తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుణ్యమే. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం బలహీనుల పక్షం వహించాలనడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. అంబేద్కర్ విశ్వమానవుడు, విప్లవం యొక్క చిహ్నం” అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. అంబేద్కర్ పట్ల కేసీఆర్ విశ్వాసాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయలేదు. అంబేద్కర్ కలలుగన్న అణగారిన వర్గాల అభ్యున్నతిని ఆచరణలో చూపించారు. హైదరాబాద్ నడిమధ్యన 36 ఎకరాల స్మృతివనంతో దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న ఆవిష్కరించారు. ఇది దళితులు, బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. దీనిని స్ఫూర్తిగా తీసుకొని విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2024 జనవరి 19న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
హైదరాబాద్ సచివాలయం సమీపంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘ఇది విగ్రహం కాదు. ఒక విప్లవం. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీయమైనది. అణగారిన వర్గాల ఆశాదీపం అంబేద్కర్. ఎవరో డిమాండ్ చేస్తే ఈ విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఈ విగ్రహం ఏర్పాటులో ఒక బలమైన సందేశం ఉన్నది’ అని అన్నారు. అంతే కాదు కేసీఆర్ నాయకత్వంలోని అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఆర్థికంగా వెనుకబడిన దళితులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాని పరిస్థితుల్లో, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా దళితులు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ‘దళితబంధు’ పథకం కింద బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.10 లక్షలు ఇచ్చే పథకం ప్రారంభించారు.
కేవలం ప్రారంభించడమే కాదు దాదాపు 38,600 కుటుంబాలకు రూ.10 లక్షల దళితబంధు సాయం అందించారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ దళితబంధు గురించి మాట్లాడుతూ ‘దేశమంతటా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుంది. ఇది దళితులకు దక్కిన గౌరవం’ అని ఆశాభావం వ్యక్తంచేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, దళితబంధు పథకంతోనే కేసీఆర్ ఆగిపోలేదు. హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం’ అని నామకరణం చేశారు. అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవానికి దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న దళితుల పట్ల కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ రూ.10 లక్షలు దళితబంధు ఇస్తే తాము రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నా కనీసం ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన దళితబంధును లబ్ధిదారులకు ఇవ్వకుండా రద్దు చేసింది. 125 అడుగుల విగ్రహాన్ని ఎవరూ సందర్శించకుండా తాళాలు వేసింది. రెండేండ్లుగా ఆ తాళాలను తీయడం లేదు. ఇది కేవలం అంబేద్కర్ మూర్తిని మూసేయడం కాదు. అంబేద్కర్ ఆలోచనలను, ఆయన స్ఫూర్తిని ప్రజల నుంచి దూరం చేయడం.
ఇది స్పష్టంగా అంబేద్కర్ ఆలోచనలకి వ్యతిరేకం.కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని ‘ఈ రాజ్యాంగం ఆత్మను కలిగి ఉన్నది. ఇది భారతదేశ సారాంశం’ అంటూ ర్యాలీలు, సభల్లో మాట్లాడతారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు బంధించారు? రాహుల్ చేతిలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నది. కానీ తెలంగాణలో మాత్రం అంబేద్కర్ మూర్తిని బంధించి ఆ స్ఫూర్తిని దూరం చేస్తున్నారు. ఇది స్పష్టమైన ద్వంద్వ వైఖరి కాదా? అంబేద్కర్ పేరును, ఆయన రాజ్యాంగాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొంటూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని బంధించడం ద్వారా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది.
రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతబట్టడం కాదు. ఎక్కడ తమ ప్రభుత్వం ఉన్నా అంబేద్కర్ ఆదర్శాలను, ఆలోచనలను, ఆశయాలను గౌరవించడం నేర్పాలి. ఇప్పటికైనా విగ్రహం తాళాలు తెరిచి, ఆయన సూర్తిని, ఆలోచనలను ప్రజలకు అందించాలి. అప్పుడే అంబేద్కర్‌ను గౌరవించినట్టు.
మహనీయుడు అంబేద్కర్‌ను మాత్రమే కాదు అమరవీరులతోపాటు తెలంగాణ తల్లి రూపాన్ని, తెలంగాణ అమరజ్యోతిని కూడా అవమానించింది, అవమానిస్తున్నదీ కాంగ్రెస్ సర్కార్. అధికారం కోసం అమరవీరుల కుటుంబాలకు అనేక హామీలు ఇచ్చింది. అధికారం వచ్చిన తర్వాత రెండున్నరేండ్లలో వాటిని అమలు చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా తీవ్రంగా వంచించింది. 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది కాల్పులలో మరణించారు. 2001 నుంచి జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ చేసిన కాలయాపన కారణంగా దాదాపు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. అధికారంలోకి వస్తే అమరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం, భార్య, తల్లి లేదా తండ్రి ఇతర కుటుంబ సభ్యులకు నెలకు రూ.25 వేల ఫించన్, అమరవీరుల కుటుంబాలతోపాటు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతోపాటు ఉద్యమ కారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీల అమలుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడడంలేదు.
ఒకవైపు అంబేద్కర్ విగ్రహాన్ని బంధించి ఆయనను ప్రజలకు దూరం చేస్తూ అమరజ్యోతి సందర్శనను నిలిపివేసి, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి అవమానించి, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వంచిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ ఆశయం సమానత్వం, స్వేచ్ఛ. కానీ ఆయన విగ్రహనికే తాళం వేస్తే ఆ స్వేచ్ఛ ఎక్కడున్నట్టు కేవలం ఆయన పేరును రాజకీయ లాభం కోసం దుర్వినియోగం చేయడమే. కానీ ఇది ఏ మాత్రం అంబేద్కర్‌ను గౌరవించడం కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరవకపోతే ఈ కాంగ్రెస్, రాహుల్‌గాంధీ ద్వంద్వ వైఖరులు చరిత్రలో కేవలం రాజకీయ హిపోక్రసీగా మిగిలిపోతాయి.
(వ్యాసకర్త: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్)
-డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్