2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అలవికానీ హామీలు ఇచ్చింది. వాటిలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చేయించిన వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రధానమైనది. ఇందులో రుణమాఫీ, రైతు భరోసా, క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ వంటివి ఎన్నో ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తయినా ఈ హామీలు అమలుకు నోచుకోకపోవడమే విడ్డూరం.
రుణమాఫీ వంటి హామీని అమలు చేశామని గొప్పలకు పోతున్న కాంగ్రెస్ పార్టీ దాని అమలు కోసం తెచ్చిన జీవోలో మాత్రం పారదర్శకతను పాతర పెట్టింది. ఆ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సేద్యం చేసిన రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రూ.2 లక్షల రుణమాఫీ అందాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో రేషన్‌కార్డు లేకపోయినా, కుటుంబంలో ఒక చిరుద్యోగి ఉన్నా, పింఛన్దారున్నా రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం విడుదల చేసిన జీవో సారాంశం. ఇలాంటి అర్థం పర్థం లేని నిబంధనల అమలు పేరుతో చాలామంది రైతులకు రుణమాఫీ అమలు కాలేదు. కొంతమందికి మాఫీ అయినా అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం శోచనీయం. అంతేకాదు, రుణమాఫీ జాబితాలో అవకతవకలు చోటుచేసుకోవడంతో, తర్వాత ఆ జాబితాను వెబ్సైట్ నుంచి తొలగించారు. అయితే, రాష్ట్ర రైతాంగం ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో ఎదురుచూడటం కారణంగా ఇటు రుణమాఫీ కాక, అటు వడ్డీలు, అపరాధ వడ్డీలు కలిసి ఇప్పుడు రుణం తడిసి మోపెడైంది. ఇదిలా ఉంటే రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులు నిబంధనల ఉచ్చులో చిక్కుకున్నారు. మాఫీ కాని ఈ రైతులు దాదాపు 25 శాతం ఉంటారు. కొన్ని గ్రామాల్లో ఆ శాతం ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నది. ఎన్నికల ప్రచారంలో భాగం గా అటు రాహుల్‌గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ పెద్దల వాగ్దానాలను నమ్మి అప్పు చెల్లించని, అప్పు తెచ్చుకున్న రైతులకు వడ్డీలు, అపరాధ వడ్డీలు వెరసి భారమవుతున్నాయి. వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
ఖరీఫ్ సీజన్లో రైతుబంధు రాకపోయినా, కనీసం రుణమాఫీ అయినా వస్తుందని ఎంతోమంది రైతులు ఆశపడ్డారు. అందుకే రైతు భరోసా రూ.15 వేలు అని చెప్పి, రూ.12 వేలకు కుదించి అమలుచేసినా రైతులు రుణమాఫీని దృష్టిలో పెట్టుకొని పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ, రేవంత్ ప్రభుత్వం మూడున్నర ఎకరాల లోపున్న రైతులకే ఇప్పటివరకు భరోసా వేయడం ఆక్షేపణీయం. రైతు భరోసా సేద్యం లేని భూములకు తొలగించినా ఫర్వాలేదు? కానీ, వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అనేకమంది రైతులకు రైతుభరోసా అందడం లేదు. ఒక సర్వే నెంబర్ బ్లాక్ చేస్తే కొన్నిచోట్ల ఆ సర్వే నెంబర్లోని సేద్యం చేసే మొత్తం భూమికి రైతు భరోసా అందలేదు. గతంలో రైతుబంధు పడిన ప్రతీసారి సంబంధిత రైతు ఫోన్‌కు ప్రభు త్వం తరఫున మెసేజ్ వచ్చేది. ఇప్పుడలాంటి పరిస్థితే లేదు. దీంతో ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం లోపం ఏమైనా ఉన్నదేమోనన్న అనుమానాలు రైతుల్లో రేకెత్తుతున్నాయి.
ఇక రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది కౌలు రైతులను రైతు భరోసాలో ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇక ధరణి వెబ్సైట్లో దొర్లిన తప్పులను సరిదిద్దడమనే అంశం ప్రధానమైనది. ఈ విషయంలో రెవెన్యూ శాఖ అనేక సమావేశాలు పెట్టి రైతుల నుంచి చాలా సమాచారం సేకరించింది. ఒక కమిటీ కూడా వేసి నివేదిక తీసుకున్నది. ఎప్పుడో, నిజాం కాలం నాడు ఇచ్చిన సర్వే నెంబర్లనే ఆధునిక ప్రభుత్వాలు వాడుతూ వచ్చాయి. అవే సర్వే నెంబర్లకు అక్షరాలు, అంకెలు, బై నెంబర్లను ఇచ్చి కాలం వెళ్లదీస్తున్నారే తప్ప సమగ్ర సర్వే జరిపి కొత్త నెంబర్లు ఇవ్వలేదు. భూమి పొజిషన్ ఉన్న రైతుకు రికార్డులో భూమి లేదు, రికార్డులో భూమి ఉన్న రైతు ప్రస్తుతం ఆ భూమి పొజిషన్లో లేడు. ఇలా చాలా సమస్యలున్నాయి.
కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘భూ మాత’ వెబ్సైట్ పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాల్లో కార్యరూపం దాల్చిందే తప్ప పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. తద్వారా రైతుల భూములకు రక్షణ కరువైంది. గ్రామస్థాయిలో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల హస్త లాఘవం ఈ భూముల విషయంలో పనిచేస్తున్నది. ఫలితంగా రైతులు తమ భూములు తాము సాగు చేసుకోవడం కోసం పోలీస్‌స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురించాయి. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాగ్దానం చేసిన విధంగా సమగ్ర భూ సర్వే ద్వారా రైతుల భూములను స్థిరీకరించాలి. అంతేకాదు, రుణమాఫీ, రైతు భరోసా విషయంలో భేషజాలకు పోకుండా రైతులకు సరైన న్యాయం చేయాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– ఎన్.తిర్మల్ 94418 64514