‘హైడ్రా అంటే భవిష్యత్తుకు భరోసా. హైడ్రాపై లేనిపోని భయాలు పెట్టుకోవద్దు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు అన్యాయం చేయం. పేదల నివాసాలుంటే వాళ్లకు టైం ఇచ్చాకే కూల్చుతున్నాం’ – హైడ్రా కమిషనర్ రంగనాథ్.
కష్టం చేసి.. రూపాయి, రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న ఇండ్లు, అపార్టుమెంట్లను కండ్లముందే ‘హైడ్రా’ కూల్చేస్తుంటే, అసలు భవిష్యత్తు అనేదే లేకుండా పోయిన తర్వాత ఇక భరోసా కల్పించేదెవరికని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేని కట్టడాలుంటే వాటిని కూల్చాల్సిందే. కానీ, ప్రభుత్వ అనుమతులు తీసుకొని పేద, మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న ఇండ్లు, అపార్టుమెంట్లను అకస్మాత్తుగా హైడ్రా పేరుతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసం?
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే దానికి విరుద్ధంగా రాష్ట్రంలోని ప్రజల ఆస్తులను కూల్చుతున్న ది. అసలు తప్పు చేసిందెవరు? ప్రభుత్వం చెప్తున్నట్టుగా సదరు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ తదితర నిషేధిత, ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, వీరితోపాటుగా సదరు స్థలాలకు నిర్మాణ అనుమతులిచ్చిన మున్సిపల్ శాఖల ప్రభుత్వ అధికారులే కదా. మరి తప్పు చేసిన వారిని వదిలేసి, ఎలాంటి తప్పూ చేయని అమాయక ప్రజల ఇండ్లను, అపార్టుమెంట్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ, అమాయక ప్రజలకు శిక్ష విధించడం ఏమిటి? తప్పు చేసిన అధికారులపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సంబంధిత కొంతమంది అధికారుల మీద ఏదో తూతూ మంత్రంగా కేసులు పెట్టారు.
ఇటీవల హైడ్రా కూల్చివేసిన ఒక స్థలం, అందులోని నిర్మాణం 30 ఏండ్ల కిందట సేల్ డీడ్ అయింది. ఆ పత్రాలు సమర్పించాకే ప్రభుత్వం అన్ని అనుమతులిచ్చింది కదా? అసలు ప్రభుత్వం చెప్తున్నట్టు అది నిషేధిత స్థలమే అయితే, దాన్ని సేల్ డీడ్ ఎట్లా చేసినట్టు? ఆ స్థలంగానీ, అందులో కట్టిన నిర్మాణాలుగానీ 30 ఏండ్లలో ఏడెనిమిది మంది చేతులు మారాయనుకుందాం. ఇన్నేండ్లుగా ఆ రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్లపై ప్రభుత్వానికి సదరు ఆస్తి విలువలో కనీసం సగం ఆదాయం స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చినట్టే కదా? ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన ఆస్తి క్రయవిక్రయాల విషయంలో దాని టైటిల్‌ను పరిశీలించే బాధ్యత రిజిస్ట్రార్‌పై అంతగా ఉండదు.
కేవలం సదరు ఆస్తి విలువకు ప్రభుత్వ లెక్కల ప్రకారం స్టాంపు డ్యూటీ వచ్చిందా! లేదా? అని మాత్రమే చూస్తారు. అయితే, ప్రభుత్వ ఆస్తుల క్రయవిక్రయాల విషయంలో సదరు ఆస్తి నిషేధిత జాబితాతో పోల్చుకొని రిజిస్ట్రేషన్లు కాకుండా చూసి, పరిరక్షించాల్సిన బాధ్యత సదరు రిజిస్ట్రారుదే. ప్రభుత్వ స్థలాలను అమ్మకుండా అడ్డుకొని, వాటిని పరిరక్షించాల్సింది కూడా ప్రభుత్వ అధికారులే కదా? అక్రమ లే ఔట్లు అయితే రిజిస్ట్రేషన్లు కావు. సక్రమైనవి మాత్రమే అవుతాయి. మరి సక్రమ లే ఔట్లలోని నిర్మాణాలను కూడా ఎందుకు కూలగొడుతున్నట్టు? వీటన్నింటికీ సమాధానం చెప్పవలసింది ప్రభుత్వమే కదా?
వీటిపై హైడ్రా ఏం చెప్తున్నదంటే.. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులు సస్పెండయ్యారట, రిజిస్ట్రేషన్లూ రద్దయ్యాయట. కానీ, ఆయా వివరాలడిగితే మాత్రం ఏమీ చెప్పరట. ఇదెక్కడి చోద్యం? ఇదేనా ప్రభుత్వ జవాబుదారీతనం? పారదర్శకత ఏమైనట్టు? హైకోర్టు నోటీసులిస్తున్నా హైడ్రా పేరుతో రొడ్డకొట్టుడుగా కొట్టుకుంటూ పోవడమే గానీ, నిరాశ్రయులైన బాధితులకు కనీసం పునరావాసం కల్పించారా, అంటే అదీ లేదు. ఉన్నపళంగా తాము నివసిస్తున్న ఇండ్లు కూల్చివేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు పిల్లాపాపలతో సహా రోడ్డున పడ్డారు. దీంతో గుండె పగిలి చావాల్సిన దుస్థితి ఏర్పడింది.
తప్పు చేసిన అధికారులను స్వేచ్ఛగా వదిలేసి, ఏ తప్పూ చేయని అమాయక ప్రజలను నిర్బంధించి, అభివృద్ధి పేరిట కండ్లెదుటే కూల్చివేతలు సాగిస్తుంటే.. ప్రజా వ్యతిరేకత గాక మరేం వస్తుందో పాలకులకే తెలియాలి. మూసీ రివర్ ఫ్రంట్ అంటున్నారు సరే, ఆ మూసీ పరిరక్షణ కోసం నది పొంగకుండా మూసీని లోతుగా తవ్వించవచ్చు. వరద నీరు రాకుండా పటిష్ఠమైన గోడ కూడా కట్టుకోవచ్చు. డ్రైనేజీ ఇంకా లోతుగా తవ్వి డ్రిల్స్ పెట్టి నీళ్లు పారే ఏర్పాట్లు చేయవచ్చు. అంతేకానీ, నిర్మాణాలను కూల్చుకుంటూ పోవడమే పరిష్కారం కాదు. ప్రభుత్వం పరిష్కార మార్గాలను అన్వేషించాలి కానీ, కష్టపడి కట్టుకున్న పేదల ఇండ్లు కూలగొట్టడం సరికాదు.
గోపాల బాలరాజు
73370 82570