తెలంగాణ జాతి చైతన్యానికి, చేతనకు నిలువెత్తు ప్రతీక కేటీఆర్. పసికూన తెలంగాణని ఈ మూడక్షరాలు ప్రగతిపథాన నడిపించాయి, అభివృద్ధికి చిరునామాలా నిలిపాయి. మహానాయకుడు, తెలంగాణలో స్వరాష్ట్ర కాంక్షని రగిలించి సాధించిన ఉద్యమ ధీరుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన ఆశయాన్ని, ఆలోచనను సమర్థవంతంగా ఆచరణలో పెట్టగల ధీశాలి, తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్.
సిద్దిపేటలో 1976 జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులకు తొలి సంతానంగా కేటీఆర్ జన్మించారు. కరీంనగర్లో తన అక్షరయానాన్ని మెదలుపెట్టిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో పూర్తి చేసుకున్నారు. 1991లో ఎస్సెస్సీ పూర్తయిన అనంతరం విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ ముగించి డాక్టర్ చదువు కోసం తల్లిదండ్రులను వదిలి కర్ణాటకకు వెళ్లడం ఇష్టం లేక నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం పుణెలో బయోటెక్నాలజీ పీజీ, 2000లో న్యూయార్క్‌లోని సిటీ వర్సిటీలో ఎంబీఏ పూర్తిచేశారు. ఆ వెంటనే తన ప్రజ్ఞాపాటవాలతో అమెరికాలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉన్నతమైన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
ఐదంకెల జీతం, లగ్జరీ లైఫ్, ప్లాన్డ్ ఫ్యూచర్ ఇంకెవరైనా అయితే ఈ సౌకర్యాలను వదిలి రావాలనే ఆలోచన చేసేవారు కాదేమో. కానీ, కేటీఆర్ నరనరాల్లో ప్రవహిస్తున్నది పోరాట వీరుడు కేసీఆర్ రక్తం. తండ్రి నుంచి అలవడిన సమాజాన్ని ఆకళింపు చేసుకునే తత్త్వం చిన్ననాటి నుంచే కేటీఆర్‌లో మెండుగా ఉండటంతో తెలంగాణ అనుభవిస్తున్న పరాయి పీడన తన స్వానుభవంలో ఉంది. ఆత్మాభిమానం కోసం, పరాయిపాలన విముక్తి కోసం తండ్రి చేస్తున్న పోరాటం తనని అమెరికాలో కుదురుగా ఉండనీయలేదు. స్వరాష్ట్ర కాంక్ష తనని మాతృభూమికి తీసుకొచ్చింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పరోక్షంగా తన పాత్ర పోషించిన కేటీఆర్, 2004 నుంచి ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు.
తెలంగాణ కోసం పదవుల త్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ 2006లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి ఉపఎన్నికల బరిలో నిలిచారు. నాటి పోరులో కేటీఆరే సమర్థ వ్యూహాలను నెరపి పార్టీ యంత్రాగాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి, 2 లక్షల పైచిలుకు మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. యావత్ తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర కాంక్షను బలంగా తట్టి లేపి ఉద్యమానికి ఊపిరులూదిన ఆ గెలుపులో కేటీఆర్ పాత్ర అనన్య సామాన్యం. నాటి నుంచి నేటి వర కు ఓటమి ఎరుగని నేతగా రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి కార్యకర్తలతో మమేకమై బీమాతో వారికి ధీమా కల్పిస్తూ, వారి సంక్షేమాన్ని చూస్తూ, నేతలను సమన్వయ పరుస్తూ పార్టీని పటిష్ఠంగా నిర్మించారు. ఈ క్రమంలో నాలుగేండ్ల సుదీర్ఘ కృషికి గుర్తింపుగా 2008లో పార్టీ ప్రధాన కార్యదర్శి, 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2010లో ఉద్యమ కార్యాచరణలో భాగంగా కేసీఆర్ పిలుపునందుకొని ఎమ్మెల్యే పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి ఏడాది కాలంలోనే 68 వేల పైచిలుకు మెజారిటీతో విజయఢంకా మోగించారు. సిరిసిల్ల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
పద్నాలుగేండ్ల పార్టీ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం లో అత్యంత కీలకమైన చివరి ఐదేండ్లలో సాధించిన విజయాల్లో కేసీఆర్ ఆలోచనలను, ఆశయాలను నూటికి నూరుశాతం సమర్థవంతంగా అమలుచేసిన ముఖ్య పాత్ర నిస్సందేహంగా కేటీఆర్‌దే. జేఏసీ ఏర్పాటు మొదలు అనేక కార్యక్రమా ల్లో తనదైన మద్దతు అందించారు. 2011 సెప్టెంబర్ 13న చారిత్రక సకలజనుల సమ్మె తదనంతరం చేసిన రైలు రోకో, జైల్ భరో, రాస్తారోకో, వంటావార్పు తదితర ఉద్యమ పంథాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తద్వారా నమోదైన కేసుల్లో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. మిలియన్ మార్చ్ లాంటి మెగా ఈవెంట్లో అత్యంత క్రమశిక్షణతో సుశిక్షుతులైన యోధులుగా నాడు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారంటేనే ఉద్యమ ఆకాంక్షను వాళ్లలో ఎంత బలంగా నాటారో అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక ఉద్యమాల ద్వారా సాకారమైన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ప్రతీ వ్యూహాన్ని సమర్థంగా అమలుచేసిన కేటీఆర్ ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
2014 జూన్ 2న స్వరాష్ట్రంగా తెలంగాణ ప్రయాణం మెదలుపెట్టినప్పటి నుంచి ప్రభుత్వంలో కీలకంగా మారిన కేటీఆర్ తెలంగాణకు నయా బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చారు. ఐటీ, మున్సిపల్, పరిశ్రమల వంటి శాఖల్లో విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. టీఎస్-ఐపాస్, టీఎస్-బీపాస్, టీ-హబ్, వీ-హబ్, టీ-ఫైబర్, ఇండస్ట్రియల్ పాల సీ, ఎన్ఆర్ఐ పాలసీ.. ఇలా ప్రతి రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టించి తెలంగాణను కొత్త పుంతలు తొక్కించారు. దేశ సగటుని మించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, జీడీపీ, జీఎస్డీపీల్లో తెలంగాణను టాప్‌లో నిలిపారు.
ఇవ్వాళ ఆఫీస్ స్పేస్ అంశంలో ప్రపంచంలోనే హైదరాబాద్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఐకియా, వన్ ప్లస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి కంపెనీల పెట్టుబడుల కోసం దేశాధినేతలే ఎదురుచూసే పరిస్థితి. అలాంటి స్థాయి వీటిది. టాటా, కైటెక్స్, ఐటీసీ, మైక్రోమాక్స్ తదితర కంపెనీలను రాష్ట్ర ముఖ్యమంత్రులే ఎదురేగి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టాలని అడిగే పరిస్థితి. ఇంత పోటీలోనూ ఈ కంపెనీలు తెలంగాణ వైపునకు క్యూ కట్టాయంటే కేసీఆర్ మార్గదర్శనంలో కేటీఆర్ కృషి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ స్టార్టప్ ఇండియా క్యాటగిరిలో చాలెంజర్ అవార్డుని, ఐటీ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ వంటి అవార్డులను 2019 నాటికే అందించాయి. ఆడి రిట్జ్ సంస్థ ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. లీడర్ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను 2017 గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్‌లో కేటీఆర్ అందుకున్నారు. ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మ క సంస్థల నుంచి మరెన్నో అవార్డులను దేశంలో రామన్న మాత్రమే సొంతం చేసుకోగలిగారు.
దేశ చరిత్రలో, ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ఎందరో గొప్ప నేతలకు వారసులుగా వచ్చిన ఎంతో మందిలో ఒక మహానేత నిజ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, కేసీఆర్ లాంటి విజనరీ లీడర్ ఐడియాలజీని, ఆశయాలను, ఆలోచనలను సమర్థవంతంగా ఆచరణలో పెట్టగలిగిన ఏకైక నేత కేటీఆర్ మాత్రమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. బాధ్యతలు పంచుకున్న కొడుకులా, అండగా నిలిచే అన్నలా, ప్రేమించే తండ్రిలా తన కుటుంబానికి ఎంత మద్దతుగా నిలిచారో అంతకన్నా ఎన్నో రెట్లు తెలంగాణ సమాజానికి అండగా నిలబడ్డారు కేటీఆర్. కరోనా లాంటి సంక్షోభ సమయాన్ని సైతం అడ్మినిస్ట్రేటర్‌గా అధిగమిస్తూనే ఆపన్నులకు కేవలం ఒక్క క్లిక్ దూరంలో ట్విటర్ ద్వారా అందుబాటులో ఉండి సేవలందించారు.
రాజకీయవేత్త కన్నా కేటీఆర్‌లోని మానవతావాది ఎన్నో సంక్లిష్ట సందర్భాల్లో మనకు సాక్షాత్కరిస్తారు. పరిపాలనలో తలమునకలై అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ, సంక్షేమాన్ని సైతం చల్లగా చూడాలంటే భూదేవంత ఓరిమి కావాలి. తెలంగాణపై కుయుక్తులు పన్నే గుంట నక్కల పొగరణచాలంటే చాణక్యుని పన్నాగం తెలవాలి. అవన్నీ కేసీఆర్ తర్వాత అంతలా తెలిసిన వ్యక్తి కేటీఆర్ మాత్రమే. అధికారంలో ఉన్నా… లేకున్నా… తెలంగాణమే తన జెండా, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తనకు తెలిసిన ఎజెండా. అందుకే ప్రతిపక్ష నేతగానూ వివిధ దేశాల్ని సందర్శిస్తూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఇక రాష్ట్రంలో గత రెండేండ్లలో ప్రజా విధ్వంసక పాలన చేస్తున్న పాలకులను కడిగి పారేస్తున్నారు. అక్రమ కేసుల ను ఎదుర్కొంటున్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ భవన్‌ను ‘జనతా గ్యారేజీ’ గా మార్చేశారు. ఆయన సామర్థ్యాలను, నైపుణ్యాలను వంద శాతం పుణికిపుచ్చుకున్నారు. అందుకే సిరిసిల్ల పౌరుడిని… సిలికాన్ వ్యాలీలోని టెకీని ఏకకాలంలో అనునయించగల నేర్పరి; గల్లీ లీడర్‌ను… గగనాలు దాటి సీఈవోని ఏకకాలంలో అనుసంధానించగల హుషారు, దావోస్ వేదికల్లో ఇవాంకా లాంటి టెక్నోక్రాట్లని, మాస్ మీటింగుల్లో వేల జనాల్ని ఒకే రీతిన ఆకట్టుకునే చతురుడు; హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్ భాషేదైనా సాధికారికంగా, స్పష్టంగా మెప్పించి ఒప్పించగల మాటకారి, అన్నింటికన్నా తెలంగాణమే మనసంతా నింపుకొన్న బాటసారి కేటీఆర్. తెలంగాణ గడ్డని ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే కేటీఆర్‌ను మాకు అందించినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ, ఆయన ఆశీస్సులు నిండు నూరేండ్లు కేటీఆర్‌పై ఉండాలని కోరుకుంటూ…
Happy Birthday to KTR
– (వ్యాసకర్త: బందూక్ చిత్ర దర్శకులు, సామాజికవేత్త)
లక్ష్మణ్ మురారిశెట్టి 90119 66666