హైదరాబాద్ నగర పర్యావరణ పరిరక్షణకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘హైడ్రా’ రూపంలో తలపెట్టిన ప్రయత్నం సూత్రరీత్యా ఆహ్వానించదగినదే. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంతవరకు స్వయంగా తను చెప్పిన విషయాలనూ, ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పినవాటినీ, హైడ్రా కమిషనర్ చెప్పినవాటినీ, ఆచరణలో జరుగుతున్నవాటినీ, హైకోర్టు వ్యాఖ్యలూ, ఉత్తర్వులనూ గమనించిన మీదట ఇందులో అర్థం కాని విషయాలు అనేకం ముందుకు వస్తున్నాయి. అవి తలెత్తటం మొదలైన తర్వాత కూడా వాటికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లభించటం లేదు. ఆ కారణంగా ప్రజలలో అయోమయాలు, భయాందోళనలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే వాటిని పరిగణనలోకి తీసుకుని అవసరమైన స్పష్టీకరణలు ఇవ్వటంతో పాటు తన కార్యక్రమానికి తగు మార్పుచేర్పులు చేయటం అవసరం.
HYDRAA | ఇందులో అన్నింటికన్న ముందు కొట్టవస్తున్నట్టు కనిపించే విషయం ఒకటున్నది. హైదరాబాద్ వంటి సుదీర్ఘమైన చరిత్ర గల మహానగరంలో ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం సాధారణమైనది కాదు. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ నగర పర్యావరణ, నిర్మాణాలకు సంబంధించి ఐదు రకాల ఉల్లంఘనలు జరిగాయన్నారు. ఒకటి, చెరువులు, సరస్సుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో నిర్మాణాలు. రెండు, వాటి బఫర్ జోన్లో నిర్మాణాలు. మూడు, నాలాలను, పార్కులను ఆక్రమించి నిర్మాణాలు. నాలుగు, ప్రైవేటుగా పట్టాలున్నప్పటికీ అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలు. అయిదు, ప్రభుత్వ భూములలో అనుమతులు లేకుండా చేసినవి. వీటిలో ప్రస్తుతానికి మొదటి మూడింటిపై దృష్టి పెడుతున్నామని అన్నారాయన. అదేవిధంగా హైడ్రా ప్రస్తుత పరిధి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకని చెప్పారు. ఈ పరిరక్షణలు జరగనందువల్ల కలుగుతూ వస్తున్న రకరకాల నష్టాలు ఏమిటో, అభివృద్ధి రీత్యా మునుముందు కలగగల నష్టాలు ఏమిటో వివరించారు. అందువల్ల నగర వర్తమానం కోసం, భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తప్పవని ప్రకటించారు.
ఆ విధంగా ఇది సాధారణ కార్యక్రమం కాదు. బృహత్తరమైనది. అటువంటపుడు దాని అమలుకు రూపొందించే ప్రణాళిక కూడా బృహత్తరంగా ఉండాలి. అందుకు సంబంధించిన సమస్త కోణాల గురించి ముందుగానే ఆలోచించి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. వాటి మంచి చెడులు, పరిధులు, అమలు కోసం ముసాయిదా ప్రణాళికలు, ఎదురవగల చిక్కులను పరిశీలిస్తూ, అందుకు పరిష్కారాలపై ఒకవైపు అధికారుల స్థా యిలో, మరొకవైపు బయటి నిపుణులు, అనుభవజ్ఞుల స్థాయిలో విస్తృతంగా సంప్రదింపులు జరపాలి. అప్పుడు కార్యాచరణకు ఒక నిర్దిష్టమైన, స మగ్రమైన రూపం ఇచ్చి ఆచరణకు పూనుకోవాలి. అంతచేసినా కొన్ని లోటుపాట్లు, సమస్యలు ఎదురుకావచ్చు గాక. అది ఏ విషయంలోనైనా ఉండేదే. కానీ, ఇటువంటి మహానగరం ఎదుర్కొంటున్న ఇంతటి బృహత్తర సమస్య విషయం లో ముందుగా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. అటువంటి ప్రణాళికాబద్ధత లేనట్లయితే దానికి అరాచక లక్షణాలు వస్తాయి.
హైడ్రాకు సంబంధించి గత కొద్ది వారాల మాటలను, చేతలను కూడా గమనించినపుడు దురదృష్టవశాత్తు కలుగుతున్న అభిప్రాయం అటువంటిదేమీ జరగలేదని. ఎటువంటి ముందస్తు మేధోమథనం జరగలేదని. అంతా హడావుడి, అట్టహాసం, సంచలనం. ఒకవైపు క్షేత్రస్థాయిలో కనిపించేది ఇది కాగా, మరొకవైపు పరిపాలనాపరమైన స్థాయిలో కనిపిస్తున్నది అస్పష్టతలు, అయోమయాలు, ప్రశ్నలకు జవాబులేని తనాలు. బయటనే కాదు, కోర్టుల ముందు కూడా. ఇవన్నీ చాలవన్నట్లు ద్వంద్వ ప్రమాణాలు. హైడ్రా దారి హైడ్రాది కాగా, జీహెచ్ఎంసీ నుంచి మున్సిపాలిటీల వరకు వాటి తీరు వాటిది. తమ విషయం చెప్పుకునేందుకు పెద్దవాళ్లకు ఏవో, ఎవరో కనిపిస్తుండగా, అర్ధరాత్రి ఇళ్లపైకి జేసీబీలు దూసుకొస్తున్న సామాన్యులకు, పేదలకు, వికలాంగులకు తమ గోడు ఎక్కడ చెప్పుకోవాలో తెలియని స్థితి.
ఒక ఉద్దేశం నిజంగా మంచిది అయి, పద్ధతి ప్రకారం ఆచరణ ఉన్నట్టయితే ఇటువంటి గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయా? ఈ తరహా పరిస్థితులు తలెత్తగూడదని, అందుకు ప్రణాళిక సవ్యంగా ఉండాలనేది ప్రభుత్వానికి తెలియని విషయమా? ఇటువంటి కార్యక్రమాల విషయంలో ముందుగానే చేయవలసిందేమిటి? ఓఆర్ఆర్ పరిధిలో గల చెరువులు, సరస్సులు ఏమిటి? వాటి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ఏమిటి? వాటిని తుది రూపంలో ఎప్పుడు నోటిఫై చేశారు? వాటి హద్దులను గుర్తించే రాళ్లు, కంచెలు నేలపై ఉన్నాయా? ఉంటే ఎక్కడ? వీటన్నింటి మ్యాపులు, ఉపగ్రహ చిత్రాల కాపీలు ఉన్నాయా? వీటిలో ఎక్కడెక్కడ ఏ మేరకు ఆక్రమణలు జరిగాయి? ఎపుడు జరిగాయి? అందుకు వ్యక్తులు గాని, అధికారులు గాని ఎవరెవరు బాధ్యులు? ఆక్రమిత స్థలాలలో ప్రస్తుతం ఏమున్నాయి? నిర్మాణాలుంటే వాటికి అనుమతులివ్వటం, కరెంట్, నీళ్లు, డోర్ నంబర్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి వసతుల కల్పన ఎట్లా జరిగింది? అందుకు ఫీజుల వసూలు ఎట్లా చేస్తున్నారు? మొదలైన వివరాలన్నీ ముందుగానే పూర్తిగా సేకరించాలి. పూర్తి పారదర్శకత ఉండాలి. ఎవరైనా సమాచార హక్కు కింద అడిగితే వివరాలిచ్చే ప్రజాస్వామికత కూడా ఉండాలి.
చర్యల దశ ఆ తర్వాత వస్తుంది. ముందుగా ఉల్లంఘనదారులకు నోటీసులివ్వాలి. అదే సమయంలో దోషులైన అధికారులకు, బిల్డర్లకు, ఇతర కాంట్రాక్టర్లకు కూడా నోటీసులివ్వాలి. చెరువులు, సరస్సుల విషయంలో అనుసరించే ఈ క్రమాన్ని నాలాలు, పార్కుల విషయంలోనూ అనుసరించాలి. ప్రభుత్వాలే ఏవో పథకాల కింద పట్టాలు ఇచ్చిన సందర్భాలలో, అధికారుల అనుమతితో ఉల్లంఘనలు జరిగిన సందర్భాలలో, ముఖ్యంగా అది కొన్నేండ్ల కాలంగా ఉన్నపుడు, ఇంతకాలం ఫీజులు సైతం వసూలు చేస్తున్నందున, ప్రభుత్వం తరఫున ‘పాప పరిహారం’ అనుకుని, సదరు వ్యక్తులు అక్కడినుంచి ఖాళీ చేసేందుకు తగిన సమయం ఇవ్వాలి.
ప్రభుత్వ దోషాలను అంగీకరిస్తూ వారికి నష్ట పరిహారమిచ్చి తర్వాత బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసుకోవాలి. బాధితులు పేదవారైతే వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం చూపాలి. మరీ పేదలైతే ఇళ్లు కట్టివ్వాలి. ముఖ్యమంత్రి పేర్కొన్న అయిదు ఉల్లంఘనలలో ప్రస్తుతం మొదటి మూడింటిపై దృష్టిపెడుతున్నట్లు ఆయనే ప్రకటించినందున, మనం కూడా ప్రస్తుతం అందుకు పరిమితమై ఇదంతా చెప్పుకుంటున్నాము.
కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి? ఇక్కడే వస్తున్నది అసలు సమస్య. ఇంతవరకు మన దృష్టికి వచ్చినవి ఈ కిందివిధంగా ఉన్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో గల చెరువులు, సరస్సులు, నాలాలు, పార్కుల జాబితాలైతే ఉన్నాయి. కానీ అన్నింటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ల చిత్రాలు, హద్దురాళ్లు, పార్కుల ప్రహరీలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేనే లేదు. చర్యలు మొదలైన తర్వాత ఇపుడు సేకరిస్తున్నారు. ఉల్లంఘనలు చేసినవారి సమాచారం లేదు. ఈ సర్వేలు ఇపుడు జరుపుతున్నారు. రికార్డులు ఇపుడు చూస్తున్నారు. వారికి అనుమతులిచ్చినవారు, ఫీజులు వసూలు చేసినవారి గురించి తెలిసింది సముద్రంలో నీటిబొట్టంత. ఎవరు నిర్మాణాలు చేసి అమ్మారో, ఎవరు కొనుగోలుదారులో, జరిగిన మారుబేరాలు ఏమిటో తెలియదు. పేదలకు పట్టాలు ఇచ్చింది ఏ ప్రభుత్వాలో, ఎంతకాలం క్రితమో, తిరిగి అవి ఏమైనా చేతులు మారాయో, కుటుంబసభ్యుల మధ్య పంపకాలు జరిగాయో అసలేమీ తెలిసినట్లు లేదు. వారిని అడగటం, షోకాజ్ నోటీసులివ్వటం, చట్టపరమైన విషయాల విచారణ ఏమీ లేదు. అనగా, అసలు రెగ్యులర్ పరిపాలన అన్నది ఇంత అధ్వాన్నంగా సాగుతున్నదన్న మాట. అందుకు నగర పర్యావరణం, ప్రజలు ఇంతకాలం ఒక విధంగా బలి కాగా, ఇపుడు మరొకవిధంగా బలి కావాలా?
ఇది ఒకటైతే, ఉల్లంఘనదారులకు ముందుగా నోటీసులిచ్చి, వారి వివరణ చూసిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత సందర్భంలోనూ హైకోర్టు మొదటిరోజునే ఆ మాట చెప్పింది. కానీ, అధికారులు సంచలనం కోసమా అనిపించేట్లు ఇదేమీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో కేవలం ఒకటిరెండు గంటల నోటీసుతో. అది కూడా అర్ధరాత్రి. అదికూడా పేదలపై. కోర్టులు స్వయంగా జోక్యం చేసుకొని, ముందుగా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించి, ఇవ్వకుండా ఎట్లా చర్యలు తీసుకుంటారని నిలదీసి, కూల్చివేత నోటీసులను తామే షోకాజ్ నోటీసులుగా మార్చితే తప్ప పరిస్థితి దారికి రాలేదు.
అపుడు గాని అధికారుల అనాలోచితమైన దూకుడుతనం మనకు తెలియలేదు. ఇందులో మరికొన్ని విచిత్రాలున్నాయి. పైన చెప్పుకున్న తరహా సమాచారాలను ప్రభుత్వం సేకరించిందా అన్న ప్రశ్నకు, ఆ పని ఇప్పుడు చేస్తున్నామంటున్నారు. నోటీసులు ఇచ్చారా అంటే, ఒకసారి ఇకనుంచి ఇస్తామని, మరొకసారి ఏదో తీర్పు ప్రకారం అట్లా ఇవ్వనక్కరలేదని చెప్తున్నారు. మరోసారి అయితే, ఉల్లంఘనదారులు కోర్టు నుంచి స్టే తెచ్చేలోగానే కూలుస్తామని ప్రకటిస్తున్నారు. ఒక చట్టబద్ధ వ్యవస్థలో కోర్టు నుంచి రక్షణ పొందటం పౌరుల హక్కని వారికి తెలియదా? వారట్లా మాట్లాడవచ్చునా? అది చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం కాదా? ఇట్లా చెప్పుకునేందుకు ఇంకా ఉన్నాయి. కానీ, ఇంతవరకు గమనించినా, ప్రభుత్వ కార్య ప్రణాళికను లోపభూయిష్ఠంగా హడావుడిగా కాకుండా, సక్రమంగా రూపొందించి అమలుపరచవలసిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. లేనట్లయితే, పైకి చెప్తున్నది ఒకటి కాగా మరేవో ఉద్దేశాలతో ఈ పనిచేస్తున్నారనే అనుమానాలు బలపడతాయి. అటువంటి అనుమానాలు ఇప్పటికే మొదలయ్యాయి కూడా.
పోతే, ఇందులో గమనించవలసినవి మరికొన్ని ఉన్నాయి. ఉల్లంఘనలను గుర్తించేందుకు ప్రభుత్వం సాధారణంగా కటాఫ్ తేదీని నిర్ణయిస్తుంది. అనగా ఎంతకాలం వెనుకకుపోయి ఇందుకు ఒక గడువును తీసుకుంటారన్నది. నగరంలో చెరువులు, సరస్సులు, నాలాలు నిజాం కాలం నుంచి ఉన్నాయి. వేటి ఉల్లంఘనలు ఎప్పటినుంచి జరుగుతున్నాయో ఉపగ్రహ చిత్రాలలో తేలుతుందేమో తెలియదు. ఉపగ్రహాలు వాడుకలోకి రానప్పటి సంగతేమిటో తెలియదు. మ్యాపులు ఏమున్నాయో తెలియదు. మొత్తానికి అట్లా ఎంత వెనుకకుపోతారు? నిజాం కాలమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశా? తెలంగాణ రాష్ట్రమా? ప్రభుత్వం ఇంతవరకు ఏమీ ప్రకటించలేదు. ఇదొక ముఖ్యమైన సమస్య కాగా, కూల్చివేతలకు గురయ్యే నిర్మాణాలలో వేర్వేరు రకరకాలవి ఉంటాయి. ఒకటి, ఉన్నతవర్గాల నివాసాలు. రెండు, మధ్యతరగతి వారి నివాసాలు. మూడు, దిగువ మధ్యతరగతి నివాసాలు. నాలుగు, పేదల నివాసాలు. అయిదు, వ్యాపార సంబంధమైనవి. ఆరు, విద్యాసంస్థలు, వైద్య సంస్థల వంటి ప్రజోపయోగ సంస్థలు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో కొన్ని ప్రభుత్వ నిర్మాణాలు కూడా వస్తాయనే అంచనాలు ఉన్నందున అవి ఏడవ కేటగిరీ అవుతాయి. వీటన్నింటిని గురించి ప్రభుత్వం ఆలోచించిందా లేదా తెలియదు. ఒకవేళ ఆలోచిస్తే ఆ విషయాలు రహస్యంగా ఉంచటం గాక ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలి. ఒకవేళ ఆలోచించి ఉండకపోతే ఆ మాట ఇప్పటికైనా బయటకు ఒప్పుకొని, ఇక నుంచి ఆ పని చేస్తామనాలి.
ఇది చాలా సీరియస్ విషయం అయినందున ప్రభుత్వం మరొక పని చేయటం కూడా అవసరం. మొత్తం చెరువులు, సరస్సులు, నాలాల ఎఫ్టీఎల్ ప్రాంతాలు, బఫర్‌జోన్ ప్రాంతాలు అన్నింటిలోని అన్ని ఆక్రమణలు కలిపి ఎన్నో, అవి ఏ తరహావో పూర్తి లెక్కలు తీసి ప్రకటించాలి. వాటిని వేలకు వేలుగా కూల్చివేయటం వల్ల కలిగే ఆర్థిక నష్టం ఎన్ని లక్షల కోట్లలో ఉంటుందో అంచనా వేయాలి. నష్టం ఏ వర్గానికి ఎంత, ప్రభుత్వానికి ఎంత అనేది లెక్కల విశ్లేషణలో తేలుతుంది. నష్టం ప్రజలది అయినా, ప్రభుత్వానిదైనా అంతిమ విశ్లేషణలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థది అవుతుందని గుర్తించాలి. ఇవి నష్టం లెక్కలు కాగా, తర్వాత పునర్నిర్మాణాలు ఏ విధంగా? ఎవరెక్కడ? సంస్థల మాటేమిటి? అందుకు నగరంలో గాని, మరొక చోట గాని ఏ విధంగా? ప్రభుత్వం ఒక ప్రభుత్వంగా ఏమైనా ఆలోచించి ప్రణాళికలేమైనా వేస్తుందా, లేక తన బాధ్యతేమీ లేదు, ఎవరిష్టం వారిదంటుందా? ఒక ప్రభుత్వం ఒకవేళ అట్లా చేతులు ఎత్తి వేస్తే, అది బాధ్యతాయుతమైన వ్యవహరణ కాగలదా? లేక వారందరిని ముఖ్యమంత్రి పెట్ ప్రాజెక్ట్ అయిన ఓఆర్ఆర్ – ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతానికి, ఫోర్త్ సిటీకి తరలిపోక తప్పని పరిస్థితిని సృష్టించే ఆలోచన ఉందా? అన్నవి కొన్ని సందేహాలు.
ఉరుము లేని పిడుగు వలె, అకస్మాత్తుగా, అస్తవ్యస్తమైన రీతిలో, ఒక ప్రణాళికాబద్ధత లేని రీతిలో తెరపైకి వచ్చి, లేడికి లేచిందే పరుగన్న రీతిలో సాగుతున్న ఈ కూల్చివేతల పథకం రహస్యోద్దేశం అదే కాదు గదా అన్నది మరొక సందేహం. ఒకవేళ అట్లా వీరంతా తరలిపోవాలన్నదే ఆలోచన అయితే అది జరిగేందుకు ఎంతకాలం పడుతుంది? అదొక కొత్త నగర నిర్మాణం వంటిది గదా.
పోతే, ఈ క్రమం అంతటిలో వివిధ వర్గాల ప్రజలపై, వ్యాపారాలపై, వ్యవస్థలపై, అంతిమ విశ్లేషణలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై పడగల ప్రభావాల గురించి, అదేవిధంగా ఈ అస్తవ్యస్తతల వల్ల ఏర్పడగల అస్థిరతలతో ఒకవేళ ఏవైనా ఒడిదుడుకులు, రాష్ట్ర ప్రతిష్ఠ పట్ల బయటివారికి సందేహాలు కలిగే అవకాశం ఉంటే అవీ, వీటన్నింటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించటం అవసరం. అటువంటి మేధోమథనాలు ఇప్పటికే ఏమైనా చేశారేమో తెలియదు. పని జరుగుతున్న తీరుతెన్నులను చూడగా, అటువంటిదేమీ జరిగినట్లు మాత్రం కన్పించటం లేదు.