తెలంగాణలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పాలిట టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) శాపంగా మారింది. పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే పదోన్నతులకు టెట్ తప్పనిసరి అనే నిబంధన విధించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. గత 30 ఏండ్లుగా సేవలందిస్తూ పదవీ విరమణకు ఆరు నెలలు, సంవత్సరం గడువున్న ఎంతోమంది ఉపాధ్యాయులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం అసాధ్యం. రాష్ట్రంలోని ప్రతి శాఖలోని ఉద్యోగులు పదవీ విరమణ నాటికే నాలుగైదు పదోన్నతులు పొందుతున్నారు. ఉపాధ్యాయులు మాత్రం ఏ క్యాడర్లో ఉద్యోగంలో చేరుతున్నారో అదే క్యాడర్లో పదవీ విరమణ చేస్తుండటం శోచనీయం.
మూడు దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు టెట్‌ను అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన పెట్టడంతో ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. 50 ఏండ్లు పైబడిన వారు డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోయినా పదోన్నతులు ఇవ్వాలనే సడలింపు ఉందని టీచర్లు గుర్తుచేస్తున్నారు. ఆ సడలింపును అమలు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ ప్రాథమిక పాఠశాలల స్థాయి వేతనాలు తీసుకుంటూ భాషోపాధ్యాయులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. పాలకులు మారుతున్నా ఈ పరిస్థితిలో మార్పు రావడం లేదు. జీవోలు వస్తున్నాయి.. పోతున్నాయి గానీ పదోన్నతులు మాత్రం దక్కడం లేదు.
టెట్‌లో భాషలకు 30 మార్కులను మాత్రమే కేటాయించారు. మిగిలినవారు తమతమ సబ్జెక్టుల్లో టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనలు ఉన్నాయి. భాషోపాధ్యాయులు సాంఘిక శాస్త్రంలో 60 శాతం మార్కులు తెచ్చుకోవాలనడం సమంజసం కాదు. ఏపీలో భాషా పండిత వ్యవస్థను రద్దు చేశారు. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్లు బోధించాలనే నిబంధన ఉంది. భాషా పండితులకు పేపర్- 111లో తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యంలో 60 శాతం మార్కులకు టెట్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఆ నిబంధన లేదు. భాషోపాధ్యాయులకు ప్రత్యేక పేపర్ పెట్టాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శికి, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం చేకూరలేదు.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల అంశం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగుల వెనుకకు అన్నట్టుగా మారింది. పదోన్నతులు, బదిలీలనగానే వివిధ కారణాలను చూపుతూ ఉపాధ్యాయులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై పదోన్నతులు, బదిలీలు చేపడతామని చెప్పారు. విద్యా శాఖను స్వయంగా చూస్తున్న సీఎం ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపెడతారని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు.
డాక్టర్ ఎస్.విజయ భాస్కర్
92908 26988