‘అడవిలో పుట్టాం.. ఈ అడవంతా మాదే, రక్షకులం.. లబ్ధిదారులం మేమే’ అనుకునే తత్వం గిరిజనులది. కానీ, ‘అడవి సర్కారుది. కట్టె పుల్లలు, పశువులకు గడ్డి పరకలు తీసుకోవాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే’నని నిజాం ప్రభుత్వం హుకుం జారీచేసిన నాటినుంచే గిరిజనుల పోరాటం ప్రారంభమైంది.
‘మావ నాటే-మావ రాజ్’ మా గ్రామంలో మా రాజ్యం అన్న గిరిజనుల కోరికను కేసీఆర్ నెరవేర్చారు. ప్రతి గూడెం పంచాయతీగా మారింది. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గిరిజన పల్లెలూ మారుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఆడపిల్లలు సహా అందరికీ చదువంటే ఆసక్తి పెరిగింది.
కన్నతల్లి లాంటి అడవికి దూరమయ్యామన్న భావన కలిగింది. గోండు వీరుడు కుమ్రం భీమ్ ఆధ్వర్యంలో తిరుగుబాటు చేసేందుకు ఆ భావనే పురిగొల్పింది. ‘జల్-జమీన్-జంగిల్’ నినాదంగా మారింది. ఆస్ట్రియా దేశ సామాజిక శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి అధ్యయనం జరిపేలా చేసింది. అడవికి, గిరిజనులకు ఉన్న పేగు బంధాన్ని గుర్తించిన ఆయన తగిన సూచనలు చేయడంతో ప్రభుత్వాల వైఖరిలో కాస్త మార్పు వచ్చింది. పోడు చేసుకునే గిరిజనులకు భూములపై అలిఖిత హక్కులుండేవి. వ్యవసాయం చేసే రైతు కొద్దికాలం పాటు భూమిని విడిచిపెట్టినా మిగిలినవారు దాని జోలికి వెళ్లేవారు కాదు. మరీ ఎక్కువకాలం పాటు వ్యవసాయం చేయకపోతే దాన్ని ఉమ్మడి ఆస్తిగా పరిగణించేవారు.
గూడెం ప్రజలు కలిసి నిర్ణయాలు తీసుకునేవారు. భూముల విషయంలో తమదైన వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడం, పన్నులు వేయడంతో గిరిజనులు ఉద్యమించారు. ఇదే విషయాన్ని డార్ఫ్ అధికారుల దృష్టికితెచ్చారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేపట్టినా ప్రధాన కోరిక మాత్రం మారలేదు. భూమి సమస్య తీరలేదు. పశువులు మేపితే కేసులు.. వంటకు కట్టెలు ఏరుకున్నా దండనలు. వీటి పరిష్కారం కోసమే గిరిజనమంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. ఉద్యమనేత కేసీఆర్కు అండగా నిలబడింది. నాడు ఇచ్చిన హామీ నేడు సాకారం కానున్నది.
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం తేలికైన విషయం కాదు. వృక్ష సంపదకు నష్టం కలుగుతుందన్న భయాలను తక్కువగా అంచనా వేయకూడదు. అందుకే ప్రత్యామ్నాయంగా వృక్ష సంపద వృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. అదే హరితహారం పథకం. రోడ్డు పక్కన, ఖాళీ స్థలాలు.. ఎక్కడ వీలుంటే అక్కడ మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టింది. కలపనిచ్చే చెట్లు, ఫలవృక్షాలు అన్నింటికీ ప్రాధాన్యం ఇచ్చింది. ప్రత్యామ్నాయంగా అడవులే పెరుగుతున్నాయని గుర్తించిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. దాదాపు లక్షా యాభై వేల మంది రైతులకు సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమికి ఏక కాలంలో పట్టాలు అందజేయడం రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలుస్తుంది. గిరిజన వీరుడు కుమ్రం భీమ్ పేరుతో ఏర్పాటైన ఆసిఫాబాద్లో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 30న ఈ పట్టాలు అందజేస్తారు. ఉద్యమానికి బీజం పడిన ప్రాంతాన్నే ఇందుకు ఎంచుకోవడం విశేషం. గిరిజనుల జీవితాల్లో గుణాత్మక మార్పునకు ఇదో పెద్ద ముందడుగు వంటిది.
గతంలో పేదలకు భూములు పంపిణీ చేసినా భూమి ఎక్కడో చూపించలేదు. ఇప్పుడు ఎలాంటి లిటిగేషన్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లుచేస్తున్నారు. రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలను సమన్వయ పరిచారు. సరిహద్దు వివాదాలు లేకుండా గూగుల్ మ్యాపింగ్ చేశారు. భవిష్యత్తులో అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా పక్కగా సరిహద్దులు గుర్తించారు. వివాదరహిత భూములు దున్నుకొని ఇకనైనా గిరిజనులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే అవకాశం ఇన్నాళ్లకు కలిగింది. పొట్ట నింపుకోవడం కోసం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న పోడు వ్యవసాయాన్ని చేస్తూ ఏదో నేరం చేసినవారిగా ముద్ర పడ్డ గిరిజనులు ఇక తలెత్తుకొని తిరిగే పరిస్థితులు రానున్నాయి. దీంతో గిరిజనులు కూడా భూ యజమానులు కానున్నారు. పట్టాతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలన్నీ అమలవుతాయి. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. వడ్డీ వ్యాపారుల బెడద తగ్గుతుంది. తెలంగాణ దేనికోసం ఏర్పాటైందో ఆ ఆశయం నెరవేరుతుంది. దీంతో దశాబ్దాల గిరిజనుల పోరాటానికి తార్కిక ముగింపు లభించినట్టవుతుంది.
ప్రత్యేక తెలంగాణ వస్తే తీవ్రవాదం, నక్సలిజం పెరుగుతుందంటూ అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవన్నీ అపోహలని ఇప్పుడు తేలిపోయాయి. నక్సలిజం శాంతిభద్రతల సమస్య కాదని, కనీస సౌకర్యాలు, ఉపాధి కల్పిస్తే ఆ ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎవరికీ ఉండదన్న మాట నిజమని తేలింది. ప్రత్యేక తెలంగాణ రావడంతో వాస్తవానికి నక్సలిజం తగ్గిందని తేటతెల్లమైంది. ఉద్యమం ఏదైనా దాని అంతిమలక్ష్యం ప్రశాంత, గౌరవపద జీవనం గడపడం. ప్రభుత్వమే అందుకు మార్గం వేస్తున్నప్పుడు పోరు బాటలో వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? ఆశ్వీయుజ పున్నమి నాటికి గిరిజనులు కుమ్రం భీమ్ వర్ధంతిని జరుపుకొంటారు. అప్పటికి తలెత్తుకొని పెరిగే పంటలతో నేలతల్లి మరింత పచ్చగా ఉంటుంది. ఏమైనా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ లక్ష్యం సార్థకమవుతుండటం గర్వకారణం.
(వ్యాసకర్త: భారత రాష్ట్ర సమితి నాయకులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817