రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలైంది. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పుస్తకాలు, బట్టలు, ఫీజుల కోసం నానా ప్రయాసలు పడుతున్నారు. ప్రైవేట్ బడుల్లో ఫీజులు నియంత్రిస్తామనే సీఎం రేవంత్‌రెడ్డి హామీ మిగతా హామీల లాగానే, ఆయనే స్వయంగా విధించిన విద్యాకమిషన్ నివేదికతో పాటే బుట్టదాఖలైంది. పైపెచ్చు విద్యాశాఖలో సంస్కరణల పేరుతో సర్కార్ అమలు చేస్తామంటున్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది. రాష్ట్రంలోని దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల మెగా క్లస్టర్ స్కూళ్లుగా (తెలంగాణ పబ్లిక్ స్కూల్స్) మారుస్తామని రేవంత్‌రెడ్డి బెంగళూరులో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ ప్రకటన విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ప్రతి చిన్నారికీ తమ ఇంటికి సమీపంలో (1 నుంచి 3 కిలోమీటర్ల లోపు) ప్రాథమిక విద్యా సౌకర్యం అందుబాటులో ఉండాలని ‘ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009’ స్పష్టం చేస్తున్నది. మండల కేంద్రాల్లో పెద్ద స్కూళ్లు పెట్టి, గ్రామాల్లోని బడులను ఎత్తివేయడం ప్రాథమిక హక్కును కాలరాయడమే అవుతుంది.
ప్రభుత్వమే పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి, భద్రతా కారణాల దృష్ట్యా చిన్నపిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను మైళ్ల దూరంలో ఉన్న మండల కేంద్రాలకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడుతారు. ఇది అంతిమంగా డ్రాపౌట్స్ (బడి మానేసేవారి) సంఖ్య పెరుగడానికి కారణమవుతుంది. వాస్తవానికి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. మౌలిక వసతులు లేకపోవడం, టీచర్ల కొరతను నివారించకుండా, రోగానికి మందు వేయాల్సింది పోయి రోగిని నిర్బంధించినట్లుగా బడులను మూసివేయడం లేదా విలీనం చేయడం సరైన సంస్కరణ అనిపించుకోదు.
విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, ఫీజుల నియంత్రణకు కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితో కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై 8% క్యాపింగ్ విధించడంతో పాటు, విద్యారంగంలో పారదర్శకత కోసం ఆ కమిషన్ అనేక అద్భుతమైన సిఫారసులతో కూడిన ముసాయిదా బిల్లును ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని చాలామంది ఆశపడ్డారు. కానీ, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిళ్లకు లొంగిపోయిన ప్రభుత్వం, ఆ సిఫారసులను పూర్తిగా పక్కన పెట్టేసింది. తాను ఎంతో నిబద్ధతతో రూపొందించిన నివేదికను, పేద విద్యార్థులకు మేలు చేసే సిఫారసులను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడాన్ని ఆకునూరి మురళి తట్టుకోలేకపోయారు. విద్యా కమిషన్ చైర్మన్ పదవి కేవలం అలంకారప్రాయంగా మారిందని, ప్రభుత్వానికి విద్యాసంస్కరణలపై నిజాయితీ లేదని నిరసిస్తూ ఆయన తన పదవి నుంచి తీవ్ర అసంతృప్తితో తప్పుకొన్నారు. విద్యారంగంపై కనీస అవగాహన లేని అధికారుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్తున్నదని ఆయన బహిరంగంగానే విమర్శించడం ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టు.
ఆకునూరి మురళి రాజీనామా తర్వాత ‘ఫీజు నియంత్రణ చట్టం’ కథ పూర్తిగా కంచికి చేరినట్లయింది. రెండేండ్లకు ఒకసారి కేవలం 8 శాతమే ఫీజులు పెంచాలనే నిబంధన, ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా వంటి కఠిన నిబంధనలతో కూడిన బిల్లు క్యాబినెట్ ఆమోదం కోసం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉన్నది. విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా 20% నుంచి 30% వరకు ఫీజులు పెంచేస్తున్నా ప్రభుత్వం ఈ బిల్లును చట్టసభల ముందుకు తీసుకురాకపోవడం వెనుక పెద్ద ఎత్తున ఆయా యాజమాన్యాల లాబీయింగ్ ఉన్నదనే విమర్శలు నిజమని రుజువవుతున్నాయి.
ఒకవైపు నాణ్యత లేదనే నెపంతో ప్రభుత్వ బడులను నమ్ముకోలేక, మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ విద్యావిధానం పరస్పర విరుద్ధమైన దిశలో పయనిస్తున్నది. ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను కట్టడి చేయడంలో, దానికి సంబంధించిన చట్టాలను రూపొందించిన ఆకునూరి మురళి లాంటి నిపుణుల సిఫారసుల అమల్లో విఫలమవ్వడం, మరోవైపు పేదవాడికి అందుబాటులో ఉండే ప్రభుత్వ బడుల సంఖ్యను తగ్గించాలని చూడటం వల్ల సమాజంలో అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నది.
ప్రభుత్వం కేవలం ‘మాడల్ స్కూల్స్’ అనే గ్లామర్ ప్రాజెక్టుల మీదనే కాకుండా, ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. ఆకునూరి మురళి వంటి విద్యావేత్తల రాజీనామా ఇచ్చిన హెచ్చరికలను గమనంలోకి తీసుకుని, కార్పొరేట్ శక్తులకు లొంగకుండా వెంటనే ఫీజు నియంత్రణ బిల్లును చట్టంగా మార్చాలి. విద్య వ్యాపార సరుకు కాదని, అది పౌరుల ప్రాథమిక హక్కనే విషయాన్ని పాలకులు విస్మరించకూడదు.
(వ్యాసకర్త: ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు )
-ఎం.నవీన్‌రెడ్డి