రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మత్స్యకార కుటుంబాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే, మత్స్యరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ప్రభుత్వం దాదాపు దశాబ్ద కాలంపాటు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అమలుచేసింది. అయితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఇరువై నెలల కాలంలో రెండు దఫాలుగా అమలుచేయాల్సిన ఉచిత చేపపిల్లల పంపిణీలో ప్రదర్శిస్తున్న తీరు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా దీనికి తోడుకావడంతో మత్స్యరైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అవినీతికి ఆస్కారం కలిగి ఉన్న చేపపిల్లలు, రొయ్యపిల్లల అంశాల జోలికిపోమని స్వయంగా మత్స్యశాఖ మంత్రిప్రకటిస్తే, ఆ రెండు అంశాలు టెండర్ నోటిఫికేషన్లో ప్రత్యక్షం కావడం చేపల మంత్రి ప్రకటించిన ‘పారదర్శకత’ అంశం ‘నేతి బీరకాయలోని నెయ్యి’లాగా అపహాస్యానికి ఆస్కారం కలిగిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు, దాని అనుబంధ జలాశయాలు మండు వేసవిలోనూ నిండుగా జలకళతో కళకళలాడేవి. దీంతో చేపల పెంపకానికి అత్యంత అనువైన పరిస్థితులను మత్స్యరంగం అనుభవించింది. ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిపోయి, మత్స్యకారుల ఆదాయాల్లో వృద్ధిరేటు కనిపించింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులను నిరుపయోగంగా మార్చివేసింది. అంతేకాదు, ఎత్తిపోతలను నిర్వహించకపోవడంతో గోదావరి నీటితో చెరువులను నింపే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించలేదు. దానికితోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పది పర్యాయాలు అమలుచేసిన ‘ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం’ గత సంవత్సరంలో పాక్షికంగానే అమలుచేయడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులన్నీ తెగిపోయి చేపలన్నీ వరదల్లో దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోవడంతో రాష్ట్రంలోని మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలా, వద్దా అనే మీమాంసలోనే పుణ్యకాలం గడచిపోయింది. ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఎదుర్కొన్న ఆర్థికమాంద్యం, తదితర కారణాల వల్ల రాష్ట్రంలో ‘ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం’ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం జల వనరుల్లో విడుదల చేసిన చేపపిల్లల పరిమాణంలో నాలుగో వంతు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది విడుదల చేయలేకపోయింది. రూ.34 కోట్ల రూపాయల విలువైన 28 కోట్ల చేపపిల్లలను మాత్రమే విడుదల చేసినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, ఈ చేప పిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు అణాపైసా కూడా చెల్లించకపోవడం విడ్డూరం. తాము సరఫరా చేసిన చేపపిల్లలకు సంబంధించిన బిల్లులు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. చేప పిల్లల కాంట్రాక్టర్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం కారణంగా ‘ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం’ అమలు విషయంలో కాంట్రాక్టర్లు ‘సహాయ నిరాకరణ’ పద్ధతులను పాటిస్తున్నారు.
అయితే, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మం త్రి వాకిటి శ్రీహరి ‘ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం’ అమలులో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు సంబంధించిన హస్తలాఘవ నైపుణ్యాలపై ముందస్తు అంచనాలు, అనుభవాలు లేనికారణంగా పదవిలోకి వచ్చీరాగానే ‘ఈ పథకాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా, అవినీతికి ఆస్కారంలేని పద్ధతుల్లో అమలుచేస్తామని గంభీరంగా ప్రకటించారు. అవినీతికి ఆస్కారం కలిగి ఉన్న 35-40 ఎం.ఎం. చిన్నసైజు చేపపిల్లలను, రొయ్యపిల్లలను పంపిణీ చేయబోమని, అన్ని చెరువుల్లోనూ పెద ్దసైజు (80-100 ఎం.ఎం.) చేప పిల్లలనే సరఫరా చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇందుకనుగుణంగానే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు పరిచేందుకు అవసరమైన రూ.122 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
తదనంతరం ఆర్థికశాఖ అనుమతులనూ సాధించినట్టు చెప్పారు. కానీ, మంత్రి చేసిన ప్రకటనకు, ఇందుకు సంబంధించి రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు విడుదల చేసిన టెండరు నోటిఫికేషన్‌కు పొంతన లేకుండాపోయింది. మంత్రి బహిరంగంగా చేసిన ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ప్రభుత్వపరంగా మత్స్యశాఖ డైరెక్టర్ పేరిట ఆగస్టు 18వ తేదీన విడుదల చేసిన టెండర్ నోటిఫికేషన్లో 35-40 ఎం.ఎం. చిన్నసైజు చేపపిల్లలు, రొయ్యపిల్లల సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. అవినీతికి ఆస్కారం కలిగి ఉన్న ఈ రెండు అంశాల జోలికిపోమని స్వయంగా మంత్రి ప్రకటిస్తే, ఆ రెండు అంశాలు టెండర్ నోటిఫికేషన్లో ప్రత్యక్షం కావడం మంత్రి ప్రకటించిన ‘పారదర్శకత’ అంశం ‘నేతి బీరకాయలోని నెయ్యి’లాగా అపహాస్యానికి ఆస్కారం కలిగిస్తున్నది.
రాష్ట్రంలోని 26,326 నీటివనరుల్లో 35-40 ఎం.ఎం. చిన్నసైజు, 80-100 ఎం.ఎం. పెద్దసైజు కలిపి రూ.93 కోట్ల 62 లక్షల ఖర్చుతో మొత్తం 84 కోట్ల 60 లక్షల చేప పిల్లలను, ఎంపిక చేసిన 300 పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో కలిపి రూ.28 కోట్ల 60 లక్షల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లలు ఈ సీజన్లో ‘ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం’ అమలులో భాగంగా విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చేపపిల్లలకు సంబంధించిన టెండర్లు జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. కాగా, రొయ్యపిల్లలకు సంబంధించిన టెండరు ప్రక్రియను మాత్రం రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లోని ‘మత్స్యభవన్’ కేంద్రంగానే నిర్వహిస్తారు. అందువల్ల ఈ రెండు ప్రక్రియలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్లు వేర్వేరుగానే విడుదల చేశారు. చేపపిల్లల పంపిణీ విషయంలో ఎదురయ్యే పోటీతత్వం, రొయ్యపిల్లల పంపిణీలో అవకాశం లేని కారణంగా రొయ్యపిల్లల పంపిణీ వ్యవహారం ‘ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం’ అమలులో మత్స్యశాఖ అధికారగణానికి ‘బంగారుబాతు’ వలె ఉపయోగపడుతున్నదనే విమర్శలున్నాయి. చేపపిల్లల పంపిణీ వ్యవహారంలో దాదాపు 50-60 శాతం అక్రమాలకు ఆస్కారం ఉంటే, రొయ్యపిల్లల సరఫరా విషయంలో 90 శాతానికి పైగానే అవకాశాలుంటాయని తెలుస్తున్నది.
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఒక సాధారణ ప్రభుత్వ పథకం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థాగత వైఫల్యం, అవినీతికి నిలువుటద్దంగా మారింది. లక్షల మందికి జీవనాధారం కావాల్సిన ఈ ప్రాజెక్టు, నేడు మంత్రుల ప్రకటనలకు, అధికారుల టెండర్ ప్రక్రియలకు మధ్య ఉన్న అగాథంలో కూరుకుపోయింది. అవినీతికి ద్వారాలు తెరిచే చిన్న చేపపిల్లలు, రొయ్యల పంపిణీని చేర్చడం ద్వారా ‘పారదర్శకత’ అనే పదం ఒక బూటకమని నిరూపితమైంది.
ఒక నిర్వహణా లోపమే కాదు;ఇది మత్స్యకారులకు జరిగిన ఘోరమైన ద్రోహం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి మత్స్యకారులు బలైపోతున్నారు. రొయ్యపిల్లల టెండర్లలో పోటీ లేకపోవడం, అది కొందరికే ‘బంగారు బాతు’లా మారడం, ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకాలు ఎలా ప్రైవేట్ లాభాలకు బలవుతాయో తెలియజేస్తున్నది.
చివరగా, ఈ సంక్షోభం ఒక చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ మత్స్యకార సమాజం ఇప్పుడు రెండు పోరాటాలు చేయాల్సి వస్తున్నది. ఒకటి, మానవ నియంత్రణ సాధ్యం కాని ప్రకృతి వైపరీత్యాలతో, మరొకటి, ఈ అవినీతితో నిండిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవస్థతో. పాలనలో నిజమైన మార్పు రానంతవరకు, ఈ పథకం దోపిడీకి ఒక సాధనంగా మిగిలిపోతుంది. లక్షలాది కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది. బహుశా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నది కూడా అదే!
(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్’ తొలి అధ్యక్షులు, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
-పిట్టల రవీందర్