దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా పొందిన స్వాతంత్య్రాన్ని గత 78 ఏండ్లుగా తన ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నది. మరీ ముఖ్యంగా మన ప్రజాస్వామ్య విలువలను నీరుగార్చే రాజ్యాంగ విరుద్ధమైన, చట్ట వ్యతిరేకమైన చర్యలు తెలంగాణలో రేవంత్‌రెడ్డి గద్దెనెక్కాక మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే రెండు వారాల వ్యవధిలోనే రేవంత్ సర్కారుకు సుప్రీంకోర్టు రెండుసార్లు మొట్టికాయలు వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు అందులో మొదటిది కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేయడం రెండోది.
ఉద్యమ సారథి కేసీఆర్ వెన్నంటే ఉంటూ తెలంగాణ సాధనోద్యమంలో సర్వస్వం ధారపోసిన నేను ఎన్నడూ పదవుల కోసం ఆశపడలేదు. కానీ, నా సేవలను గుర్తించిన కేసీఆర్ 2023 జూలై 31న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేశారు. ఒక బడుగుల బిడ్డ ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గవర్నర్ కార్యాలయాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోపరేటివ్ మూవ్మెంట్, సోషల్ సర్వీస్ విభాగాల్లో సేవలందించిన వారిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించవచ్చు. సోషల్ సర్వీస్ విభాగం కింద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నన్ను ఎమ్మెల్సీగా సిఫారసు చేసింది. కానీ, రెండు నెలలకు పైగా క్యాబినెట్ సిఫారసుపై ఎటూ తేల్చకుండా నాన్చిన అప్పటి గవర్నర్ తమిళి సై.. 2023 సెప్టెంబర్ 19న దాన్ని రద్దు చేశారు.
రాజకీయ పార్టీలతో అనుబంధమున్న వ్యక్తులను ఆర్టికల్ 171 (5) ప్రకారం సోషల్ సర్వీస్ విభాగం కింద ఎమ్మెల్సీగా నియమించలేమని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి. గత క్యాబినెట్ సిఫారసు చేసిన మా పేర్లను కొత్తగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకొని, వేరే వారిని సిఫారసు చేస్తుందని తెలిసీ, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 2023 డిసెంబర్ 7న హైకోర్టును ఆశ్రయించాను. ఊహించినట్టుగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మా పేర్లను వెనక్కి తీసుకొని, 2024 జనవరి 13న సోషల్ సర్వీస్ విభాగంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మీడియా విభాగంలో జర్నలిస్టు అమీర్ అలీఖాన్ పేర్లను సిఫారసు చేసింది.
అంతకుముందు రాజకీయ పార్టీతో సంబంధముందని సాకుగా చెబుతూ మా పేర్లను కాదన్న గవర్నర్.. 2024 జనవరి 27న ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న క్యాబినెట్ సిఫారసులను ఆమోదించారు. మా పేర్లను ప్రతిపాదించిన కేసీఆర్ క్యాబినెట్ సిఫారసులను రద్దు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించడం వెనుక రాజకీయం కోణం ఉన్నదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గవర్నర్ ఆమోదం తెలిపిన దరిమిలా 2024 జనవరి 27న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీల నియామకంపై గెజిట్ విడుదల చేసింది. అయితే, 2024 జనవరి 30న అప్పటి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ నియామకాలపై స్టే విధించింది. కేసీఆర్ క్యాబినెట్ సిఫారసులను గవర్నర్ తిరస్కరించిన ఆర్డర్‌ను, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎమ్మెల్సీలుగా నియామకం చేపట్టడాన్ని 2024 మార్చి 7 నాటి తన తీర్పులో హైకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు చేరింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 14న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టంగా పేర్కొంది. కానీ, సుప్రీంకోర్టు స్టేను రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకున్నది.
సుప్రీంకోర్టు స్టేను తప్పుగా అన్వయించుకొని అప్పటికే గవర్నర్ ఆమోదించిన క్యాబినెట్ నిర్ణయం, ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను ముందటవేసుకొని రెండు రోజులకే ఆగస్టు 16న ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించేసింది. తాజాగా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు ఆగస్టు 13న ఈ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. తాము హైకోర్టు తీర్పుపై స్టే మాత్రమే ఇచ్చామని, నియామక ప్రక్రియ కొనసాగించాలని ఎక్కడా చెప్పలేదని న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. తమ పొరపాటు వల్ల వారు అయాచిత లబ్ధి పొందారని కూడా చెప్పడం విశేషం. అయితే, వ్యవస్థల మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో నష్టపోయిందెవరు?
గవర్నర్ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, లేవా? అన్న న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు అదే రాజ్యాంగం కల్పించింది. గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకునే వీలు లేదు. క్యాబినెట్ నిర్ణయాలపై ఏవైనా అనుమానాలుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అందుకు సంజాయిషీ కోరవచ్చు. అంతేతప్ప, క్యాబినెట్ నిర్ణయాలను పూర్తిగా పక్కనపెట్టడం, రద్దు చేయడం లాంటి హక్కులు గవర్నర్‌కు లేవు. ఇది నేను చెబుతున్న విషయం కాదు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. 2016లో అరుణాచల్ ప్రదేశ్‌లో వ్యవస్థల మధ్య ఏర్పడిన సంఘర్షణతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. Nabam rebia vs Deputy speaker కేసు విచారణ సందర్భంగా గవర్నర్ విధుల గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రోద్బలంతో అప్పటి గవర్నర్ తమిళి సై తన కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చేశారు.
2023 జూలై 31న కేసీఆర్ క్యాబినెట్ మా పేర్లను ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిన నాటినుంచి ఇప్పటివరకు రెండేండ్ల విలువైన సమయం వృథా అయ్యింది. రాజ్యాంగం ప్రకారం, చట్టబద్ధంగా మాకు దక్కాల్సిన పదవులు దక్కలేదు. అటు గవర్నర్ తప్పిదం, ఇటు సుప్రీంకోర్టు పొరపాటు కారణంగా ఇతరులు అయాచిత లబ్ధి పొందారు.
నాకు పదవులు ముఖ్యం కాదు. మాజీ ప్రధాని వాజపేయి చెప్పినట్టు ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఈ దేశం, రాజ్యాంగమే శాశ్వతం. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన వ్యవస్థలు, పాలకులే ఇలా వ్యవహరించడం ఎంత వరకు సబబు? నేను మొదటి నుంచీ చెప్తున్నట్టు నా పోరు వ్యక్తులపై కాదు, వ్యవస్థలపై. సెప్టెంబర్ 17న వెలువడనున్న ఈ కేసు తుది తీర్పులో అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఆశిస్తున్నా.
– (వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
డాక్టర్ దాసోజు శ్రవణ్