చర్చల స్ఫూర్తి అనేది ఈ నెల 19-23 వరకు దావోస్‌లో జరిగిన 56వ ప్రపంచ ఆర్థిక సదస్సు ఇతివృత్తం. ఈ సదస్సులో 120 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు,కంపెనీల సీఈవోలు, బోర్డు చైర్మన్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో 50 మంది ప్రభుత్వాల అధినేతలు ఉన్నారు. ప్రపంచంలోని ఐదు కీలకమైన సవాళ్లపై సదస్సులో చర్చలు జరిగాయి. అవి పోటీ ప్రపంచంలో సహకారం, వృద్ధి లక్ష్యంగా కొత్త వనరులను అన్వేషించడం, మానవ వనరులపై పెట్టుబడి, ఆవిష్కరణల బాధ్యతాయుత అమలు, భౌగోళిక సరిహద్దులను గౌరవిస్తూ శ్రేయస్సును నెలకొల్పడం లక్ష్యంగా సాగాయి. ఈ చర్చల ఫలితాలను సందర్భోచితంగా నిష్పక్షపాతంగా విశ్లేషించాల్సిన అవసరమున్నది.
మొదటగా, అనిశ్చితి గురించి చూ ద్దాం. ఇది ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న ప్రమాదాలను నిర్వచించే అంశం. ప్రభుత్వాలు బహుపాక్షిక విధానాల నుంచి వైదొలుగుతున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఘర్షణల తీవ్రత పెరుగుతున్నది. సహకార వ్యవస్థ కుప్పకూలుతున్నది. స్థిరత్వం ముట్టడికి గురవుతున్నది. సహకారం స్థానంలో ఘర్షణ వచ్చి చేరే పోటీ ప్రపంచం అవతరిస్తున్నది. సహకారానికి మూలమైన నమ్మకం విలువను కోల్పోతున్నది.
ఈ పరిణామాల నేపథ్యంలో అంటే చర్చల స్ఫూర్తి అనేది మునుపెన్నడూ లేనంత ఆవశ్యకమైన అంశంగా నిలుస్తున్నది. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులు నెలకొంటున్న పరిస్థితుల్లో, భాగస్వామ్య దేశాలు భావాలను పరస్పరం చెవియొగ్గి వినడం చాలా ముఖ్యం. సొంత అభిప్రాయాల గురించి ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా అవసరం. దేశాలు, కూటములు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ అభిప్రాయాలను మార్చుకోవాలి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవాలి. ఈ తరహా ఆలోచనా దృక్పథం ప్రాధాన్యతను చాటేందుకు చర్చల స్ఫూర్తిని ఇతివృత్తంగా తీసుకున్నారని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో చర్చల స్ఫూర్తి దావోస్ నుంచి భారత్‌కు ప్రయాణించింది. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ వేదికగా భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. రెండు దశాబ్దాల సంప్రదింపుల తర్వాత ఈ మేరకు పురోగతి సాధ్యమైంది. ఈ సందర్భంగా ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెన్ లేయన్ దావోస్‌లో చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకోవచ్చు. దావోస్‌లో ఆమె మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచం చాలా భిన్నంగా ఉండొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పాఠం మాత్రం అదేనని విశ్వసిస్తున్నాను. భౌగోళిక, రాజకీయపరమైన ఎదురుదెబ్బలు యూరప్‌కు ఒక అవకాశంగా మారగలవు, కచ్చితంగా మారుతాయి అని అన్నారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యం గమనిస్తే చాలా కీలకమైన ప్రకటనగా గుర్తించవచ్చు. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దురాక్రమణ ధోరణి కనబరుస్తున్నారు. ఈ వైఖరిని యూరోపియన్ యూనియన్ వ్యతిరేకించింది. దీంతో ఈయూపై వాణిజ్య యుద్ధాన్ని తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరించి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఇలాంటి పరిణామాల కొనసాగింపుగా దావోస్ వేదికగా ఉర్సులా చేసిన ప్రకటనను చూడాలి. ఇదే పరిస్థితుల్లో భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం సుంకాలపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. భారత్ వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను వేగవంతం చేసింది.
చారిత్రకమైన భారత్, ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 200 కోట్ల మంది జనాభా కలిగిన మార్కెట్‌ను సృష్టిస్తుంది. ఈ మార్కెట్ విలువ ప్రపంచ జీడీపీలో 25 శాతం ఉంటుంది. ఇటీవల వాన్‌డెర్ లేయన్, భారత వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్.. ఈ ఒప్పందాన్ని అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి వంటిది అని పేర్కొన్నారు.
భారతదేశం ఇటీవల వివిధ దేశాలతో పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఉదాహరణకు యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్టీఏ)తో జరిగిన అగ్రిమెంట్. ఈఎఫ్‌టీఏలో సభ్య దేశాలుగా ఐస్లాండ్, లిక్టెన్ైస్టెన్, నార్వే, స్విట్జర్లాండ్ ఉన్నాయి. అలాగే యూకేతోనూ భారత్ ఒప్పందాలు చేసుకున్నది. మరోవైపు, యూరోపియన్ యూనియన్ కూడా 25 ఏండ్ల సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత దక్షిణ కామన్ మార్కెట్ దేశాలు- అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే, బొలీవియాతో ఒప్పందాలను పూర్తిచేసింది. దీంతో ఈయూ, లాటిన్ అమెరికాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలి ఏర్పాటు అయ్యింది. ఈ మార్కెట్లో 31 దేశాలు, 70 కోట్ల వినియోగదారులతో కూడిన, ప్రపంచ జీడీపీలో 20 శాతం వాటాను కలిగిన ఉన్న మార్కెట్ ఏర్పాటైంది. ప్రపంచంలో మారుతున్న రాజకీయ, ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో వివిధ దేశాలు రాజీకి సిద్ధపడుతున్నట్టు కనిపిస్తున్నది. పైన పేర్కొన్న వాణిజ్య ఒప్పందాలు ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు.
భారత్ విషయానికి వస్తే, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఓ వ్యూహాత్మక అవకాశం. వ్యూహాత్మక విధానాల కోణంలోనూ ఇది సానుకూలమే. ఈ ఒప్పందం భారత్‌కు చైనాపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఇక తమ ఎగుమతులు పెంచుకోవడానికి యూరప్‌కు అవకాశం ఏర్పడుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రకారం సరుకు రవాణా పన్నులు లేదా దిగుమతి సుంకాలు తగ్గడం లేదా పూర్తిగా తొలగించడం వీలవుతుంది. మార్కెట్లోకి ప్రవేశం, నియంత్రణకు ఇవి దోహదపడుతాయి. భారత్-ఈయూ ఒప్పందంతో సాంకేతిక, ఔషధ, ఆటోమొబైల్, చర్మ, వస్త్ర, ఉక్కు, పెట్రోలియం, ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తుల వంటి శ్రమ ఆధారిత రంగాలు ఈయూ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవచ్చు. భారతీయ సేవా రంగాలు ముఖ్యంగా టెలీకమ్యూనికేషన్స్, రవాణా, వ్యాపారసేవా రంగాల ఎగుమతులు కూడా ఈయూ మార్కెట్లో పెరుగుతాయి. మరోవైపు భారత్‌కు ఈయూ నుంచి విమానాలు, విడిభాగాలు, విద్యుత్తు యంత్రాలు, వజ్రాలు, రసాయనాల దిగుమతులు పెరుగుతాయి. ఫలితంగా భారత్‌కు లాభం చేకూరుతుంది. ఈయూ నుంచి మేధో సంపత్తి, ఐటీ, టెలికమ్యూనికేషన్స్, వ్యాపార సేవలు విస్తరించడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
భారత్, ఈయూ సంప్రదింపులు, ఒప్పందాలు ప్రపంచానికి చాలా బలమైన సందేశాన్ని పంపుతున్నాయి. దేశాలు సుంకాల వాణిజ్యాన్ని కాకుండా పారదర్శకమైన వాణిజ్యాన్ని కోరుకుంటున్నాయని స్పష్టంచేస్తున్నాయి. దేశాలు ఒంటరిగా మిగిలిపోవడమో, ఘర్షణ పడటమో కాకుండా భాగస్వామ్య దేశాలను వెతుక్కుంటున్నాయని, తమ ఆర్థిక వ్యవస్థను ప్రమాదాల నుంచి కాపాడుకుంటున్నాయని నిరూపిస్తున్నాయి. ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైవిధ్యభరితంగా వ్యాపార పరిధిని పెంచుకుంటున్నాయనే విషయం భారత్, ఈయూ ఒప్పందంతో స్పష్టమవుతున్నది. ఇదే సందర్భంగా దావోస్ వేదికగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ చెప్పిన మరో మాట గుర్తుచేసుకోవాలి. దావోస్‌లో ఆయన మాట్లాడుతూ మధ్యస్థాయి దేశాలు కలిసిమెలిసి పని చేయాల్సిందే. మనం వారి(అమెరికా) టేబుల్ మీద లేకపోతే, మెనూలో కచ్చితంగా ఉంటాం. ఇది అత్యంత కీలకమైన వ్యాఖ్య. ఇదే తరహా స్ఫూర్తితో దేశాలు నూతన ఒప్పందాలతో ముందుకు పోతున్నాయని గుర్తుచేసుకోవచ్చు.
-చెన్నమనేని రమేశ్