రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యతో పాటు ఐటీఐ, ఏటీసీ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వ నిర్ణయంతో పాలిటెక్నిక్‌తో పాటు ఐటీఐ, ఏటీసీ కాలేజీలు స్కిల్ యూనివర్సిటీ కిందకు, ఉద్యోగులంతా శక్తి శాఖ పరిధిలోకి వెళ్లనున్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యను సాంకేతిక విద్యాశాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనలు, ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 59 ప్రభుత్వ, 54 ప్రైవేట్ కళాశాలల్లో దాదాపుగా లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపుగా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులే అధికం. అందులో ఎక్కువ శాతం బాలికలే. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యూనివర్సిటీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాడల్‌లో నడుస్తుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను, కోట్ల విలువ చేసే కళాశాలల భూములు సహా, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ మాడల్‌లో నడిచే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ పరిధిలోకి నెట్టడం వెనుక కార్పొరేట్ ప్రయోజనాలు దాగున్నాయి. 15 మందితో ఈ యూనివర్సిటీ బోర్డు ఏర్పాటు చేయగా, అందులో ఏడుగురు మల్టీనేషనల్ కంపెనీల యజమానులు ఉన్నారు. దీనికి చాన్స్‌లర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి, చైర్మన్‌గా మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్ర ఉన్నారు. ఈ యూనివర్సిటీకి నిధులు ప్రభుత్వం, కార్పొరేట్ నిధులతో పాటు బ్యాంకులు, కార్పొరేషన్ ద్వారా సమకూరనున్నాయి.
ఫీజుల విషయానికొస్తే బయట కోర్సుల కంటే అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న యూనివర్సిటీ కనుక నిధులు లేకుంటే ఆ భారం విద్యార్థుల మీద పడనున్నది. ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తే రానున్న రోజుల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. పాలిటెక్నిక్ విద్యార్థులకు పోరాటం కొత్తకాదు. దేశంలో జరిగిన అనేక సామాజిక, రాజకీయ పోరాటాల్లో అగ్రభాగాన నడిచి పోరాటం చేశారు. మండల్ కమిషన్, కమండల్ గో బ్యాక్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. 1980వ సంవత్సరంలో పాలిటెక్నిక్ విద్యార్థులు 100 రోజులు పాటు చారిత్రక సమ్మె చేసి వారి సమస్యలను పరిష్కారం చేసుకున్నారు. ఆ పూర్వ విద్యార్థుల పోరాట వారసత్వాన్ని ఇప్పటి విద్యార్థులు పుణికిపుచ్చుకొని నేడు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల పోరాటం ఉధృతం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యానిపుణులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరుపాలి.