ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయడానికి వీలుగా జీవోలను ప్రభుత్వాలు విడుదల చేయడం పరిపాటి. అవే జీవోలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని వాటిని రద్దుచేసి రాజ్యాంగ పరిరక్షక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. గ్రూప్-1 నియామక ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29తో పాటు వికలాంగుల రిజర్వేషన్ల అమలుకు గాను తెచ్చిన జీవో 96 వివాదాస్పదంగా మారాయి.
జీవో 29, జీవో 96 విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తిస్థాయిలో సమగ్ర పరిశీలన చేయకుండానే ఆలస్యమనే కారణంతో ఆ పిటిషన్లను కొట్టివేయడం విస్మయాన్ని కలిగిస్తున్నది. కాగా, ఇప్పటికే జీవో 130 మీద వెలువరించాల్సిన ఏదో ఒక తీర్పు వాయిదాల పర్వంగా మారిందని రాజ్యాంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ జీవోల రాజ్యాంగ నిబద్ధతను ఒకసారి పరిశీలిద్దాం! 2022లో వేసిన గ్రూప్-1 నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా కేటాయింపు చేయబడిన పోస్టులను భర్తీ చేసేందుకు గాను గత ప్రభుత్వం జీవో 55ను తీసుకువచ్చింది.
పలు అనివార్య కారణాల వల్ల ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వం 2024, ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. దానిలో పేర్కొన్న జీవో 29 ద్వారా ప్రిలిమ్స్ స్థాయిలో రిజర్వేషన్లను పాటించకుండా కేటాయించిన పోస్టులకు తగిన అభ్యర్థులు లేనప్పుడు ఆయా రిజర్వేషన్ అభ్యర్థులను అదనంగా మెయిన్స్‌కు ఎంపిక చేశారు. అంటే ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా కాకుండా రిజర్వేషన్ అభ్యర్థులుగానే పరిగణించబడుతున్నారు. కానీ, సౌరవ్యాదవ్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇది చెల్లుబాటు కాదు. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం చివరి ఎంపిక ప్రక్రియలోనే రిజర్వేషన్లను పాటిస్తామని కోర్టుకు విన్నవిస్తూ వచ్చారు. అన్ని స్థాయులలో రిజర్వేషన్లను అమలుచేయాలని దీపేందర్ యాదవ్ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది. దీనిప్రకారం ప్రభుత్వ వాదనను నిర్ద్వందంగా తోసి పుచ్చవచ్చు.
కానీ, జీవో 29 మీద దాఖలైన వివి ధ పిటిషన్లను సాంకేతిక కారణంతో హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో ఆ జీవో 29 వివాదం ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం అందులోనూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి వెళ్తుండటం వల్ల ఈ కేసు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు దేశవ్యాప్తంగా వర్తించడమే కాకుండా, రిజర్వేషన్ ప్రక్రియపై పెను ప్రభావాన్ని చూపనున్నదని పరిశీలకులు అభిప్రాయం.మహిళా రిజర్వేషన్లతో పాటు స్పోర్ట్స్ కోటాను, వికలాంగుల కోటాను కూడా సమానంగానే భర్తీ చేయాలని 2007లో రాజేష్ కుమార్ దారియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీలో భాగంగా వికలాంగుల కోటాను అమలుపరిచే ఉద్దేశంతో జీవో 96 తెచ్చింది. దీనిప్రకారం, వికలాంగుల కోటా భర్తీ విధానం హారిజాంటల్గా కాకుండా వర్టికల్‌గా ఉన్నది.
ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉన్నది. ఈ విషయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ సైతం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో డిస్మిస్ కావడంలో ఆంతర్యం ఏమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 2022లోవెలువడిన అన్ని నోటిఫికేషన్లలో మహిళా రిజర్వేషన్లను కూడా వర్టికల్గానే ఇచ్చినప్పటికీ రాజేష్‌కుమార్ దారియా కేసులో ఇచ్చిన తీర్పు మేరకు ఆ రిజర్వేషన్లను వర్టికల్‌గా కాకుండా హారిజంటల్‌గా మార్చారు. అదే సమయంలో వికలాంగుల కోటానూ హారిజాంటల్గానే భర్తీ చేయవలసి ఉన్నా జీవో 96 ద్వారా వర్టికల్ విధానంలోనే అమలుపరుస్తున్నారు.
ఇక ఎస్టీ రిజర్వేషన్ పెంపు కోసం తెచ్చిన జీవో-130 కూడా వివాదాస్పదంగా మారింది. ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రక్రియ పార్లమెంటు సవరణ అనంతరం రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత మాత్రమే అమలుకు నోచుకుంటుంది. అంతేకాకుండా, ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సామాజిక రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనేది నిబంధన. 6 శాతం నుంచి 10 శాతానికి ఎస్టీ రిజర్వేషన్‌ను పెంచడం ద్వారా కోటా 50 శాతం కోటా దాటుతున్నది. రిజర్వేషన్ పెంపు ప్రక్రియ అనేది జీవో ద్వారా సాధ్యం కాదనేది అటు రాజ్యాంగ నిపుణులు ఇటు న్యాయకోవిదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవో-130 మీద దాఖలైన పిటిషన్‌ను శీఘ్రగతిన తేల్చాల్సిన ఆవశ్యకత ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ దాదాపు ఏడాది పాటు వాయిదాలతోనే సాగిపోతూ ఉన్నది. ఇలాంటి సున్నితమైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిశీలించడంతో పాటు, రాజ్యాంగ నిపుణుల సలహాలను తీసుకొని సత్వరమే పరిష్కారం చూపాలని అభ్యర్థులు ఆశిస్తున్నారు.
పైన పేర్కొన్న జీవోలపై దాఖలైన పలు పిటిషన్లను కోర్టులు సాధ్యమైనంత త్వరగా పరిశీలించి సమగ్ర అధ్యయనం చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుకూలంగా ఉన్నాయా? లేక ప్రతికూలంగా ఉన్నాయా? అనే విషయాన్ని తేల్చుతూ విరుద్ధంగా ఉన్న వాటిని కొట్టివేసి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రక్రియను రక్షించాలని కోరుతున్నారు. ఆ గురుతర బాధ్యత న్యాయస్థానాలపై ఉన్నదని, సామాన్యునికి సైతం న్యాయవ్యవస్థ బాసటగా నిలుస్తూ విశ్వాసాన్ని పాదుగొలుపుతుందని అటు ఉద్యోగార్థులు, ఇటు న్యాయ నిపుణులు రాజ్యాంగ, పరిరక్షకులు ఆశిస్తున్నారు.
– భాస్కర్ యలకంటి 89194 64488
(వ్యాసకర్త: సోషల్ ఎనలిస్ట్)