గ్లోబల్ కంపెనీల పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ. ప్రపంచంలో దిగ్గజ సంస్థలుగా పేరున్న అనేక పరిశ్రమలు హైదరాబాద్‌లో తమ కంపెనీలను నెలకొల్పుతున్నాయి. గత తొమ్మిదేండ్లలో తెలంగాణలో ఐటీ రంగం అద్భుత ఫలితాలతో దేశానికి ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ కృషితో వేల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి రావడంతోపాటు, తెలంగాణ బిడ్డలకు లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్.. గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు.
ఐటీ రంగంలో ప్రభుత్వం తొమ్మిదేండ్లలో దాదాపు రూ. 22,700 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించిం ది. రూ.4 లక్షల కోట్ల పైచిలుకు (50 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో 23 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. ఐటీ రంగంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట ఒక ఉద్యోగం మనదే కావడం విశే షం. 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సాయుధ దళాలు సహా అన్ని రంగాలను కలుపుకొని 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు (0.5% శాతం మంది) మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతున్నది. అలాంటిది 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 2 శాతానికి పైగా అంటే ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మిగతా చదువుకున్న యువతకు స్వయం ఉపాధి లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి ఇటీవల కేటీఆర్ రెండు వారాలపాటు యూకే, యూఎస్‌లో పర్యటించారు. తద్వారా రాష్ర్టానికి భారీ పెట్టుబడులను ఆకర్షించి 42 వేల ఉద్యోగాల కల్పనకు కృషి చేశారు. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ అంశంపై మే 12న లండన్‌లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్’ ఆధ్వర్యంలో అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్లో నిర్వహించిన ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్‌లో పాల్గొని కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల విజయగాథను వివరించారు.
తెలంగాణలో వ్యాపార రంగానికి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను గ్లోబల్ కంపెనీలకు వివరించి, ఒప్పించి.. వాటిని రాష్ర్టానికి తీసుకురావడంలో మంత్రి కేటీఆర్ సక్సెస్ అవుతున్నారు. ఆ మధ్య దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ కొత్త పెట్టుబడులతోపాటు భవిష్యత్ పెట్టుబడులకూ తెలంగాణను గమ్యస్థానంగా మార్చడంలో ఆ సమావేశాలను ఫలవంతం చేశారు. రూ.21 వేల కోట్లు పెట్టుబడులు వచ్చేలా కృషి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలంగాణ భౌగో ళిక స్వరూపంతో పాటు 8 ఏండ్లలో వివిధ రంగాల్లో సాధించిన పెట్టుబడులు, పారిశ్రామిక, ఐటీ దాని అనుబంధ రంగాల్లో చేపట్టిన టీ హబ్ కార్యక్రమాలను పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా తిలకించారు.గత ఐదేండ్లలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన వ్యక్తిగా కేటీఆర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2022 ఏడాదిలోనే తెలంగాణ దాదాపు 215 కంపెనీల నుంచి లైఫ్ సైన్సెస్ రంగంలో రూ. 6,400 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించింది. 2020 దావోస్‌లో నాలుగు రోజుల పర్యటనలో అప్పటి ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకకోలా సీఈవో జేమ్స్ క్వేన్సీ, సేల్స్ ఫోర్స్ స్థాపకుడు చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశమై.. దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడులకు కంపెనీలతో ఒప్పం దం కుదుర్చుకున్నారు. ఇలా ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నది.
ఐటీ, ఐటీఈఎస్ రంగాన్ని కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని టైర్-2, టైర్-4 పట్టణాలకు కూడా విస్తరించే దిశగా కేసీఆర్ సర్కారు అడుగులు వేస్తున్నది. దీంతో ఐటీ కంపెనీలతోపాటు, భారీ పరిశ్రమలు ఆయా జిల్లాల్లో విస్తరిస్తున్నాయి. కోదాడలో రోబోక్సా, బెల్లంపల్లిలో సనాతన అనలిటిక్స్ , పరకాల కేంద్రంగా నడిచే డిజియోధ అనే కంపెనీలు సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట లాంటి జిల్లాలకు ఈరోజు ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. పరిశ్రమల విషయానికొస్తే.. ఆ మధ్య మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అమరరాజా గ్రూప్ ఇక్కడ రాబోయే పదేండ్ల కాలంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నది. దీంతో ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి.
కేటీఆర్ నాయకత్వంలో ఐటీ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో పనిచేస్తున్న మొత్తం ఐటీ ఉద్యోగుల్లో ఐదో వంతు హైదరాబాద్ నుంచే పనిచేస్తుండటమే ఇం దుకు నిదర్శనం. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ ఐటీ రంగం లో 3 లక్షల 23 వేల మంది పని చేసేవారు. ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది ప్రత్యక్షంగా పని చేస్తున్నారు. దేశ ఐటీ రంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల సంఖ్యలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ దాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్ హబ్ టీ-హబ్ తెలంగాణలో రూపుదిద్దుకొని, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ది. దశాబ్దంలోకి అడుగెడుతున్న బీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ.. ఐటీలో అద్భుతాలు సాధి ంచి తెలంగాణ బిడ్డలకు ఉపాధి అవకాశాలను పెంచింది.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి)
-మన్నె గోవర్దన్ రెడ్డి
98660 87878