ప్రభుత్వ భూములకు సర్కారు ధర్మకర్త మాత్రమే. ఈ భూములను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజాప్రయోజనానికే వినియోగించాలి. వాటిని తెగనమ్ముకొని సొమ్ము చేసుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాకూడదు ప్రభుత్వం. కానీ, పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడి విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వం అదే చేస్తున్నది. పరిశ్రమలు పెట్టి పదిమందికి ఉపాధి కల్పిస్తారనే ఉద్దేశంతో ఇదివరకటి ప్రభుత్వాలు తక్కువ ధరకు, ఇతర రాయితీలు, మౌలిక సౌకర్యాలు కల్పించి కేటాయించిన స్థలాలను వినియోగ మార్పిడి పేరిట రియల్ ఎస్టేట్ అంగడి సరుకుగా మార్చుకునే కుతంత్రానికి తెరతీస్తున్నది ‘స్కామ్’గ్రెస్. అడ్డికి పావుశేరు లెక్క అస్మదీయులకు పందేరం చేసేందుకు వీలుకల్పిస్తున్నది సర్కార్. ఇందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని (హెచ్ఐఎల్టీపీ) తీసుకువచ్చింది.
దీనికింద హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను మల్టీపర్పస్ యూజ్ జోన్లుగా మారుస్తూ జీవో నం.27 జారీచేసింది. నాచారం, చర్లపల్లి, మల్లాపూర్, మౌలాలి, పటాన్చెరు, పాశమైలారం తదితర పారిశ్రామికవాడల్లోని విలువైన భూములను గోల్మాల్ చేసేందుకు సమకట్టింది. ఆయా ప్రాంతాల్లో భూముల విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.40-50 కోట్లు ఉండొచ్చని అంచనా. ఈ లెక్క ప్రకారం రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణం జరుగుతున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపించడం గమనార్హం.
ప్రజల ప్రయోజనాల కోసమని ప్రభుత్వాలు కొన్నిసార్లు పరిశ్రమలకు, సంస్థలకు భూములు కేటాయిస్తాయి. ఇలా కేటాయించిన భూములను నిర్దేశిత అవసరాలకే వినియోగించాలని షరతు కూడా విధిస్తాయి. ఈ కేటాయింపుల ద్వారా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. కానీ, నిర్దేశిత ప్రజా ప్రయోజనాలకు భూములను వినియోగించడం జరగనప్పుడు సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే, అటు పెట్టుబడులు పెట్టి, మౌలిక నిర్మాణాలు జరిపిన పారిశ్రామికవేత్తలు నష్టపోరాదని, అదే సమయంలో ప్రజాప్రయోజనాలకు భంగం కలగరాదని ప్రభుత్వాలు మధ్యేమార్గాన్ని రూపొందించుకుంటాయి.
ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండొ చ్చు. ఉద్దేశించిన అవసరాల మేరకు ఉపయోగించని భూముల్లో సగం క్రమబద్ధీకరించి, మిగతా సగాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే పద్ధతిని మహారాష్ట్ర అనుసరిస్తున్నది. ఈ పద్ధతిలో ప్రజావసరాలకు బోలెడు భూమి అందుబాటులోకి వస్తుంది. అలాకాకుండా మొత్తం భూముల్ని మల్టీపర్పస్ యూజ్ జోన్లుగా మార్చాల్సి వస్తే అనుసరించాల్సిన విధానంపై ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం గతంలో ఆజమాబాద్ పారిశ్రామికవాడ భూములను రిజిస్ట్రేషన్ రేటు కంటే 100-200 శాతం ఎక్కువకు క్రమబద్ధీకరించి ఖజానాకు నిధులు సమకూర్చింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. కానీ, కాం గ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానం ఏకపక్షం గా పారిశ్రామికవేత్తలకు మేలు చేసేదిగా ఉన్న ది. రిజిస్ట్రేషన్ విలువలో కేవలం 30 శాతానికే అప్పనంగా అప్పగించేందుకు సర్కార్ హడావుడి చేస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంలోనే దరఖాస్తుల సమర్ప ణ, అధికారుల పరిశీలనకు మరో వారం రోజు ల గడువు, ఆపై 45 రోజుల్లో సర్కార్‌కు నిధు లు చెల్లించడం ద్వారా క్రమబద్ధీకరణ అంటూ తొందరపెడుతున్నది. వాస్తవానికి మార్కెట్ విలువ అధికంగా ఉన్న భూములను రిజిస్ట్రేష న్ రేటును పరిగణనలోకి తీసుకుని 30 శాతం చెల్లిస్తే చాలని చెప్పడం, అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు పందేరం చేయడం ఏమిటి?
ఏ స్వలాభం ఆశించకుండానే సీఎం రేవంత్, ఆయన సర్కార్ ఇంతటి భూబాగోతానికి తెరతీసిందని నమ్మే అమాయకులు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. ఈసరికే లోపల్లోపల భూముల పందేరం జరుగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ భూముల్లో ఇప్పటికే చాలావరకు సీఎం సోదరులు, అనుయాయుల చేతుల్లోకి వెళ్లిపోయాయనే వాదన వినిపిస్తున్నది. ఈ తతంగమం తా జరిగిన తర్వాతే కొత్త పాలసీని తెచ్చారని అంటున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధి లోపలి పరిశ్రమలను బయటికి తరలించేందుకు ఈ పాలసీని తెచ్చినట్టు ప్రభుత్వం చెప్తున్నది. కానీ, ఇప్పటికే మూతపడిన పరిశ్రమలను, సజావుగానే నడుస్తున్న పరిశ్రమలను ఒకేగాటన కట్టడం ఏమిటి? మరోవైపు భూములను క్రమబద్ధీకరించుకునేవారు ఔటర్ పరిధి వెలుపల కచ్చితంగా పరిశ్రమలను నెలకొల్పి, ఉపాధి కల్పించాలనే షరతు ఏదీ లేదు.
ఇదంతా గమనిస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తొందర తప్పితే, పెద్దగా ప్రజా ప్రయోజనమేదీ ఈ వ్యవహారంలో కనిపించడం లేదనేది నూటికినూరు శాతం వాస్తవం. ధనవంతులు తమ సంపదకు కేవలం ధర్మకర్తలుగా భావించుకోవాలని, పేదప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని గాంధీజీ చెప్పారు. సొంత ఆస్తి గురించే అంత జాగ్రత్త అవసరమైనప్పుడు ప్రజల ఆస్తి విషయంలో ప్రభుత్వం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ప్రభుత్వ భూములంటే ప్రజల ఉమ్మడి ఆస్తి. అడ్డగోలుగా అమ్మి, ప్రైవేట్ ట్యాక్స్‌లు వేసి కొల్లగొట్టడానికి అది ఎవరి జాగీరూ కాదు!