ఎన్నికల సభల్లో కేసీఆర్ ఒక మాట చెప్పేవారు. మంది మాటలు పట్టుకొని మార్వాణం పోతే, మల్లొచ్చేవరకు ఇల్లు గుల్ల అయితది అని. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అట్లనే కనిపిస్తున్నాయి. ‘కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పుచేశామా’ అని ప్రజలు పునరాలోచించుకుంటున్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ఇంతలా అపకీర్తి మూటగట్టుకోవడానికి ముందుచూపు లేని పాలనే ప్రధాన కారణం. అంతేకాదు, ప్రతీ పనిలో రాజకీయ లబ్ధిని మాత్రమే చూడటం.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒకచోట ఏదో ఒక సమస్య మీద ప్రభుత్వం మీద ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఫార్మా కంపెనీ భూముల సేకరణకు వ్యతిరేకంగా లగచర్ల రైతులే కావొచ్చు, గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని పిల్లలు కావొచ్చు, రైతుబంధు, రుణమాఫీ కోసం అన్నదాతలు కావొచ్చు, మూసీ కూల్చివేతలు, హైడ్రా వ్యవహారం కావొచ్చు, తెలంగాణ తల్లి రూపం మార్చడం కావొచ్చు.. ఇలా ఏదో ఒక సమస్య మీద రాష్ట్రం ఉడుకుతూనే ఉన్నది. ప్రశ్నించేవాళ్లపై కేసులు పెడుతున్నారు, వారిని అరెస్టు చేస్తున్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశ పాలనా?
ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ ఎన్నో హామీలను ఇచ్చింది. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అందులో కీలకమైనవి. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధును బొందపెట్టి, రైతు సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టి, మహిళా సాధికారతను ఉచిత బస్సుకే పరిమితం చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ బొమ్మలతో నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఈ సంవత్సర కాలంలో అసలు నిజమైన అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేశారా? ఒక్క కొత్త ఉద్యోగమైనా ఇచ్చారా? భూతద్దం పెట్టి వెతికినా తెలంగాణ ఆర్థికంగా కాని, సంక్షేమపరంగా కాని ఆవగింజంత కూడా ముందుకుపోలేదు సరికదా చాంతాడంత వెనక్కిపోయిందని అందరికీ అర్థమవుతూనే ఉన్నది.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రతీ పనిలో విజయవంతమవడానికి ముఖ్యకారణం రాజకీయ కోణంలో కాకుండా కేవలం ఆ పథకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడమే. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే స్పష్టత లేని సర్కార్ నిర్ణయాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అరకొర రుణమాఫీ, అమలుకాని రైతుభరోసా, బోగస్‌గా మారిన బోనస్, లగచర్ల వ్యవహారం, హైడ్రా, మూసీ కూల్చివేతలే అందుకు నిదర్శనం. ప్రతీ పనిని ముందుచూపు లేకుండా, సరైన ఆలోచన లేకుండా, నియమనిబంధనలు పాటించకుండా చేయడం.. ప్రజలను ఇబ్బంది పెట్టడం వీళ్లకు మామూలైంది.
హైడ్రా రామబాణాన్ని కేవలం రావణాసురుడి మీద ప్రయోగిస్తేనే ఉపయోగం ఉంటుంది. అంతేతప్ప, సాధారణ ప్రజల మీద ఎక్కుపెడితే అది రాక్షసబాణమే అయితది కదా. హైడ్రా వ్యవహారం కూడా అలాంటిదే. ఉద్దేశం మంచిదే అయినా సరైన మార్గదర్శకాలు, స్పష్టత లేని కారణంగా హైడ్రా ఎవరి ఇల్లు, ఎప్పడు కూలగొడుతదో అనే భయం ప్రజల్లో ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఆర్థికరంగం అస్తవ్యస్తమైంది.
పేదల ఇళ్లను హైడ్రా కూలగొడుతుంటే, ప్రజలు ఉన్నపళంగా రోడ్డు మీద పడుతుంటే యావత్ తెలంగాణ కన్నీరు పెట్టుకున్నది. ‘మా వద్ద అన్ని కాగితాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. మీరెవరు మా ఇల్లు కూల్చడానికి’ అని ప్రజలు ముఖ్యమంత్రిని శాపనార్థాలు పెట్టారు.
మూసీని సుందరీకరించాలా లేక శుద్ధి చేయాలా అంటే నేను కేవలం శుద్ధి చేయాలనే అంట. లండన్‌లోని థేమ్స్ నదిని శుభ్రం చేసి, ప్రాణం పోసిన విధానంపై చాలా సమాచారం సేకరించి నేను గత ప్రభుత్వానికి ఇచ్చాను. అతి తక్కువ ఖర్చుతో మూసీకి ఎలా ప్రాణం పోయాలో ఆలోచించి గత ప్రభుత్వం ఆ పనులను ప్రారంభించింది.
మూసీలోకి వెళ్లే డ్రైనేజ్ నీళ్లను మళ్లించి శుద్ధి చేయడం అందులో మొదటిది, కీలకమైనది. అంచెలంచెలుగా మూసీలోకి అపరిశుభ్రమైన నీరు వెళ్లకుండా నియంత్రించి, తద్వారా నీటి కాలుష్యాన్ని నివారిస్తే పరీవాహక ప్రాంతం సుందరంగా మారుతుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ పక్కనపెట్టేసింది. మూసీ సుందరీకరణ పేరిట రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్‌కు తెరలేపింది. ఒక సామాన్య పౌరుడిగా అడుగుతున్నా.. మూసీని శుభ్రం చేస్తే పరీవాహక ప్రాంత ప్రజలకు లాభం జరుగుతుంది కానీ, రివర్ ఫ్రంట్ అంటూ లక్షల కోట్లు వెచ్చిస్తే కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికి లాభం?
ఎన్నికలప్పుడు ఎంతో ఆర్భాటంగా రుణమాఫీ చేస్తామని, అందరికీ రైతుభరోసా ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన పద్ధతిలో రుణమాఫీ చేపట్టకపోవడంతో లక్షల మంది అన్నదాతలకు నిరాశే ఎదురైంది. కౌలు రైతులను అసలు పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో నిర్విరామంగా సాగిన రైతుబంధు కాంగ్రెస్ హయాంలో రైతుభరోసాగా మారి అటకెక్కింది. వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు మాటమార్చి బోగస్‌గా మార్చారు. మొత్తంగా మార్పు మార్పు అని ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ పాలకులు రాష్ర్టాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారనడంలో ఏ మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు.
– (వ్యాసకర్త: ఎన్నారై యూకే) చాడ సృజన్‌రెడ్డి