ప్రళయాన్ని సృష్టించిన ఉద్యమ నేత కేసీఆర్ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ప్రతీ సన్నివేశాన్ని, సంఘటననూ దగ్గరగా వీక్షించిన మనం.. ఇప్పుడు సార్ మౌనాన్ని తదేకంగా చూడాల్సి వస్తున్నది. సార్ మౌనం వెనుక వ్యూహం ఉంటుందని అందరికీ తెలుసు. మౌనం ఉద్దేశపూర్వకంగా నొక్కి చెప్పే తపస్సు. మౌనంగా ఉండటమే ఉత్తమమని చాలా సందర్భాల్లో చాలామంది చెప్తుంటారు. భావోద్వేగాలను అణచిపెట్టడం, తగాదాలను తప్పించడం, పరిస్థితులను చక్కబరిచేందుకు మనసుకు విశ్రాంతి అవసరం. పరిపక్వత గల రాజకీయాల్లో అటు వ్యూహాత్మక ఉద్వేగం, ఇటు ఆలోచనాత్మక మౌన వ్యూహాన్ని పాటించడం చాలా అరుదు. సమకాలీన భారతదేశ రాజకీయాల్లో అలాంటి వారు ఇప్పుడెవ్వరూ లేరు, ఒక్క కేసీఆర్ మినహా.
సమయం, సందర్భంతో దేశ రాజకీయాలను ఒక్కటి చేసిన కేసీఆర్ నాడు ఉద్యమాన్ని నిర్మించి రాష్ర్టాన్ని సాధించినా.. నేడు ఆ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతున్న ఆందోళన, ఆవేదన ఉన్నా వ్యూహాత్మక మౌన వైఖరిని అనుసరిస్తుండటం రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ రెండింటిని సమానంగా, ధైర్యంగా ఎదుర్కోగల ఏకైక నేత కేసీఆర్. ఏడు పదుల వయసు దాటిన పెద్దాయన ఆదర్శప్రాయ రాజకీయ జీవితం గురించి ఎంత చెప్పినా, ఎన్ని పుటలు రాసినా తక్కువే. ఈ సమయంలోనే కేసీఆర్ స్థిత ప్రజ్ఞత చర్చకు వస్తున్నది. మానవాళి కోసం గరళాన్ని మింగిన శివుడిలా.. ప్రజల కోసం అవమానాలను భరిస్తూ తెలంగాణ పరిరక్షణకు, కాంగ్రెస్ పాలకుల నుంచి విముక్తి పొందేందుకు మౌనాన్ని ఓ యజ్ఞంలా వ్యూహాత్మకంగా చేపడుతున్నారని గ్రహించాలి.
ప్రముఖ కవి శ్రీరత్నాకరం బాలరాజు తన ‘ధమ్మపదం’ పుస్తకంలో ఇలా చెప్పారు… ‘చంద్రుణ్ణీ, హాలాహల విషాన్నీ, ఈశ్వరుడు గ్రహించినట్లు పండితుడు అందరి గుణాలనూ శిరసా శ్లాఘించి దోషాలను మటుకు కంఠమందే నిల్పుకుంటాడు.. బహిర్గత మొనరింపడు’ అని ‘గరళకంఠులు’ కానిదెవ్వరూ ఎప్పటికీ ఆధ్యాత్మిక విజ్ఞానులుగా విరాజిల్లజాలరు
పొక్కిలవుతున్న నేలలు, నెర్రెలు బారిన పొలాలు, పల్లెల్లో ఎన్కౌంటర్ల రక్తపాతం, బతుకుదెరువు కోసం వలస వెరసి జీవన వ్యవస్థే ఛిద్రమైన నాటి దుస్థితిపై పోరాటం చేసి, రాష్ట్రమొస్తే అన్నింటికి పరిష్కారమని దిశ చూపిన ధీశాలి కేసీఆర్. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచీచెడులను, కష్టసుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపిన దార్శనికుడు. ఆరున్నర దశాబ్దాల పోరాటం, మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, త్యాగాలు, బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు, ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష ఫలితంగా ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారమైంది. ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కృతమైంది. ఆయన హయాంలోనే పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతిరథం పరుగులు తీసింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి ఐటీ ఎగుమతుల వరకు రికార్డులు బద్దలయ్యాయి. సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేశారు. గుండెల నిండా ‘జై తెలంగాణ’ నినాదంతో మన భాషకు పట్టం గట్టారు. మన బతుకమ్మ, మన బోనాన్ని సగర్వంగా తలకెత్తుకునేలా చేశారు. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న గడ్డ మీదనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని అంబరాన్నంటేలా ఎత్తుకున్నారు.
‘యస్య కృతం న జానంతి మంత్రం వా మాత్రితం పరే
కృతమేవాస్య జానంతి సవై పండిత ఉచ్యతే!’
నాయకుడు లక్ష్య సాధనకు తనదైన మార్గాన్ని ఎంచుకుంటాడు. తనవైన వ్యూహాల్ని అమలు చేస్తాడు. తను సమీకరించుకున్న బలగాన్ని మోహరిస్తాడు. అంతిమంగా అనుకున్నది సాధిస్తాడు. ఇదే విషయాన్ని ఇంగ్లిష్లో.. మిషన్, విజన్, వాల్యూస్, విక్టరీగా సంక్షిప్తం చేయవచ్చు. తెలంగాణ ఉద్యమ జెండాను భుజానికి ఎత్తుకునే సమయానికి.. కేసీఆర్ ఒక ఒంటరి అంకె. అయితేనేం, తనకంటూ ఓ మిషన్ ఉంది. స్పష్టమైన విజన్ ఉంది. అందుకే ఓ ప్రజా నాయకా.. నిండు నూరేండ్లు వర్ధిల్లు.. విజయీభవ.. పునర్వైభవ.. అధికార ప్రాప్తిరస్తు..