ఏ ప్రభుత్వమైనా ఒక జీవో రూపొందిస్తున్నదంటే, రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 17 మాత్రం కొందరు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ పెద్దల అనుచరులు, కొందరు అధికారులు కలిసి రహస్యంగా స్టార్ హోటల్లో కూర్చొని రూపొందించారు. ఈ జీవో వల్ల అక్షరాలా 10 వేల మంది పేద వర్గాల జీవితాలు రోడ్డున పడనున్నాయి. పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను సంపదకు దూరం చేయాలన్న కుట్ర, ఈర్ష్యతో, ప్రభుత్వ అవకాశాలు అందరికీ అందకుండా, ధనికులనే మరింత ధనికులుగా మార్చడం కోసం కమీషన్ల దందాకు రెడ్ కార్పెట్ వేయడానికి, పేదలు పారిశ్రామికవేత్తలుగా ఎదగకుండా అడ్డుకోవడానికే సర్కార్ ఈ జీవోను తీసుకొచ్చింది. ఈ జీవోతో సుమారు రూ.2 వేల కోట్ల కుంభకోణానికి కుట్ర పన్నినట్టు స్పష్టమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, పాఠశాల విద్యార్థులకు నిత్యావసర వస్తువులు అందించేందుకు జీవో నంబర్ 17 పేరిట నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇదివరకే సదరు జీవో అసంబద్ధంగా ఉందంటూ, అందులోని కొన్ని అంశాలను మార్పు చేయాలని సూచిస్తూ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పును ఖాతరు చేయకుండా, పేద వర్గాల అభివృద్ధికి కట్టుబడకుండా, ముఖ్యంగా స్థానికులకు అన్యాయం చేసే విధంగా అదే జీవో ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఉత్తర్వులు తెచ్చిందో, ఏ వర్గాల వారికి కాంట్రాక్టులు ఇవ్వాలని కోరుకున్నదో, ఎవరి జేబులు నింపుకోవాలని ముందుచూపుతో ఆలోచించి, ఎవరికి కాంట్రాక్టులు ఇస్తే కమీషన్లు వస్తాయో వారినే స్వయంగా పిలిచి స్టార్ హోటల్లో కూర్చోబెట్టి, వారితోనే టెండర్ నోటిఫికేషన్ నిబంధనలు తయారు చేయించి, మొదటగా రేవంత్‌రెడ్డి చేతిలోని విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువరించారో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ పెద్దలు ప్రణాళికాబద్ధంగా, కుట్రపూరితంగా పేద వర్గాలవారికి కాంట్రాక్టులు రాకుండా, సుమారు రూ.2 వేల కోట్ల కుంభకోణం చేయడానికి తెరతీశారు. అందుకోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తమ అవకాశం, వాటా కోల్పోతే ఇక ఏ ప్రాజెక్టులోనూ, ఏ కాంట్రాక్టులోనూ పేద వర్గాలకు చోటు దక్కదు. పేద వర్గాలు కనీసం టెండర్ వేయడానికి కూడా సాహసించకుండా, అప్లికేషన్ ఫీజు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు విధించారు. గత ప్రభుత్వ కాలంలో టెండర్ అప్లికేషన్ కేవలం రూ.500 లేదా రూ.1,000 లోపు పూర్తయ్యేది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, యూనిఫాం క్లాత్ టెండర్ దక్కాలంటే రూ.250 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ అయి ఉండాలి. అంతేకాకుండా రూ.5.96 కోట్ల ఈఎండీ, రూ.14.90 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేయాలంటే రూ.150 కోట్ల టర్నోవర్ కావాలంట, పిల్లలకు స్కూల్ బ్యాగ్, షూ, టై, బెల్ట్ పంపిణీ చేయడానికి రూ.11.40 కోట్ల విలువైన సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలంట.
ఈ నిబంధనలన్నీ ఎవరి కోసం? వీటన్నింటికీ ఎవరు అర్హులు? పేదలకు కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీలు ఉన్నయా? ఎవరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 17 తెచ్చింది? ఈ జీవో ప్రకారం, కాంట్రాక్టుల్లో మహిళ, గిరిజన సహకార సంఘాలకు అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నా, అది కేవలం కాగితాలకే పరిమితమైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పదేండ్ల పాలనలో ప్రభుత్వం గురుకులాల కాంట్రాక్టర్లను కంపెనీ టర్నోవర్, సెక్యూరిటీ డిపాజిట్ అడగలేదు. ఈఎండీలో 40 శాతం రాయితీ కల్పించారు, బ్యాంక్ సాల్వెన్సీ సర్టిఫికెట్ అడగలేదు. ప్రతి గురుకుల పాఠశాలలో కోడిగుడ్లు, కూరగాయలు, కిరాణా సామాను, చికెన్, మటన్ వంటి సరుకుల పంపిణీ కోసం పేద వర్గాలకు చెందిన వారికి అవకాశాలు కల్పించింది. సుమారు 10 వేల మంది కాంట్రాక్టర్లుగా ఆత్మగౌరవంతో నిలదొక్కుకునేలా సహకరించింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడానికే అధిక ప్రాధాన్యతనిచ్చింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలు గాలికొదిలేసి, కమీషన్ల కోసం పాకులాడుతున్నది. రాష్ర్టాన్ని, జిల్లాను యూనిట్‌గా తీసుకొని ఒక్కరికే అన్ని గురుకులాలకు సంబంధించిన కాంట్రాక్టును కట్టబెట్టాలని చూస్తున్నది. దీంతో నష్టపోయేది విద్యార్థులు, లాభపడేది కాంట్రాక్టర్లు, కమీషన్లు తీసుకొనే ప్రభుత్వ పెద్దలు.
గతంలో కాంట్రాక్టర్లుగా పనిచేసిన 10 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 17 వల్ల తమకు నష్టం జరుగుతుందని, దానిని రద్దు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, సాంఘిక సంక్షేమశాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కాంట్రాక్టర్లందరూ కలిసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు నమ్మబలికారు.
కానీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించడం మానేసి, ఉన్న అవకాశాలను కూడా పేద ప్రజల నుంచి లాగేసుకుంటున్నారు. ఫలితంగా 10 వేల మంది పేద కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులో కూడా ఒక్క ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ లేరు. పేద ప్రజలకు రావలసిన వాటా కోల్పోయారు. ఆ సొ మ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, గురుకులాల్లో ఇప్పటికే సుమారు 130 మంది విద్యార్థులు ప్రాణాలు వదిలారు. వేలాది మంది కలుషితాహారం బారినపడి దవాఖాన పాలయ్యారు. తిరిగి ఇపుడు జీవో నంబర్ 17 ప్రకారం దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడితే, వారికి విద్యార్థుల పట్ల సానుభూతి, ప్రేమ ఉండదు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసి, పర్యవేక్షణను గాలికొదిలేస్తారు.
దీనివల్ల తిరిగి విద్యార్థులు నానా బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే సమాన అవకాశాల విలువలను కాలరాస్తున్న, పేద కాంట్రాక్టర్ల కడుపు కొడుతున్న, విద్యార్థులకు ఇబ్బంది పెట్టే ఆ జీవోను రద్దు చేయాలి. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలు పరుస్తూ, అన్ని వర్గాల ప్రజలకు కాంట్రాక్టుల్లో అవకాశాలు కల్పించాలి. తెలంగాణ స్థానికులకు మాత్రమే కాంట్రాక్టులు ఇవ్వాలి. కమీషన్ల కోసం కక్కుర్తి పడి, సాధారణ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగంలేని జీవోలను రూపొందించి, అప్రకటిత డిక్లరేషన్‌ను అమలు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలి.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్