తన ప్రతిభా సామర్థ్యాలతో పది నెలల క్రితం అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోరు, తీరు సరైనవి అయితే ఇంతకాలంలో ఎంతో మంచి పేరు తెచ్చుకునేవారు. పరిపాలనపై దృష్టి కేంద్రీకరించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ, తన స్థానాన్ని కూడా సుస్థిర పరచుకునేవారు. కానీ, ఆయన నోరు, తీరు రెండూ బాగా లేవు. ఇది సామాన్యుల నుంచి విజ్ఞుల వరకు అందరూ ఎత్తిచూపుతున్నారు. పాత లక్షణాలు పోయేందుకు కొంత సమయం పడుతుందిలే అనుకుని కొంతకాలం వేచిచూసిన వారు కూడా ఈ సరికి ఆశలు వదులుకున్నారు. తనలో ఆ ధోరణి పోకపోగా ఇటీవల మరింత రెచ్చిపోతున్నారు. అందుకు కారణం ఒత్తిడికి గురికావటమని, డెస్పరేషన్ అని ఏ మానసిక శాస్త్ర నిపుణుడిని అడిగినా చెప్తారు. మరి అటువంటి ఒత్తిడికి కారణమేమిటని విచారిస్తే, పరిపాలనలోని వైఫల్యాలు,వాటిపై ప్రజల నుంచి ఇతర వర్గాల నుంచి పెరుగుతున్న విమర్శలని కూడా ఎవరైనా చెప్పగలరు.
నోటీసులు ఇచ్చి సామాన్లయినా తీసుకునే అవకాశం ఇవ్వకుండా పోలీసులతో బెదిరింపులు, జేసీబీ కూల్చివేతలు, నోటీసులిస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు, శని, ఆదివారాల్లోనైతే కోర్టులుండవు వంటి దుర్మార్గపు ఆలోచనలూ,ఈ తీరునంతా ఏమంటారో ముఖ్యమంత్రే ప్రజలకు నిజాయితీగా చెప్పాలి.
CM revanth Reddy | అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ నాయకత్వాన కాంగ్రెస్ గెలిచిన తొలి ఘడియలలో, తన చుట్టూ పార్టీ కార్యకర్తలు మోహరించి ఉండగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ కార్యకర్తలను, వారితో పాటు అక్కడ లేనివారిని కూడా ఉద్దేశిస్తూ రెండు మాటలన్నారు. తాను అప్పటివరకు మాట్లాడిన తీరులో ఇక ముందు మాట్లాడలేనని, ఆ విషయం అందరూ అర్థం చేసుకోవాలని, ఇక ఆ భాషను ఆశించవద్దని అన్నారు. అప్పటివరకు మాట్లాడిన తీరు ఏమిటో ఆయన వివరించలేదు.
కానీ, అదేమిటో అందరికీ సుపరిచితమే గనుక వెంటనే ఓహో అనుకున్నారు. అయితే, అటువంటి భాషకు, దూకుడుకు మెచ్చి అలవాటు పడిన రేవంత్‌రెడ్డి బ్రాండ్ ఆధునిక శిష్యగణానికి, అటువంటి సాధు భాష ఎంతవరకు నచ్చిందో చెప్పలేము. అటువంటి సూక్ష్మస్థాయి (మైక్రో) రిపోర్టింగ్ జర్నలిజం మనకింకా రాలేదు. మామూలు పద్ధతిలో ఊహించాలంటే వారికది ఎంతమాత్రం నచ్చదు. అదెట్లున్నా, వారిని ఆయన ఎంతమాత్రం నిరాశపరచలేదన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం. ఎవరికైనా పాత సంస్కృతిని వదిలించుకోవాలని నిజంగానే ఉన్నా, జీవిత నేపథ్యం నుంచి అలవడిన దశాబ్దాల అలవాట్లు గనుక అంత త్వరగా పోవు. అందుకు సమయం అవసరం. సదరు అలవాట్లను క్రమక్రమంగానైనా పోగొట్టుకుంటున్నారా లేదా అని అందరూ గమనిస్తారు. పోగొట్టుకుంటుంటే సంతోషిస్తారు. లేకుంటే మరొకమారు ఓహో అనుకుంటారు. పైన పేర్కొన్న మొదటి ఓహోకు, ఈ రెండవ ఓహోకు అర్థమేమిటో బహుశా చెప్పనక్కరలేదు. ఈ పదినెలల తర్వాత మాత్రం అందరూ ఈ రెండవ ఓహో అనుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణాలలో రేవంత్‌రెడ్డి, తను అంతవరకు మాట్లాడిన భాష ఉచితమైనది కాదని గ్రహించినందువల్లనే, ఇక పైన తన భాష గురించి అటువంటి విజ్ఞతతో కూడిన మాట చెప్పారు. ఆ భాష ఇకనుంచి ఉపయోగించవద్దని ఆయన తనకు తాను అనుకునే ఉంటారు కూడా. కానీ, విధి బలీయమైనది అన్నట్లు మనుషులకు గత సంస్కృతీ సంస్కారాలు కూడా బలీయమైనవి. వారు జీవితంలో ఏదైనా దశలో గత అవాంఛనీయ సంస్కృతిని వదులుకోవాలని, అది ఇకపై ఫలానా విధంగా ఉండాలని సంకల్పించుకున్నప్పటికీ, పాత కొత్తల మధ్య ఘర్షణ జరుగుతుంటుంది. ఆ ఘర్షణలో క్రమంగా కొత్తదానిది పైచేయి అవుతే ఆ వ్యక్తి సంకల్పం గౌతమ బుద్ధునికి వలెనే బలమైనదని భావించాలి. అది ఆహ్వానించదగిన పరిణామక్రమం అవుతుంది. అందుకు భిన్నంగా ఒకవేళ పాతదానిదే పైచేయి అవుతున్నట్టు కనిపించే పక్షంలో ఆ వ్యక్తి సంకల్పం బలమైనది కాదని స్పష్టమవుతుంది. రేవంత్ రెడ్డి వలెనే. ఒకసారి ఆ విధంగా పాత సంస్కృతే గెలుస్తూ కొత్త సంకల్పమన్నది ఓడటం మొదలైతే, ఇక ఆ వ్యక్తికి నిష్కృతి లభించేది జీవితంలో ఏదో ఒక పెద్ద దెబ్బ తగిలితే మాత్రమే.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే, తన భాషలో మార్పును గురించి ఇచ్చిన మాటను మరిచి చేసిన వ్యాఖ్యలు అనేకం ఉన్నాయి గానీ, వాటిలో ఒకటి ఆయనకు దేశమంతటా పేరును తెచ్చిపెట్టింది. అది, స్వయంగా తన ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి వారిది ‘బీహార్ డీఎన్ఏ’ అని వ్యాఖ్యానించటం. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అది నిముషాలలో ఢిల్లీతో సహా ఉత్తరాదికంతా, దానితో పాటు ఇతర రాష్ర్టాలకు వ్యాపించిపోయింది. అందరూ దిగ్భ్రాంతి చెందారు. రేవంత్ రెడ్డి పేరు అంతవరకు దేశంలో ఎక్కువగా తెలియదు. ఎన్నికలు గెలిచినాక అప్పుడప్పుడే వింటున్నారు. అటువంటిది ఈ వ్యాఖ్యతో ఒక్కసారిగా పేరుతో పాటు ఆయన నోటి తీరు కూడా తెలిసిపోయింది. ఒక మనిషి డీఎన్ఏ గురించిన ప్రస్తావన ఎవరైనా దూషణలో భాగంగా అలవోకగా చేయవచ్చుగానీ, అది చాలా సున్నితమైన ప్రస్తావన. అది విశ్లేషణాత్మకమైనది అయితే వేరే. కానీ, ఒక వర్గాన్ని ఉద్దేశించిన నిందాత్మక ప్రస్తావన. కనుకనే ఆ మాట తీవ్రంగా నొప్పించి దుమారం లేపింది. ఢిల్లీలో కాంగ్రెస్ వారు క్షమాపణాపూర్వకమైన స్వరాలలో సంజాయిషీలు ఇచ్చుకోవలసి వచ్చింది. మరి స్వయంగా ముఖ్యమంత్రి అందుకు క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అన్నట్టయితే గుర్తులేదు.
అట్లా చేయటం సరైనదని కొత్త సంస్కారం చెప్తే, చేయనక్కరలేదని పాత సంస్కారం చెప్పిందేమో తెలియదు. సినిమాల్లో చూస్తుంటాము గదా, హీరో లేదా హీరోయిన్‌కు అద్దంలోని ప్రతిరూపం ఒకటి, తన మనసు మరొకటి చెప్పటం వంటిదన్న మాట. ఆ విధంగా చూడగా ప్రస్తుత సన్నివేశంలో పాత సంస్కృతే గెలిచిందన్నమాట. (ఒకవేళ ఆయన ఉపసంహరించుకొని ఉండి అది నేను గమనించకపోతే, ఈ మాటలు ఉపసంహరించుకున్నట్టు భావించి నన్ను క్షమించగలరు.)
సమస్య ఎక్కడ వస్తున్నదంటే, రేవంత్‌రెడ్డి తన భాషను పది నెలలు గడిచినా మార్చుకొనకపోగా, వీధిలోని సామాన్యుడు సైతం ఈసడిస్తున్నా పైన పేర్కొన్న విధంగా తానిచ్చిన మాటను ఎంతమాత్రం నిలబెట్టుకోకపోగా, నానాటికి మరింత పరుషంగా, అసభ్యంగా మార్చుకుంటున్నారు. అట్లా డెస్పరేషన్‌తో తమ గొంతు చించుకున్నా ప్రజలపై ప్రభావం పడే దశ గడిచిపోయిందన్నది వేరే మాట. ఒకవేళ ఆ తరహా భాష తన ప్రత్యర్థులు ఉపయోగిస్తున్నారని కారణంగా వెదకదలచుకున్నా తను అందుకు భిన్నంగా వ్యవహరించి మంచి సంప్రదాయం నెలకొల్పాలి. అప్పుడు ఒత్తిడి ఎదుటివారిపై పడుతుంది. స్వయంగా తమకు తాముగా, ప్రజాభిప్రాయ రూపంలో కూడా. అప్పుడు ఆయనకు ఔన్నత్యం లభిస్తుంది. కానీ ఇటువంటిదేమీ కన్పించటం లేదు. తను తన నోటి కారణంగా పలచన కావటం ఒకటైతే, వందరోజుల గడువుతో హామీల బాండ్ పేపర్లను ఇంటింటికీ తిరిగి ఇచ్చి కూడా వాటి అమలుపై మాట తప్పటం అందుకు తోడవుతున్నది.
ఆయన తీరు అని పైన అన్నది ఇందుగురించే. తమ ఆరు గ్యారెంటీల పత్రాన్ని ఎవరూ చేతికి తీసుకుని ఒక్కొక్కటిగా లెక్కలు వేసినా, వంద రోజులు కాదు గదా ఈ పది నెలల కాలంలో జరిగిందేమిటో, జరగనిదేమిటో ఎవరైనా చెప్పగలరు. చెప్తున్నారు కూడా. అందుకు సంబంధించి ప్రజల వ్యాఖ్యలకు గాని, ప్రతిపక్షాల విమర్శలకు గాని ప్రభుత్వం వారు చేస్తున్నదేమిటి? రకరకాల బుకాయింపులు. ఈ విషయంలో మేధావులు అనబడేవారు ఏమీ మాట్లాడరని తెలిసిపోయిన ప్రజలకు, ఎందుకు మాట్లాడరో కూడా అర్థమైపోయినందున వారి సంగతి వదలివేద్దాం. ప్రజలు కూడా వదలివేసినట్టున్నారు. మొన్నటి ఎన్నికలపుడు కాంగ్రెస్ ప్రచార రథాలకు జెండాలూపిన ఈ మేధావులు వచ్చే ఎన్నికలకు కూడా జండాలు ఊపేవరకు.
ప్రజలు గ్యారెంటీల గురించి మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు. ఎందువల్ల? అవి అమలుకాకపోవటం వల్ల. అమలుపై ముఖ్యమంత్రి పదే పదే అలవోకగా, నిస్సంకోచంగా నిర్భీతిగా చెప్తున్న అబద్ధాల వల్ల. ఆయన తీరు అంటున్నది ఇది కావటం వల్ల. ఈ తెలుగు నేలపై ముఖ్యమంత్రులను మొదటినుంచి చూస్తూ వచ్చిన వారున్నారు. కానీ, రేవంత్‌రెడ్డి తరహా నోరున్నవారిని గాని, తెల్లవారిలేస్తే చాలు ఇన్నిన్ని అబద్ధాలు ఆడేవారిని గాని అవే అబద్ధాలు మళ్లీ మళ్లీ చెప్పేవారిని గాని చూడలేదు వారు. తనకు పరిపాలనానుభవం లేదు. ఆ మాట ఆయనే ఒప్పుకున్నారు గాని సమస్య అది కానక్కరలేదు. అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రులైన వారు ఇతరులు కూడా ఉన్నారు. అందరికీ వెంటనే గుర్తుకువచ్చేది ఎన్టీఆర్. ఆయన పరిపాలన తీరు ఇట్లా ఎంతమాత్రం లేదే. నోటి విషయం వదిలివేద్దాం. ఇద్దరి నేపథ్యాలు, సంస్కృతులు వేరు గనుక. తనకు పాలనానుభవం లేదని మొదటనే నిజాయితీగా అంగీకరించిన రేవంత్‌రెడ్డి ఒకవేళ అంతే నిజాయితీ చూపుతూ, పరిపాలనను నేర్చుకుంటూ, అందరి సహకారంతో ముందుకు సాగటానికి ప్రయత్నించినట్లయితే, అది కొంతకాలం పాటు నెమ్మదిగా సాగినా ప్రజలు అర్థం చేసుకుని ఓపిక పట్టేవారు, హర్షించేవారు.
కానీ, తను అట్లా చేయకపోగా రోజూ బుకాయింపులు, అబద్ధాలతో అనేక హామీల గురించి అసలేమీ మాట్లాడనైనా మాట్లాడక దాటివేతలతో, రెండురోజులకొక డ్రామాతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలతో, ప్రతిపక్షాలపై నోరు చేసుకోవటంతో కాలం గడుపుతుండటం వల్ల అందుకు గల అవకాశాన్ని ఆయన తనకు తానే ఇన్ని నెలలుగా చెడగొట్టుకుని, ఇప్పటికీ అదే చేస్తున్నారు.
ఇందుకు ఇటీవలి రెండు ఉదాహరణలను చూడండి. ఒకటి, హైడ్రా వ్యవహారం. రెండు, సినీ నటి సమంత, మరికొందరు నటులు, అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు. జల వనరుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళనలు రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి ఉన్న ఆలోచన. అవెంత ముఖ్యమైనవో కొత్తగా మళ్లీ చెప్పనక్కరలేదు. అటువంటి కార్యక్రమంపై ముందుగా మేధోమథనం, అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా సేకరించటం, పూర్తిస్థాయి ప్రణాళికారచన, దాని అమలుకు తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు, అన్నీ ప్రజల ముందు పారదర్శకంగా, ప్రజాస్వామికంగా ఉంచి వారి అభిప్రాయాలు తీసుకోవటం, ఇళ్లు, వ్యాపారాలు, పనులు కోల్పోయేవారికి ప్రత్యామ్నాయాలు, పరిహారాలు, దోషులైన అధికారులూ తదితరులపై చర్యలు, దేనికైనా ముందు మూసీ మురికి శుద్ధి, కాలుష్యాలు రాకుండా ఆపటం, మొదలైనవి అసలేవీ ఎంతమాత్రం లేకుండా, సర్వేలు ఎందుకో ప్రజలకు సమాచారం ఇవ్వకుండా, వివిధ శాఖల మధ్య సమన్వయమన్నదే లేకుండా, అకస్మాత్తుగా ఎర్ర మార్కింగులు, నోటీసులు ఇచ్చి సామాన్లయినా తీసుకునే అవకాశం ఇవ్వకుండా పోలీసులతో బెదిరింపులు, జేసీబీ కూల్చివేతలు, నోటీసులిస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు, శని, ఆదివారాల్లోనైతే కోర్టులుండవు వంటి దుర్మార్గపు ఆలోచనలూ, ఈ తీరునంతా ఏమంటారో ముఖ్యమంత్రే ప్రజలకు నిజాయితీగా చెప్పాలి.
ఈ తరహా హైడ్రా అరాచకం రెండు నెలలకు పైగా సాగినంతకాలం, ప్రజల ఆందోళనను, రోదనను ఎత్తిచూపిన ప్రతిపక్షాలపైనే ఆయన దాడులు సాగించారు తప్ప తన పొరపాట్లను నిజాయితీగా గుర్తించి సరిదిద్దుకోలేదు. లక్షన్నర కోట్లెందుకో చెప్పటం లేదు. కాంగ్రెస్‌లోనే విమర్శలు ఎందుకో గ్రహించటం లేదు. అంతా జరిగిన వెనుక ఇప్పుడు తీరికగా, ఏ ఒక్కరినీ బాధపెట్టం, పునరావాసానికి పూచీ మాది, ప్రతిపక్షాలు సూచనలివ్వాలి, ప్రత్యామ్నాయ ఉపాధికి కమిటీ, పరిహారాలిస్తాం, అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, ప్రజలు సహకరించాలి వగైరా మాటలు మాట్లాడుతున్నారు. ఒక పాలకునికి మొదటనే ఉండవలసిన వివేకమిది. కనీసం ఇప్పటికైనా, ఆయన ఏమి చేయగలరో జాగ్రత్తగా గమనించటం అవసరం. అదేవిధంగా, ధనికులు పేదల మధ్య వివక్ష చూపటాన్ని, ఫొటోల సాక్ష్యంగా బయటపడిన తమ వారి ఫాంహౌజ్‌లను కాపాడటాన్ని, ప్రతిపక్షాలలో సబితా ఇంద్రారెడ్డి కుమారుల వంటి వారికి ఫాం హౌజ్‌లు లేకున్నా ఉన్నాయనే తరహా దబాయింపులను, ప్రతిపక్షాలు తమ భూములూ నిధులూ ఇస్తే నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తామనే హాస్యాస్పదపు వాదనలను ఇప్పటికైనా ఆపివేయగలరేమో కూడా చూడాలి.
విశేషం ఏమంటే, 5వ తేదీన ఇవన్నీ మాట్లాడి తనది సానునయ వైఖరి అని చూపించదలచిన ముఖ్యమంత్రి, 24 గంటలు తిరిగేసరికి 6వ తేదీన అందుకు భిన్నంగా మాట్లాడారు. మూసీ పథకం ఎవరు అడ్డుపడినా ఆగదని, ప్రక్షాళన చేసి తీరుతామని, అక్కడి ప్రజలు మురికిలోనే బతకాలా, వారి పిల్లలు బాగుపడవద్దా అని తన షరామామూలు తరహాలో మరొకమారు విజృంభించారు. అది విని నవ్వు వచ్చిం ది. మూసీని ప్రక్షాళన చేయవద్దని, అక్కడి ప్రజలు, పిల్లల జీవితాలు బాగుపడవద్దని ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరైనా అనలేదు. ఇళ్లూ, వ్యాపార స్థలాలు కోల్పోతున్న బాధితులు సైతం అనటం లేదు.
కానీ, ఆ ప్రక్షాళన ఒక సమగ్ర ప్రణాళిక ప్రకారం సవ్యంగా చేయాలంటున్నారు. అదంతా తెలిసి కూడా వదిలివేస్తున్న రేవంత్ రెడ్డి, తన వైఫల్యాలను దాచి పెట్టేందుకు, ప్రక్షాళనను ఎవరో వ్యతిరేకిస్తున్నారంటూ తనకు తానే విలన్లను సృష్టించుకొని వారిపై నీడల యుద్ధాలు చేస్తున్నారు. ఇది రాజకీయాలలో ఒక ఎత్తుగడే కానీ, దానికి కాలం చెల్లిందని ఆయన గ్రహించాలి. ఈ ధోరణి వల్ల త నకు తానే విలన్ అవుతున్నానని అర్థం చేసుకొని పద్ధతులు మార్చుకోవాలి.
పోతే, విషయం సున్నితమైనది అయినందున ఎక్కువ రాసుకోలేము గానీ, సినిమా కళాకారులపై మంత్రి సురేఖ వ్యాఖ్యల గురించి దేశమంతటా విమర్శలు వెల్లువెత్తినా, స్వయంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆందోళన చెందినా, నోరు విప్పి ఒకమాటైనా అనని రేవంత్‌రెడ్డి తీరు గురించి ఏమనుకోవాలి. తన నోటిదురుసు తనపు సంస్కృతే ఆమెకు ప్రేరణ కలిగించి, ధైర్యాన్ని కూడా ఇచ్చి ఉంటుందని ఎందుకు భావించకూడదు. మొత్తానికి ఈ విధమైన నోరు, తీరులతో ఆయన తెలుగువారి రాజకీయ చరిత్రలో నిలిచిపోయేట్లున్నారు. అందరికీ ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా.
-టంకశాల అశోక్