మానవ జీవితానికి దిక్సూచిగా వేదాలలో అన్నిరంగాలకు, వ్యక్తిత్వ జీవనానికి కూడా మార్గదర్శక సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి తన జీవితం ఎట్లా గడపాలి; కుటుంబంతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు నెరపాలి, ఆ బాధ్యతలు ఏమిటి, ఎట్లా తీర్చుకోవాలి;సమాజం పట్ల ఎట్లా వ్యవహరించాలి, ఒక సభ్యుడిగా తన బాధ్యతలేమిటి, సమాజంలో అందరూ శాంతిగా, ఆనందంగా, క్షేమంగా బ్రతకటానికిఏమి చేయాలనే విషయాలు చాలా వివరంగా, సుస్పష్టంగా నాలుగు వేదాలలోనూ ఇవ్వబడ్డాయి. అవి మత సంబంధమైన గ్రంథాలు కావు.జీవన విధానానికి తోడ్పడి మానవ సమాజమంతా ఒక్కటిగా బ్రతికే ధర్మాన్ని విశదీకరించిన మహోత్కృష్ట విజ్ఞాన, జ్ఞాన సర్వస్వాలు.
ఇక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి చూద్దాం. పద్నాలుగేండ్ల ఉద్యమం నడిపి, తన జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడి, రాష్ర్టాన్ని సాధించి మొట్టమొదటి పాలకుడైన కేసీఆర్కు తన మాతృభూమి మీద ప్రేమ ఉండటం సహజమే! అది అందరికీ అర్థమైంది కూడా. కానీ, ఆయన ముఖ్యమంత్రి అయ్యాకనే వారి వితరణశీలత్వం మేధ, ప్రజ్ఞ, విశాలమైన భావాలు, ఆలోచనను ఆచరణలో పెట్టగలిగిన ప్రతిభ లోకానికి తెలిసింది.
వేదాలలో ముగ్గురు వ్యక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. ఎందుకంటే ఒక సమాజం, రాజ్యం సుఖంగా, సుభిక్షంగా ప్రగతి చెందుతూ, నాగరికత పెంచుకుంటూ వృ ద్ధి చెందాలంటే ఆ ముగ్గురూ సామాన్య వ్యక్తులు కాక, అత్యంత ప్రజ్ఞావంతులు, మేధావులు అయి ఉండాలి. వారు పాలకుడు, వేదాలలో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అవపోసన పట్టిన సలహాదారు, శాస్త్రజ్ఞుడు. ఈ ముగ్గురూ మానవ సమాజానికి అత్యంత అవసరమైనవారు. అందులో పాలకుడికి ఏ లక్షణాలు ఉండాలని వేదాలు ఏమేమి నిర్దేశించాయో చూద్దాం.
పాలకుడు ఆదర్శ మానవుడిగా ఉండాలి. అం టే ఇతరులు అతని లక్షణాలు చూసి ఆకర్షితులై, అభిమానించటమే కాదు, అతనిలా తాము ఉం డాలన్న కోరిక పెరగాలి. ఉన్నత విద్యావంతుడు, నైపుణ్యాలు కలిగినవాడు, మంచిగుణాలు ఉన్నవాడు, పండితులతో సమంగా జ్ఞానం కలిగినవాడు, నిజాయితీ పరుడు, ప్రజలను తమ బాధ్యతల పట్ల ఉత్సాహవంతులను చేస్తూ, తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేవాడు అయి ఉండాలి. (యజుర్వేదం, 7వ అధ్యాయం, 16వ మంత్రం). పాలకుడికి ధర్మజ్ఞానం ఉండి, తన ఇంద్రియాలను అదుపులో పెట్టగలిగి ఉండాలి. అధర్మమైన ఆలోచనలు రానివాడు, అనైతికమైన పనులు చేయనివాడు అయి ఉండాలి. ప్రజలు విద్యావంతులు అవటానికి పాటుపడుతూ వారు ధర్మ మార్గంలో నడిచేటట్టు ప్రోత్సహించాలి. (యజుర్వేదం, 8వ అధ్యాయం, 23వ మంత్రం).
విద్యావంతుడే కాక వివిధ రంగాల అవగాహన కలిగి, చక్కటి రూపం బలమైన శరీరం కలిగి, పూర్ణ ఆరోగ్యవంతుడై ఉండాలి. భౌతికమైన ఆరోగ్యమే కాదు, మానసికంగా కూడా బలవంతుడై సకారాత్మక ఆలోచనలు, ప్రజల మీద అత్యంత ప్రేమాభిమానాలు కలిగినవాడై ఉండాలి. (యజుర్వేదం,9వ అధ్యాయం, 23వ మంత్రం).
పరిపాలనాదక్షుడు, వితరణశీలి, ప్రజాభిమానం చూరగొనేట్టు మంచి గుణాలు కలిగినవాడు, రాష్ర్టాన్ని, రాజ్యాన్ని సుసంపన్నం చేయగల పరిపాలన అందించగలిగినవాడు మాత్రమే పాలకుడిగా ఉండటానికి అర్హుడు. (యజుర్వేదం, 9వ అధ్యాయం, 32వ మంత్రం). ప్రజలందరినీ విద్యావంతులను చేయాలనే దృఢమైన సత్సంకల్పం కలిగి, విద్యాసంస్థలను కాపాడి, యువతను విద్య వైపు ఆకర్షించగలిగినవాడు, నిజాయితీ, నిష్ఠ కలిగి తాను స్వయంగా చాలా రంగాలలో నిష్ణాతుడైనవాడే పాలన చేయగలడు. (యజుర్వేదం, 9వ అధ్యాయం, 38వ మంత్రం). సంస్కారవంతమైన కుటుంబానికి చెంది, సకారాత్మక ఆలోచనలు, పాండిత్యం కలిగినవాడే పాలకుడవాలి. (యజుర్వేదం, 9వ అధ్యాయం, 40వ మంత్రం).
ప్రతిభావంతులైన ఆధ్యాత్మిక గురువుల వద్ద ఉన్నత విద్యాభ్యాసం పొంది, దుర్గుణాలకు లొంగనివాడు, సత్యాన్ని నమ్మి నిజాయితీగా ఉండేవాడు, ఆహ్లాదకరంగా మాట్లాడేవాడు, ప్రజల గురించి ఎప్పటికప్పుడు విచారిస్తూ వారి సమస్యలను సత్వరం తీర్చేవాడు, న్యాయాన్ని గౌరవిస్తూ, న్యాయంగా పక్షపాతరహితంగా పరిపాలన అందించగలిగినవాడే విజయవంతంగా ప్రజలను పాలించగలడు. (యజుర్వేదం, 12వ అధ్యాయం, 14వ మంత్రం). శాస్త్ర విజ్ఞానం పుష్కలంగా కలిగి, మాతృభూమి మీద అమిత ప్రేమ ఉన్నవాడు, వివక్ష లేకుండా న్యాయబద్ధంగా ప్రవర్తించేవాడు మాత్రమే పాలకుడిగా ఉండటానికి అర్హుడు. (యజుర్వేదం, 17వ అధ్యాయం, 33వ మంత్రం). మచ్చలేని వ్యక్తిత్వం కలిగి, మానవీయ కోణంలో అందరినీ సమంగా ఆదరించగలిగినవాడు, ప్రజాక్షేమం, వారి సుఖమే లక్ష్యంగా కలవాడు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచగలిగినవాడు, రాజ్యాన్ని ప్రగతి పథంలో నడిపి, ప్రజలందరినీ సంపన్నులను చేయగలిగినవాడు, నిస్సహాయులను ఆదుకోవాలన్న సంకల్పం ఉన్నవాడే పాలనకు అర్హుడు. (యజుర్వేదం, 33వ అధ్యాయం, 16వ మంత్రం).
పైన చెప్పిన లక్షణాలు ఒకే వేదం- యజుర్వేదం-లో చెప్పినవి. ఇంకా చాలా లక్షణాలు – సైన్యాన్ని శత్రువులను అణచటానికి మాత్రమే వాడాలనీ, ప్రజలకు మేలు చేసే పనులు మాత్రమే పాలకులు చేయాలనీ, అన్నిరంగాలనీ నిష్పక్షపాతంగా, ప్రజ్ఞావంతంగా, మేధస్సును ఉపయోగిస్తూ, ప్రతి చిన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తూ అత్యంత పారదర్శకంగా పరిపాలన సాగించటమే పాలకుడి కర్తవ్యమనీ, ఇందులో అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు తావివ్వకూడదనీ- ఇంకా చాలా బాధ్యతలు పాలకుడికి ఉండేవి వర్ణిస్తాయి నాలుగు వేదాలు కూడా.
ఇక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి చూద్దాం. పద్నాలుగేండ్ల ఉద్యమం నడిపి, తన జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడి, రాష్ర్టాన్ని సాధించి మొట్టమొదటి పాలకుడైన కేసీఆర్కు తన మాతృభూమి మీద ప్రేమ ఉండటం సహజమే! అది అందరికీ అర్థమైంది కూడా. కానీ, ఆయన ముఖ్యమంత్రి అయ్యాకనే వారి వితరణశీలత్వం మేధ, ప్రజ్ఞ, విశాలమైన భావాలు, ఆలోచనను ఆచరణలో పెట్టగలిగిన ప్రతిభ లోకానికి తెలిసింది. ఇదివరకు మంత్రులకు , ఐఏఎస్ సాధించి వివిధ శాఖలలో కార్యదర్శులుగా చేసిన ప్రతిభావంతులు, ఐపీఎస్ సాధించి పోలీసు శాఖను శాసించే అధికారులు సలహాలు ఇవ్వవలసి వచ్చేది. అటువంటిది వారందరినీ కూర్చోబెట్టి వ్యవసాయం దగ్గరి నుంచీ, ప్రజారక్షణ, జీవ విధానం సంరక్షణ, సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి బోధించగలిగిన పాలకుడు బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ ఒక్కరే!
అరకొర చదువులు, మొండితనం,పక్షపాత ధోరణి, కక్షసాధింపు చర్యలు చేసే మంత్రులకు, ముఖ్యమంత్రులకు సలహాలిచ్చే అధికారులకు అన్నిరంగాల్లో దిశానిర్దేశం చేసి, రాష్ర్టాన్ని అత్యంత ప్రగతిశీలంగా,ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేటట్టు కేవలం తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన అత్యంత ప్రతిభావంతుడైన పాలకుడు మాత్రం ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే!
ఇక మెత్తని పట్టుపరుపు మీంచి కొలిమిలోకి దూకి రెండవ ముఖ్యమంత్రిని, ఆయన పార్టీని గెలిపించిన ప్రజలకు ఇప్పుడిప్పుడే అసలుకు, నకలుకు తేడా తెలుస్తోంది. ఇక ప్రస్తుత పాలకుడి లక్షణాలు, పైన చెప్పిన పాలకుడి లక్షణాలతో పోల్చి చూసుకోవలసిన బాధ్యత ప్రజలకే ఉంటుంది. లక్ష్యాన్ని సాధించి ప్రజలకు సుఖశాంతులతో పాలించినవారికి, లేకి బుద్ధులు, దుర్మార్గపు ఆలోచనలు, కక్షసాధింపు చర్యలే పాలనగా సాగిస్తున్నవారికి ఉన్న భేదం ప్రజలకు బాగా అర్థమవుతున్నది. అందుకే అసలు సిసలైన పాలకుడి లక్షణాలు ప్రస్తుత పరిపాలన చేస్తున్నవారిలో ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టుకునే బాధ్యత ప్రజలకే వదిలేద్దాం!
-దంటు కనకదుర్గ
89772 43484