నిజాయితీ, క్రమశిక్షణకు నిలువెత్తు రూపం గుమ్మడి నర్సయ్య. ఇల్లెందు ప్రజలు ఆయనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజా ఉద్యమాల నాయకుడిగా పేరొందిన నర్సయ్యకు జూబ్లీహిల్స్ ఎనుముల ప్యాలెస్ ముందు పడిగాపులు కాసేలా పరిస్థితిని కల్పించడం నియంతృత్వ పాలనా స్వభావానికి నిదర్శనం. ‘ఓటుకు నోటు’ పంచకుండా ఐదు సార్లు గెలవడం, పదవిలో ఉన్నప్పుడు జీతం (గౌరవ వేతనం) సైతం నమ్ముకున్న పార్టీకే ఇవ్వడం, నాలుగు దశాబ్దాలకు పైగా ఒకే రంగు జెండాను మోయడం, జీవితాంతం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం ప్రస్తుత రాజకీయాల్లో అంత తేలికైన విషయం కాదు. కానీ, రాజకీయాల్లో నర్సయ్య జీవితం మాత్రం భవిష్యత్తు తరాలకు ఆదర్శం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆయనకు అబద్ధాలను ఇంధనంగా వాడుకొని రాకెట్ వేగంతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన ఎనుముల రేవంత్ రెడ్డి నాలుగు సార్లు అపాయింట్మెంట్ను నిరాకరించడమంటే నిజాయితీ, నిబద్ధతలకు సమాధి కట్టడమే. అయినా, వ్యక్తిగత ఎదుగుదలే లక్ష్యంగా పార్టీలు మార్చి, సీనియర్లకు పంగనామం పెట్టే రేవంత్‌కు ‘రాజకీయ విలువలు’ అనే పదం పెద్దగా రుచించకపోవచ్చు.
ప్రగతిభవన్ కంచెలు తొలగిపోయాయి. ‘ప్రజా పాలన’ మొదలైంది. సమస్యలున్నప్పుడు నా ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని స్వయంగా రేవంత్ రెడ్డి బీరాలు పలికారు. కానీ, ఆయన అదానీ వంటి వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ, . ప్రజాగొంతుక అయిన నర్సయ్యను మాత్రం ఎర్రటి ఎండలో నిలబెట్టడం గర్హనీయం. ప్రజాస్వామ్య పరిరక్షణే ఏడో గ్యారెంటీ అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలకులు ఏడాది దాటినా కనీసం ఆరు గ్యారెంటీలను అమలుచేయకపోవడం సిగ్గుచేటు. ఆర్భాటంగా ప్రారంభించిన ‘ప్రజా దర్బార్’కు అసలు స్పందనే కరువైంది. బాధితుడి సమస్యకు స్థానికంగా పరిష్కారం చూపకుండా పట్టణానికి రమ్మనడమేమిటి? ఇదేం పరిపాలన అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు తనకే రుణమాఫీ కాలేదని, ఇక సామాన్య రైతులకేం చేస్తారని గుమ్మడి నర్సయ్య ప్రశ్నిస్తున్నారు. తులం బంగారం, విద్యార్థులకు స్కూటీ ఏమైందని మరోపక్క ప్రజలు నిలదీస్తున్నారు. అధికారమే పరమావధిగా మేధావులను, ప్రజా సంఘాలను కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. ఉద్యమ చరిత్ర కలిగిన వారికి ప్రభుత్వంలో సాధారణ పదవులు కట్టబెట్టడం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నది.
అర్హులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తమ ‘అభయ హస్తం’ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేయలేదు. అంబేద్కర్ అభయహస్తం జాడే లేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపుల్లో మాదిగలకు అన్యాయం జరుగుతున్నదని విన్నవించేందుకు సచివాలయానికి విచ్చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులును సైతం ఉదయం నుంచి రాత్రివరకు వెయిట్ చేయించి.. సీఎం రేవంత్‌రెడ్డి కలవకుండానే వెళ్లిపోయారు. ఇక పలు సందర్భాల్లో ప్రోటోకాల్ పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సైతం అవమానపరచడం మనందరికీ తెలిసిందే. దళిత, గిరిజన సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధుల విషయంలో రేవంత్ తన పూర్వ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.
-నరేష్ పాపట్ల, 95054 75431