ఋగ్వేద విద్యాసంపన్నులు, కవిపండిత ప్రవరులు, రాజకీయవేత్త, దుందుభి కావ్యకర్త గంగాపురం హనుమచ్ఛర్మ శతజయంతి వత్సరమిది. క్రీ.శ.1925 సెప్టెంబర్ 29వ తేదీన పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం వేపూరులో ఆయన జన్మించారు. కల్వకుర్తి మండలం గుండూరులో స్థిరనివాసం ఏర్పర్చుకొని రెండుసార్లు గుండూరు, లింగసానిపల్లి గ్రామపంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్‌గా, గుండూరు ప్రత్యేక గ్రామ పంచాయతీకి ఒకసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. స్వాతంత్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు.
హనుమచ్ఛర్మ మార్చాల, పొలుమూరుల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. చినమరూరులో వేంకటనరసింహ శాస్త్రి వద్ద సంస్కృతం, రఘువంశాదులు నేర్చుకున్నారు. కరివెనలో పరుశురామశాస్త్రి వద్ద కావ్య నాటకాలు, మంకాల కృష్ణశాస్త్రి వద్ద పాణినీయ వ్యాకరణం నేర్చుకున్నారు. ఋగ్వేదం గురుముఖతః నేర్చుకున్నారు. 60-70 సంవత్సరాలకు పూర్వమే హరిజన ఇండ్లల్లో పెండ్లిళ్లు, సత్యనారాయణ వ్రతాలను చేయించి అస్పృశ్యతా నివారణను అక్షరాలా ఆచరించిన ఆదర్శప్రాయుడు హనుమచ్ఛర్మ.
గుండూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను, మాధ్యమిక పాఠశాలగా, తరువాత ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్ది వాటి భవనాల నిర్మాణానికి అహర్నిశలు పాటు పడ్డారు. గ్రామంలోని మాదాయ చెరువును నీటితో నింపటానికి చిన్నవాగు (ధీమతి)పై ఆనకట్టను నిర్మించి కాలువ ద్వారా నీటిని తెప్పించడంలో ఆయన కృషి మరువలేనిది. హనుమచ్ఛర్మ దుందుభి (డిండి) నదిపై అదే పేరుతో రాసిన కావ్యం సుప్రసిద్ధం. ఈ ప్రాంత చరిత్ర, రాజులు, కవి పండితులు, కళాకారుల చరిత్రలను ఆయన అందులో లిఖించారు. ఇది ముద్రణకు పూర్వమే బహుళ ప్రజాదరణ పొందినది. 1961లో ప్రథమ ముద్రణ పొందింది. 1990లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ప్రీ డిగ్రీ కోర్సుకు ఎంపికైనప్పుడు రెండోసారి ముద్రితమైంది. తృతీయ ముద్రణను విజ్ణాన సరోవర ప్రచురణలో భాగంగా కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి ముద్రించారు. గత కొంతకాలంగా ఈ కావ్యం తెలంగాణలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాఠ్యాంశంగా ఉంది. 2017లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో శర్మ మోనోగ్రాఫ్ను ప్రచురించారు.
1997లో వీరి స్మారకంగా మాజీ మంత్రి, ఎంపీ పి.రాములు అధ్యక్షతన గుండూరు గ్రామప్రజలు ‘గంగాపురం హనుమచ్ఛర్మ స్మారక సమితి’గా ఏర్పడి ఆయనపై స్మారక సంచికను ముద్రించారు. ఇందులో ముద్రిత కావ్యం దుందుభితో పాటు ఆయన ఖండికలు, బహుముఖ ప్రజ్ఞావిశేషాలు, సమాజ సేవ, మిత్రుల వ్యాసాలు, కల్వకుర్తి ప్రాంత చరిత్ర మొదలైనవి వేశారు. మహబూబునగర్ జిల్లాలో ఒక కవిపై వచ్చిన మొట్టమొదటి స్మారక సంచిక ఇదే.
ఋగ్వేద విజ్ఞానం గ్రంథాన్ని శర్మ తన చిన్నాన్న గంగాపురం నృసింహ దీక్షితులుతో కలిసి 1967లో రచించారు. దీన్ని సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన విజ్ణానవర్ధనీ ప్రచురణల సంస్థ ముద్రించింది. హనుమచ్ఛర్మ కేవలం సాహిత్య రంగానికే పరిమితమై ఉండి ఉంటే మరికొన్ని రసవద్రచనలను అందించగలిగేవారు. చిన్ననాటి నుంచి ఉద్యమాలు, ప్రజాసేవ పట్ల ఉన్న ఆసక్తి కారణంగా సాహిత్యంపై ఎక్కువ దృష్టి నిలపలేకపోయారు. శర్మ ఏర్పాటుచేసిన పాఠశాలలో చదివిన ఎందరో నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఆయన ప్రభావంతో ఎందరో స్వచ్ఛంద కార్యకర్తలు తయారై గ్రామ స్వరాజ్యసిద్ధికి కృషిచేశారు.
కల్వకుర్తిలో బాపూజీ గాంధీ హాస్టల్ సురభి శర్మ, మంద లింగారెడ్డి, నామముత్యాలుతో కలిసి నిర్వహించారు. ఆ రోజుల్లో ఇప్పటి లాగా ప్రభుత్వం హాస్టళ్లను నిర్వహించేది కాదు. ప్రభుత్వం నుంచి ఎప్పుడో కొంత గ్రాంట్ అందేది. అది సరిపోయేది కాదు. దాని కోసం విరాళాలు సేకరించి హాస్టల్ నడిపేవారు. దానితో పాటు అదే హాస్టల్లో ఆయన స్వచ్ఛంద ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. శర్మ దుందుభి కావ్యకర్తగానే గాక ఈ విధంగా సార్వజనీన కార్యక్రమాల ద్వారా సుప్రసిద్ధులయ్యారు. ఆయనలో ఉన్న జాతీయ భావన, స్వతంత్రతా జీవన సరళి చివరి వరకు చెక్కుచెదరలేదు. 1996 ఆగష్టు 15న పరమపదించారు.