కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీఎంపీఎస్-1998 ఒప్పందం ప్రకారం.. ఉద్యోగి పదవీ విరమణ చేసినరోజు పింఛన్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే వస్తున్నది. ప్రతి మూడేండ్లకోసారి సవరించి పింఛన్ పెంచవలసి ఉన్నా 25 ఏండ్లు గడుస్తున్నా అది జరగడం లేదు. ఇది అత్యంత బాధాకరం. చాలీచాలని పింఛన్‌తో వీళ్లు దీనస్థితిలో తమ బతుకులను ఎల్లదీస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు పెంచుతున్నది. అన్ని సంస్థల, సంఘటిత, అసంఘటిత కార్మికులకు వేతనాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ దేశానికి వెలుగును ప్రసాదించి, పరిశ్రమలకు ఇంధనశక్తిని అందించి, ప్రకృతికి విరుద్ధంగా తమ యుక్త వయస్సును బొగ్గు గనుల్లో ధారపోసిన బొగ్గు గని విశ్రాంత ఉద్యోగులకు మాత్రం పింఛన్ పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యోగుల పట్ల ఉదాసీనత కనబరుస్తున్నదని స్పష్టమవుతున్నది. ప్రభుత్వాలు సమయానుకూలంగా పాలనలో సంస్కరణలు తీసుకువస్తాయి. ఎన్నో మార్పుచేర్పులు చేస్తాయి. ఉత్పత్తి, డిమాండ్ దృష్ట్యా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతుంటాయి. దేశంలో సామాన్యమైన కూలీ నుంచి రాష్ట్రపతి వరకు తమ వేతనాలు పెంచుకుంటున్నారు. ఇదే పద్ధతిలో అతి సామాన్యమైన ఉద్యోగి నుంచి అత్యున్నతమైన అధికారులు కూడా తమ అవసరాలకు తగినట్టుగా, కాలానుగుణంగా వేతనాలు పెంచుకొని సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్నారు. ఆఖరికి మన రాజ్యాంగాన్ని కూడా అవసరాల దృష్ట్యా ఇప్పటికి 104 సార్లు సవరించుకున్నాం.
మన దేశంలో మాత్రం విశ్రాంత బొగ్గుగనుల ఉద్యోగుల పరిస్థితి మాత్రం మారడం లేదు. సీఎంపీఎస్ (కోల్ మైన్స్ పింఛన్ స్కీమ్) 1998 పథకం ప్రకారం దేశంలోని బొగ్గు గనుల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చివరి పది నెలల సరాసరి వేతనంపై 25 శాతం పింఛన్ చెల్లించేందుకు అంగీకారం, ప్రతి మూడేండ్లకోసారి సమీక్ష జరపాలి, పింఛన్ పెంచాలని స్పష్టంగా పేర్కొనబడినది. కానీ 24 ఏండ్లు గడిచినా ఇంతవరకు సమీక్షలు చేసింది లేదు, పింఛన్ పెంచింది లేదు. తత్ఫలితంగా విశ్రాంత ఉద్యోగికి చివరి వేత నం ప్రకారం పింఛన్ రూ.500 ఉంటే కేంద్రం ఇప్పటికీ అంతే పింఛన్ చెల్లిస్తున్నది. బహుశా దేశంలో ఇటువంటి పరిస్థితి ఏ రంగంలోనూ లేదేమో! రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక బొగ్గుగనుల శాఖా మంత్రులకు, కోల్ ఇండియా చైర్మన్ బొగ్గుగనుల భవిష్యత్తు నిధి కమిషనర్లకు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు ఎన్నోసార్లు ఈ-మెయిల్, పోస్టల్ ద్వారా, మై గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా కూడా వినతి పత్రాలు అందజేశాం. అయినా వారినుంచి స్పందన లేదు. కలకత్తాలోని కోల్ ఇండియా భవన్ ముందు , ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాలూ నిర్వహిం . అయినా ఫలితం దక్కలేదు. ఇందుకు సంబంధించిన వ్యాజ్యం గత ఆరేండ్లుగా ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతున్నది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో నెల రోజులపాటు జంతర్ మంతర్ వద్ద నిరవధిక రిలే నిరాహార దీక్షలు కూడా చేశాం. కానీ నాలుగు రోజులు దీక్షలు కొనసాగిన తర్వాత 29వ తేదీన ఢిల్లీ పోలీసులు దీక్షను నిలిపివేశారు.
ఒడిశా రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు మహేశ్ సాహూ గతంలో మా సమస్యను రెండుసార్లు లోకసభలో ప్రస్తావించారు. అంతేకాకుండా జూలై 26న జంతర్‌మంతర్ వద్ద స్వయంగా ధర్నాలో కూడా పాల్గొన్నారు. 2022 జూలై 27న బొగ్గు గనుల శాఖామంత్రిని కలిసి మా సమస్యను ఆయన దృష్టికి తీసుకుపోయారు. వారు చేస్తున్న ఈ నిరంతర ప్రయత్నానికి మా కృతజ్ఞతలు. 2022 డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉన్న కోల్ ఇండియా పింఛనర్లతో ధర్నా కార్యక్రమం నిర్వహించాం. అయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదు. విశ్రాంత బొగ్గుగనుల ఉద్యోగుల పింఛన్‌ను పెంచాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. జీవిత చరమాంకంలో ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందనే ఆశతో ఎదురుచూస్తూనే ఉంటాం.
(వ్యాసకర్త: దండంరాజు రాంచందర్‌రావు ,98495 92958, అధ్యక్షులు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, కాప్రా, హైదరాబాద్)