జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన ప్రతిపాదనలకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదించింది. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. కమిటీ నివేదికను ఆమోదిస్తూ భారత ప్రభుత్వం అంగీకారం తెలిపేముందు ఉండాల్సిన ఏకాభిప్రాయాన్ని మోదీ సర్కార్ విస్మరించింది. ఇదెలా ఉన్నదంటే.. గుర్రం కంటే ముందే బండిని కొన్నట్టు ఉన్నది.
ఒకవేళ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గనుక బతికి ఉంటే.. సదరు కమిటీకి భారత మాజీ రాష్ట్రపతి నాయకత్వం వహించడం, ఏకకాలంలో పార్లమెంట్, రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆ కమిటీ సిఫారసులను కచ్చితంగా వ్యతిరేకించేవారు. ఆర్థిక వ్యయాలు, పరిపాలనా సౌలభ్యాలను మాత్రమే కారణాలుగా చూపుతూ కోవింద్ కమిటీ సమర్థిస్తున్న ఏకకాల ఎన్నికలు.. చట్టసభలకు ప్రభుత్వాల జవాబుదారీతనం విషయంలో ఇప్పటికే వేగంగా పడిపోతున్న ప్రమాణాలను ఏ విధంగా పెంచుతాయో వివరించలేదని ఆందోళన వ్యక్తం చేసేవారు. ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపే రాజ్యాంగ నిర్మాతలు మొగ్గుచూపారు. ఎందుకంటే, చట్టసభలకు ప్రభుత్వాలు జవాబుదారీతనంపై ఇది ఆధారపడి ఉంటుంది’ అని రాజ్యాంగ అసెంబ్లీలో అంబేద్కర్ పేర్కొన్నారు.
‘కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్ ఆఫ్ వన్ నేషన్, వన్ ఎలక్షన్’ పేరిట కమిటీ సభ్యుడు సుభాష్ కశ్యప్ సమర్పించిన పేజీలో ఉన్న ‘అధ్యక్ష, పార్లమెంటరీ వ్యవస్థల కలయిక భారత రాజ్యాంగం’ అన్న విషయం ఆశ్చర్యం కలిగించింది. అంబేద్కర్ పేర్కొన్న జవాబుదారీతనం అనే అంశానికి ఇది పూర్తి విరుద్ధం. గత పదేండ్ల మోదీ పాలనలో పార్లమెంట్‌కు ప్రభుత్వ జవాబుదారీతనం పూర్తిగా క్షీణించింది.
అన్నదాతలను సంప్రదించకుండానే రైతు చట్టాలను చేసి, వాటిని ఉభయసభల్లో ఏకపక్షంగా ఆమోదించడమే (అది కూడా వాయిస్ ఓటింగ్ పద్ధతిలో) అందుకు నిదర్శనం. 2014-24 మధ్యకాలంలో ఆమోదం పొందిన పలు బిల్లులను పరిశీలించవద్దని పార్లమెంటరీ కమిటీలకు మోదీ సర్కార్ ఆదేశించడం దిగ్భ్రాంతికరం. ఈ నేపథ్యంలో చట్టసభలకు ప్రభుత్వం జవాబుదారీతనం విషయంలో రోజురోజుకు పాతాళంలోకి పడిపోతున్న ప్రమాణాలను ఏకకాల ఎన్నికలు ఎలా పెంచుతాయన్న అంశాన్ని కోవింద్ కమిటీ వివరించలేదు. ఇంకా చెప్పాలంటే ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది.
ఈ అంశానికి సంబంధించి ఏమైనా సిఫారసులు ఉన్నాయేమోనని వెతకగా.. ఒక్కటి కూడా కనిపించలేదు. రాజ్యాంగ రక్షణకు పాటుపడతానని ప్రమాణం చేసి, దేశంలోని అత్యున్నత పదవిని అధిష్ఠించిన ఒక మాజీ రాష్ట్రపతి నేతృత్వం వహించిన కమిటీ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అతి కీలకమైన ఈ అంశాన్ని విస్మరించడాన్ని చూసి అంబేద్కర్ కూడా ఆందోళన చెందేవారు. సంప్రదింపుల పేరిట కమిటీ కలిసినవారిలో ఏ ఒక్కరూ ‘జవాబుదారీతనం’ అంశాన్ని లేవనేత్తలేదు. అంతేకాదు, అవిశ్వాస తీర్మానంపై ఈ కమిటీ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం గమనార్హం. ఒకచోట తప్పుబట్టిన కమిటీ.. ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సభ్యుడి హక్కు మాత్రమే కాదు, తన బాధ్యత కూడా’ అని మరో చోట పేర్కొన్నది.
అవిశ్వాస తీర్మాన నిబంధనను సవరించాలని లోక్‌సభ మాజీ జనరల్ సెక్రెటరీ సుభాష్ సీ కశ్య ప్ సూచించారు. అవిశ్వాస తీర్మానంలోనే తదుపరి ప్రభుత్వాధినేత ఎవరనేది కూడా సూచించాలని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. దీనికోసం రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదని, చట్టసభల నిబంధనలను సవరిస్తే సరిపోతుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఎంతో సున్నితమైన ఈ సూచనను జర్మనీ రాజ్యాంగం నుంచి కశ్యప్ తీసుకున్నట్టు తెలుస్తున్నది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు ప్రధాన లక్షణమైన ‘జవాబుదారీతనం’ క్షీణతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, దాన్ని కోవింద్ కమిటీ ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. అంతేకాదు, అంబేద్కర్ దార్శనికతను, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రాతిపదికను ఇది పూర్తిగా తుంగలో తొక్కింది. అందువల్ల ఈ నివేదిక తిరస్కరణకు అర్హమైనదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
(‘ది వైర్’ సౌజన్యంతో)
ఎస్ఎన్ సాహు