ వాణిజ్య వ్యవస్థతో డాలర్ వాణిజ్యం కట్టడిలో ఉన్నది. గతంలో ఇరాక్, లిబియా దేశాధినేతలు డాలర్ వ్యవస్థను అధిగమించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయా దేశాల వ్యవహారాల్లో అమెరికా జోక్యం, ఆనాటి పరిస్థితుల చారిత్రక చేదు జ్ఞాపకాలు భౌగోళిక రాజకీయ వాతావరణంలో భూతాల మాదిరిగా వెంటాడుతున్నాయి. ఇలాంటి నేపథ్యాలతో భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మైలురాయి.
ఒప్పందం.. రక్షణ కవచం
బ్రిక్స్+కూటమి దేశాల జనాభా.. ప్రపంచ జనాభాలో 50 శాతం ఉంటుంది. ఈ కూటమి దేశాలు వ్యవస్థాగతమైన మార్పునకు నాయకత్వం వహిస్తున్నాయి. బ్రిక్స్‌లోని భారత్, భాగస్వామ్య దేశాలు దాదాపు 90 శాతం స్థానిక కరెన్సీలోనే లావాదేవీలు సాగిస్తున్నాయి. కాబట్టి భారత్ విషయానికి వస్తే ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కేవలం రాజకీయ ప్రకటనగా చూడలేమని, ఇదొక ఆర్థిక రక్షణ కవచం అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మార్పునకు ఉత్ప్రేరకం
ఈ నెల 3న వెనెజువెలాపై అమెరికా జరిపిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ ప్రపంచాన్ని కుదిపేసింది. అమెరికా బలగాలు 150 విమానాలతో వెళ్లి వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించాయి. మాదకద్రవ్యాల నిరోధానికి జరిపిన దాడిగా పైకి చెప్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు ఆలోచనలో పడ్డాయి. అరుదైన ఖనిజ సంపద కలిగిన గ్రీన్లాండ్స్ విషయంలో అమెరికా హెచ్చరికల కోణంలో అగ్రరాజ్యం వైఖరిని ఆధునిక కాలపు వనరుల దోపిడీగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య డాలర్ వాణిజ్యం నుంచి ప్రపంచ దేశాలు దూరం జరిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇంధన కేంద్రాలు, ఆర్కిటిక్ వంటి ఖనిజ సరిహద్దులపై నియంత్రణకు యూఎస్ అర్రులు చాస్తున్నది. దీంతో ప్రపంచ దేశాలు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోరుకుంటున్నాయి.
అంతరాల తొలగింపు: ఐఎంఈసీ, సాంకేతికత
భారత్, ఈయూ కొత్త కూటమికి కేంద్ర బిందువు ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్ (ఐఎంఈసీ). ఈ ఒప్పందంతో భారత్, యూరప్ మధ్య షిప్పింగ్ సమయాన్ని దాదాపు 40 శాతం తగ్గిస్తుంది. సూయిజ్ కాలువ వంటి మార్గాలను బైపాస్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. భారత్-ఈయూ, ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఇప్పటికే ఫలితాలు ఇస్తున్నది.
ప్రపంచ ఉద్రిక్తతలు-వ్యూహాత్మక విజయం
భారత్, ఈయూ వాణిజ్య లావాదేవీలు రూపాయి, యూరోలలో జరిగితే రెండు ఆర్థిక వ్యవస్థలు డాలర్ అస్థిరత నుంచి రక్షణ పొందుతాయి. అంతేకాకుండా అమెరికా ఏకపక్ష ఆంక్షల బెడద నుంచి కూడా ఎఫ్‌టీఏ రక్షణ కవచంగా నిలుస్తుంది. నూతన భద్రత, రక్షణ భాగస్వామ్యంతో భారతీయ సంస్థలు ఈయూకు చెందిన 150 బిలియన్ యూరోల సేఫ్ (సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరోప్) ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించుకోగలవు. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్ సరుకు రవాణాను సులభతరం చేస్తుంది. అస్థిరతలు కలిగిన ఎర్ర సముద్రాన్ని అధిగమించడం వల్ల సరుకు రవాణా ఖర్చులను 30 శాతం తగ్గిస్తుంది. ఈయూ కార్బన్ ట్యాక్స్ సవాలే. కానీ ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి అమలు కమిటీ ఏర్పాటు చేస్తారు. భారతీయ ఉక్కు, సిమెంట్ పరిశ్రమలకు గ్రీన్‌టెక్ పరిజ్ఞానం అందిస్తారు.
భారత్ ముందున్న మార్గం
భారత్-ఈయూ ఒప్పందం నేపథ్యంలో ఒక బహుళ కేంద్ర వ్యవస్థ గల ప్రపంచం ఆవిర్భవిస్తుందని చెప్పవచ్చు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే సాధారణ భారత ప్రజానీకానికి యూరప్‌కు చెందిన వస్తువులు చౌకగా దొరకడం లేదా వీసాలు సులభంగా లభించడం మాత్రమే కాదు. ఏదో ఒక కూటమిలో ఉపగ్రహంగా ఉండకుండా భారత్ ఒక స్వింగ్స్టేట్గా ఉద్భవిస్తుంది. కరెన్సీ ఆధిపత్య పోరులో తరచుగా యుద్ధట్యాంకులు, ఆంక్షలను అస్ర్తాలుగా మారుస్తున్న కాలంలో దీర్ఘకాలిక సౌభాగ్యం కోసం వాణిజ్యం, సాంకేతికత, పరస్పర గౌరవమే ప్రబలమైన సాధనాలని భారత్-ఈయూ ఒప్పందం నిరూపిస్తున్నది. సుక్కన్న