లోక్‌సభ 18వ ఎన్నికల్లో కేంద్రంలో పాలక కూటమికి నాయకత్వం వహించే బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమికి మొత్తం 543 సీట్లకుగాను 400 దాటిపోతాయని చివరి దశ పోలింగ్ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా చేసిన ప్రకటన మూడు రోజులకే గాలి బుడగలా పేలిపోయింది. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని ఇచ్చిన పిలుపు ఉత్త ఎన్నికల నినాదమేనని మంగళవారం నాటి ఫలితాలు నిరూపించాయి.
అయోధ్యలో రామమందిర నిర్మాణంతో 80కి 80 సీట్లు తన ఖాతాలో వేసుకోవాలన్న బీజేపీ పాచికలు పారలేదు సరికదా వ్యతిరేక ఫలితాలనిచ్చింది. అయోధ్య అంతర్భాగంగా ఉన్న ఫైజాబాద్ స్థానంలోనే బీజేపీ ఓడిపోవడం విశేషం. ఈ అతిపెద్ద రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ 38 సీట్లు కైవసం చేసుకునే దిశగా పయనించడం ప్రధాని నరేంద్రమోదీ ఆశలు, అంచనాలను తారుమారు చేసింది. అలాగే బీజేపీ ‘చార్ సౌ పార్’ స్వప్నం సంగతి అలా ఉంచితే, సాధారణ మెజారిటీ మార్కు అయిన 272 సీట్లకు మోదీ-షా ద్వయం అదుపాజ్ఞలలోని పార్టీని దూరం చేయడానికి తన వంతు పాత్ర పోషించిన మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్.
ప్రధాన ప్రతిపక్షంగా నిలబడే ప్రయత్నం చేసిన ‘ఇండియా’ కూటమికి నాయకత్వం వహిస్తున్నట్టు కనిపించే మరో జాతీయ, మాజీ పాలకపక్షం భారత జాతీయ కాంగ్రెస్ పెద్ద హడావుడి, అంచనాలు లేకుండా ఎన్నికల ముందు రంగప్రవేశం చేసింది. ఈ కూటమి ఏర్పాటు సమయంలో చేసిన హడావుడి తర్వాత నీరుగారిపోవడం, ‘ఇండియా’ అలయన్స్ కన్వీనర్ లేదా మరో నామమాత్ర పదవి ఆశించిన జనతాదళ్ యునైటెడ్ నేత, బీహార్ ఎన్డీయే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తర్వాత బీజేపీతో చేతులు కలపడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర కూటమి పార్టీల దూకుడు తగ్గిపోయింది. దీంతో ‘ఇండీ’ కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ర్టాల్లో సీట్ల సర్దుబాటు కుదరలేదు.
ఫలితంగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి మెజారిటీగాని (272), కనీసం 100 సీట్లుగాని వస్తాయని చెప్పుకునే అవకాశం 81 ఏండ్ల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అత్యంత కీలకమైన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నాయకురాలు సోనియాగాంధీ, ఆమె సంతానం రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రా, ఇతర సీనియర్ నేతలకు లేకుండాపోయింది. పదేండ్ల కిందట 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం ఇదివరకటి 206 నుంచి కేవలం 44 సీట్లకు పడిపోయింది.
ఐదేండ్లు ఎలాంటి పోరాట పటిమ లేకుండా ప్రతిపక్షంలో కొనసాగిన ఈ జాతీయపక్షం 2019 ఎన్నికల్లో తన బలానికి మరో 8 సీట్లు మాత్రమే జతచేసి స్కోరు 52కు పెంచుకోవడం గొప్ప ఘన విజయంగా మారింది. కేవలం హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే మెజారిటీ సీట్లు గెలుచుకున్న కారణంగా కాంగ్రెస్ తన బలం ఈ ఎన్నికల్లో 70-75 ఎంపీ సీట్లు వస్తే చాలనే సింపుల్ టార్గెట్ పెట్టుకుందని కాంగ్రెస్ లోపలి నేతలే మీడియా మిత్రులకు వెల్లడించారు.
సెంచరీకి దగ్గరవడం కాంగ్రెస్‌కు గొప్ప విజయమా?: కిందటి జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 52 సీట్లలో రెండంకెల స్థానాలు (14) ఒక్క కేరళలోనే వచ్చాయి. ఈసారి కర్ణాటకలోని 28 సీట్లలో సగం, తెలంగాణలో ఏడెనిమిది వస్తాయని ఆశించి తన టార్గెట్ 75 మించదనే అంచనాతోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది. అన్నిటికి మించి దేశంలో అత్యధిక ఎంపీ సీట్లున్న పెద్ద హిందీ రాష్ట్రం యూపీలోని 80 సీట్లలో కేవలం 17 స్థానాల్లోనే తన అభ్యర్ధులను నిలబెట్టేలా సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పెట్టుకున్న పొత్తు 7 నియోజవర్గాల్లో గెలుపునకు దోహదం చేసింది.
నెహ్రూ-గాంధీ కుటుంబానికి జోడు కంచుకోటలుగా చెప్పుకునే రాయ్‌బరేలీ, అమేఠీలో పోటీ చేసే విషయంలో కుటుంబ పెద్ద, సిట్టింగ్ ఎంపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకా చివరి నిమిషం వరకూ నిర్ణయం తీసుకోలేకపోవడం విజయావకాశాలపై వారికున్న ఆత్మవిశ్వాసం ఎంతటిదో తేటతెల్లం చేసింది. 2019లో తాను ఓడిపోయిన అమేఠీలో కేంద్రమంత్రి, సినీ నటి స్మృతి ఇరానీతో ఈసారి తలపడటానికి రాహుల్ సాహసించలేదు.
చివరికి అనారోగ్యంతో పార్లమెంటుకు పోటీ చేయడానికి తల్లి ఇష్టపడని రాయ్‌బరేలీ నుంచి ఆయన చివరిరోజు నామినేషన్ వేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి తన గెలుపుపై ఉన్న అంచనాలేమిటో నిరూపించింది. ఎట్టకేలకు హర్యానాలోని పదింటిలో దాదాపు సగం సీట్లు (10కి 5), రాజస్థాన్‌లో మూడో వంతు స్థానాలు (మొత్తం 25కు 8) ఈసారి కాంగ్రెస్‌కు దక్కాయి. అదీగాక, కేరళలో పూర్వంలాగానే రెండంకెల సీట్లు (20కి 14) రావడం. ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో మూడో వంతు సీట్లు (మొత్తం 29లో 9 సీట్లు) హస్తం పార్టీ ఖాతాలో చేరాయి.
1995 వరకూ కాంగ్రెస్ కంచుకోటగా కొనసాగిన మహారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 13 కైవసం చేసుకొని దాన్ని రెండంకెల సీట్లు ఇచ్చిన రాష్ట్రంగా నిలబెట్టుకున్నది. మరో ముఖ్య విషయం ఏమంటే ఆరు నెలల కిందట బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలంగాణలో 8 సీట్లు దక్కడం కూడా కాంగ్రెస్ నిక్కుతూ నీలుగుతూ నూరు సీట్లకు దగ్గరవడానికి కారణమైంది.
‘మూసేవాలా పాట వినలేదా?’: మార్చి 16న ఎన్నికల తేదీలు ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి చివరి దశ ఎన్నికల ప్రచారం వరకూ బీజేపీకి ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని స్థానాలు రాకపోవచ్చు? అనే విషయాల గురించే పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ తదితర సీనియర్ నేతలు మాట్లాడటం విశేషం. బీజేపీకి ఈసారి 250 సీట్లు కూడా రావని ఒకసారి, 200కు మించవని మల్లికార్జున ఖర్గే చెప్పారు. 7వ దశ పోలింగ్‌కు రెండు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి 128 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రకటించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు.
యూపీలో కిందటిసారి ఒకే సీటు, అది కూడా రాయ్‌బరేలీ స్థానాన్ని మాత్రమే (సోనియాగాంధీ) గెలుచుకున్న కాంగ్రెస్ బలం ఈసారి 7 సీట్లకు ఎదగడం సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో పెట్టుకున్న పొత్తు చలవే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆదివారం మీడియా ప్రతినిధులు రాహుల్‌గాంధీని కాంగ్రెస్ పార్టీకి, ‘ఇండియా’ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలని కోరగా ‘సిద్ధూ మూసేవాలే కా సాంగ్ సునా హై ఆప్నే? (295, సిద్ధూ మూసేవాలా పాట 295 వినలేదా?)’ అని వయనాడ్ ఎంపీ జవాబిచ్చారు. అంటే, ఆదివారం వరకూ కాంగ్రెస్ నాయకుల నోట తమకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వస్తాయనే మాట రానే లేదు.
అంచనాలతో హడావుడి సృష్టించిన బీజేపీ: గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన పెద్ద హిందీ రాష్ర్టాలు యూపీ, బీహార్ ఈసారి కాషాయపక్షాన్ని బాగానే దెబ్బదీశాయి. 2019 ఎన్నికల్లో యూపీలో 63 సీట్లు (మిత్రపక్షం అప్నాదళ్‌తో కలిపి) కైవసం చేసుకున్న బీజేపీ 2024లో అక్కడ 32 స్థానాలకే పరిమితం కావడం కోలుకోలేని దెబ్బ. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో 80కి 80 సీట్లు తన ఖాతాలో వేసుకోవాలన్న బీజేపీ పాచికలు పారలేదు సరికదా వ్యతిరేక ఫలితాలనిచ్చింది.
అయోధ్య అంతర్భాగంగా ఉన్న ఫైజాబాద్ స్థానంలోనే బీజేపీ ఓడిపోవడం విశేషం. ఈ అతిపెద్ద రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ 38 సీట్లు కైవసం చేసుకునే దిశగా పయనించడం ప్రధాని నరేంద్రమోదీ ఆశలు, అంచనాలను తారుమారు చేసింది. అలాగే బీజేపీ ‘చార్ సౌ పార్’ స్వప్నం సంగతి అలా ఉంచితే, సాధారణ మెజారిటీ మార్కు అయిన 272 సీట్లకు మోదీ-షా ద్వయం అదుపాజ్ఞలలోని పార్టీని దూరం చేయడానికి తన వంతు పాత్ర పోషించిన మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 29 సీట్లు గెలుచుకోవడంతో బీజేపీ బలం బంగదేశంలో 18 నుంచి 12 లోక్‌సభ స్థానాలకు పడిపోయింది. పొరుగున ఉన్న మరో తూర్పు రాష్ట్రం ఒడిశాలో 2019లో బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలుచుకోగా 2024లో ఈ పార్టీ బలం మొత్తం 21 సీట్లకుగాను అనూహ్యంగా 19కి పెరగడమే గాక తొలిసారి ఆ రాష్ట్రంలో అధికారం దక్కించుకునే స్థాయికి చేరుకున్నది.
రాజకీయ, ఎన్నికల విశ్లేషకుడు, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ ఇటీవల బీజేపీ బలం లోక్‌సభలో 220 సీట్లకు పడిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్తూ తన అంచనాలను వివరించారు. అయితే ఇప్పుడు బీజేపీ సొంతంగా 370 లేదా 303 సరికదా కనీసం 272 దక్కించుకోలేని స్థితికి చేరుకున్నప్పటికీ యోగేంద్ర చెప్పినట్టు మరీ 220 సీట్లకు దిగజారకుండా బీజేపీని ఒక మేరకు ఒడిశా, తెలంగాణ, స్వల్పస్థాయిలో ఏపీ, తమిళనాడు, కేరళ తదితర రాష్ర్టాల్లో వచ్చిన కొద్దిపాటి సీట్లు కాపాడాయి. ఇంక 16, 17 లోక్‌సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా కూడా (మొత్తం 543లో పదో వంతు 55) పొందలేకపోయిన మరో జాతీయపక్షం కాంగ్రెస్ పార్టీని ‘సెంచరీ’కి దగ్గరకు తీసుకెళ్లిన రాష్ర్టాలు కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, యూపీ, హర్యానా అని చెప్పాలి. మొత్తం మీద రెండు ప్రధాన జాతీయపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎక్కడ ఉంచాలో అక్కడ నిలబెట్టిన భారత ఓటర్లు అభినందనీయులు.
నాంచారయ్య మెరుగుమాల