స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అనేక త్యాగాలు చేసింది. నాటి పాలకుల కుట్రలకు ఎదురొడ్డి పోరాడింది. ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఛేదించింది. వీటిన్నింటికీ మించి పదవులను తృణప్రాయంగా వదులుకున్నది. తెలంగాణవాదం లేదన్న ప్రతి సమయంలోనూ పదవులను త్యాగం చేసి ప్రజల్లోకి వెళ్లి, తన సత్తా ఏమిటో చూపించింది. నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు, ప్రదర్శించిన రాజకీయ చతురత వల్ల స్వరాష్ట్రం సిద్ధించింది. నిజంగా టీఆర్ఎస్ లేకపోయినా.. దానికి కేసీఆర్ నాయకత్వం వహించకపోయినా తెలంగాణ వచ్చేది కాదన్నది ముమ్మాటికీ నిజం.
ఏ ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్రం సాధించారో.. అదే స్ఫూర్తితో తెలంగాణను కేవలం తొమ్మిదేండ్లలో దేశానికి ఆదర్శంగా నిలిపి చూపుతున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలిసిన రైతు బిడ్డ కావడం, అందులోనూ తెలంగాణ పరిస్థితులను అణువణువు ఆకళింపు చేసుకున్న వ్యక్తి కాబట్టి.. ఒక్కో సమస్యను అధిగమిస్తూ నేడు దేశం ముంగిట ప్రతి రంగలోనూ తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలిపి చూపారు.
2001లో ఉద్యమగడ్డ కరీంనగర్‌పై ఆవిర్భవించిన టీఆర్ఎస్, ఈ నెల 27తో 23వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నది. ఈ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా మినీ ప్లీనరీలను బీఆర్ఎస్ నిర్వహిస్తున్నది. ఒక్కో నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి కనీసం 3 వేలకు తగ్గకుం డా శ్రేణులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నాటి ఉద్యమం.. పదవులు త్యా గం చేసిన బీఆర్ఎస్ వంటి అంశాలను ఒకసారి మననం చేసుకోవడమేకాదు, నేటి యు వతకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.
ఆంధ్రాలో తెలంగాణ బలవంతపు విలీనం తర్వాత జరిగిన అన్యాయంపై తెలంగాణ గడ్డ పై పలు పోరాటాలు జరిగాయి. కానీ, నాయకత్వం సరిగా లేక, తెగించి కొట్లాడే ధైర్యం చేయక, ప్రజల ఆశయసాధనకు కాకుండా.. స్వప్రయోజనాల కోసం పాకులాడిన నాయకుల వల్ల ఆ ఉద్యమాలు గమ్యాన్ని ముద్దాడ లేకపోయాయి. 1969 ఉద్యమం తర్వాత నాటి పాలకులను ఎదురించేవారు లేరు. ఇక తెలంగాణ రాష్ట్రం అవతరించదని ప్రజలు నిరాశ చెందుతున్న సమయంలో ‘ప్రత్యేక’ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చే లక్ష్యంతో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. అలా ఒక్క నాయకుడితో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ తదుపరి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఒక్కతాటికిపైకి తెచ్చింది. సబ్బండ వర్గాలను ఒక్కటి చేసి కదనరంగంలోకి దింపిన ఘనత కేసీర్దే. ప్రజల ఆకాంక్ష, రాష్ట్ర సాధన కోసం తన గమ్యాన్ని చేరుకునేందుకు దేశ చరిత్రలోనే ఎక్కువసార్లు పదవులను వదులుకున్న పార్టీగా రికార్డు సృష్టించి, చివరికి తెలంగాణను సాధించిన ఘనతను టీఆర్ఎస్ దక్కించుకున్నది.
పార్టీ ఆరంభమే కేసీఆర్ రాజీనామాతో మొదలైంది. అప్పటికే సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2001 ఏప్రిల్ 27న టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్కు అంకురార్పరణ చేశారు. పదవులు కాదు ముఖ్యం, ప్రజల ఆశయ సాధనే తన లక్ష్యం అన్న ముచ్చటను పార్టీ ఆరంభం రోజే కేసీఆర్ తేల్చిచెప్పారు. 2001 మే 17న తెలంగాణ సింహగర్జనసభతో ఆరంభమైన రాజకీయ ప్రస్థానం ఆ తదుపరి ఒక్కోదశను చేరుతూ వచ్చింది. 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్ను రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ క్రమంలో 2001 సెప్టెంబర్ 22న జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుంచి శాసనసభ్యుడిగా తిరిగి కేసీఆర్ ఎన్నికయ్యారు.
2003 జనవరి 6న పరేడ్ మైదానంలో తెలంగాణ గర్జన పేరిట నిర్వహించిన సభ ఒక ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటువాదాన్ని ఢిల్లీకి వినిపించేందుకు 2003 మార్చి 27న కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి కారు ర్యాలీ తీసి నాటి పాలకులను ఆలోచింపజేశారు. నాటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి ఎన్నికల్లో పోటీచేసి 2004 మేలో కేంద్ర మంత్రివర్గంలో చేరారు. రాష్ట్రంలోనూ 2004 జూన్ 23న పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. 2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూనే.. తన ఆశయ సాధన కోసం కేసీఆర్ పనిచేస్తూ వచ్చారు. అందుకోసం జాతీయ స్థాయి లో తన రాజకీయ చతురతను ప్రదర్శించి అదే ఏడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేసిన ఘనత కేసీఆర్‌ది. 2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కేసీఆర్ విజయమే. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ మంచి హోదా గల పదవుల్లో ఉన్నా.. తెలంగాణపై నాటి ప్రభుత్వం చూపిన వివక్షను నిరసిస్తూ.. మొదటిసారిగా కేసీఆర్ 2006 ఆగస్టు 22 కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. అక్కడితో ఆగకుండా 2006 సెప్టెంబర్ 12న కరీంనగర్ లోక్‌సభకు రాజీనామా చేశారు. దానికి ముందుగానే 2005 జూలై 3న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసగా టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు రాష్ట్ర మంత్రులు తమ పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టారు.
తెలంగాణ వాదం లేదంటూ నాటి పాలకులు ఎగతాళి చేస్తే ఆ విషయాన్ని ప్రజల్లోనే తెల్చుకుందామంటూ సవాలు విసిరిన కేసీఆర్, తానుచేసిన రాజీనామా మేరకు 2006 లో కరీంనగర్ లోకసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ వాదం లేదని చెప్పడానికి, కేసీఆర్‌ను ఓడించడానికి నాటి కాంగ్రెస్ ప్రభు త్వం మంత్రులను, యావత్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. కానీ, ప్రజలు తెలంగాణ దెబ్బను రుచిచూపించారు. కేసీఆర్‌కు రెండు లక్షల పైచిలుకుపైగా మెజారిటీ ఇచ్చి పట్టం గట్టారు. తెలంగాణవాదం ఉన్నదని, స్వరాష్ట్ర సాధన కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందన్న సంకేతాన్ని తెలంగాణ సమాజం ఆనాడే ఇచ్చిం ది. ఇక్కడ ఆలోచించాల్సిన ప్రధాన అంశం ఏమంటే.. నాడు కేంద్ర మంత్రి పదవికే కాదు, ఏకంగా లోకసభకు రాజీనామా చేయకపోతే ఎన్నికలు వచ్చేవి కావు. తెలంగాణ వాదం ప్రజ ల్లో బలంగా ఉన్నదని చెప్పే సందర్భం మనకు దక్కకుండా పోయేది. ‘పదవులు తనకు ముఖ్యం కాదు, తెలంగా ణ రాష్ట్రమే ముఖ్యం. స్వరాష్ర్టాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.’ అని చెప్పడానికి బలమైన వేదికగా 2006 కరీంనగర్ లోకసభ ఎన్నికలను కేసీఆర్ కేంద్రం ముందుకు తెచ్చి పెట్టడంలో విజ యం సాధించారు. నాటి పాలకుల కుట్రలు అక్కడితో ఆగలేదు. అందుకే అనేకసార్లు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సి వచ్చింది.
ప్రజల ఆశయ సాధనే ఏకైక లక్ష్యంగా 2008 మార్చి 3న కేసీఆర్‌తోపాటు నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు. అలాగే 2008 మార్చి 4న 16 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. అయినా సర్కారు దిగి రాకపోవడంతో తన ప్రాణాన్ని పణంగా పెట్టేందుకు నాడు కేసీఆర్ సిద్ధపడ్డారు.
ఆ మేరకు 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయల్దేరుతున్న సమయంలో నాటి సీమాంధ్ర సర్కారు కుట్రపూరితంగా కరీంనగర్ శివారులోని అల్గునూర్ వద్ద అరెస్ట్ చేసి, ఖమ్మం తరలించింది. అయినా అకుం ఠిత దీక్షతో కేసీఆర్ తన దీక్షను కొనసాగించారు. కేసీఆర్ అరె స్టును నిరసిస్తూ యావత్ తెలంగాణ ప్రజలు కుల, మత, వర్గాలకతీతంగా రోడ్డెక్కారు. ‘మా తెలంగాణ మాగ్గావాలె’ అంటూ ప్రపంచంలో కనీవినీ ఎరగని రీతిలో ఉద్యమించారు. ఆ మేరకు 2009 డిసెంబర్ 9న ‘ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నాం’ అంటూ కేంద్రం ప్రకటించింది. ఆ తదుపరి మాట మార్చడం తో టీఆర్ఎస్ మరోసారి పదవులను త్యాగం చేసింది. 2010 ఫిబ్రవరి 10న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. అలాగే జేఏసీ పిలుపు మేరకు 2011 జూలై 4న 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. అనేకసార్లు రాజీనామాలు చేసి పదవులను తృణప్రాయంగా వదలివేసిన ఘనత టీఆర్ఎస్కు దక్కుతుంది. నిజానికి ఒక రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ చేసిన పదవుల త్యాగాలు దేశచరిత్రలో ఎవరూ చేయలేదు. భవిష్యత్‌లోనూ చేసే పరిస్థితి లేదు. ఇన్ని త్యాగాలు చేసిన టీఆర్ఎస్ చరిత్ర నేటి యువతరానికి చాలా మందికి తెలియదన్నది నగ్నసత్యం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్నది ఓ చరిత్ర. అది తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతకు అవసరం. నిజానికి తెలంగాణ ఏర్పాటును లోతుగా చూస్తే ప్రజలను కలుపుకొని టీఆర్ఎస్ పోరాడిందే తప్ప ఏ పార్టీ సహకరించలేదు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలే అయినా నాడు ద్వంద్వవైఖరిని అసుసరించాయి. ఎక్కడ దొరికితే అక్కడ తెలంగాణ ఏర్పాటుకు అడ్డు పుల్లలు వేసే ప్రయత్నాలే చేశాయి. అందుకే 2001 నుంచి 2014 కాలంలో పలుసార్లు టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ కోసం తన పదవులకు రాజీనామా చేయలేదు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోనూ రాష్ట్ర సాధనకు ఉద్యమాలు జరిగాయి. కానీ, ఆ తదుపరి వారు పాలకులుగా వైఫల్యం చెందారు. తెలంగాణ మాత్రం అందుకు భిన్నం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 41 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, 17 ఏండ్లు పాలించిన టీడీపీలు చేయలేని పనులు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు చేస్తున్నారనే అంశంపై లోతైన ఆలోచన చేయాలి.
బీఆర్ఎస్ కార్యకర్తలు తలెత్తుకొని పల్లెల్లో చర్చపెట్టాలి. సగర్వంగా సమాధానం చెప్పాలి. నాటికీ నేటికీ తేడాను వివరిస్తూ కండ్ల ముందు కనిపిస్తున్న ఫలాలను చూపించే సత్తాను సంతరించుకుంటే చాలు. పాలు ఏవో నీళ్లు ఏవో ప్రజలే తేల్చుకుంటా రు. కేవలం తొమ్మిదేండ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేని పని చేసి, వాటి ఫలాలను తెలంగాణ ప్రజలకు పంచుతున్న కేసీఆర్.. ఇదే తోవలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారన్న బలమైన నమ్మకం దేశవ్యాప్తంగా ఏర్పడుతున్నది. రాజకీయ విజ్ఞతతో ప్రస్తుతం కేసీఆర్‌ను ఢీకొనే శక్తి ఎవరికీ లేదన్నది స్పష్టం. అందుకే నేటి తెలంగాణ విజయాలే దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి. కేసీఆర్ సారథ్యంలో దేశం సాధించే విజయాలే ప్రపంచానికి సరికొత్త తోవను చూపుతాయి.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రతినిధి, కరీంనగర్ )
కడపత్రి ప్రకాశ్‌రావు
80966 77022