‘ఒక నియంతకు మాత్రమే విజ్ఞప్తి చేసుకునే స్థితిలో ప్రజలు ఉంటే, వారిముందు రెండే మార్గాలు మిగులుతాయి. ఒకటి తిరగబడటం, రెండవది ఆ క్రౌర్యానికి మౌనంగా బలైపోవడం’… ప్రముఖ ఫిలాసఫర్ ఎంగెల్స్ చెప్పిన ఈ మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 11 నెలల పాలనకు సరిగ్గా సరిపోతాయి. ఈ 11 నెలల కాలం తెలంగాణ ప్రజలకు పీడ దినాలేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే.. వందేండ్ల విధ్వంసానికి మార్గం వేస్తున్నట్టు కనిపిస్తున్నది.
కేసీఆర్ హయాంలో పదేండ్ల పాటు తెలంగాణ ప్రజలు స్వర్ణయుగాన్ని చూశారు. ప్రత్యేకించి, రైతులు రారాజులా జీవించారు. వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కేసీఆర్ అనేక వినూత్నమైన పథకాలను తీసుకొచ్చారు. రైతుబంధు, ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్తు, రైతు వేదికలు, మార్కెటింగ్ సదుపాయం కల్పించారు. తద్వారా ధాన్యం ఉత్పత్తి పెరిగి తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. వ్యవసాయం దండుగ అనే స్థితి నుంచి పండుగ అన్న స్థాయికి తీసుకువెళ్లడం కేసీఆర్ సాధించిన విజయం. కానీ, రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి.
రేవంత్ పాలనలో రైతుభరోసా, రుణమాఫీ నుంచి మొదలుకొని ధాన్యం కొనుగోళ్ల వరకు రైతులకు మోసమే ఎదురైంది. సవాలక్ష నిబంధనలు పెట్టిన రేవంత్ సర్కార్ రూ.31 వేల కోట్ల రుణమాఫీని రూ.17 వేల కోట్లకే పరిమితం చేసింది. 40 లక్షలకు పైగా అర్హులైన రైతులుండగా.. 22 లక్షల మంది రైతులకే మాఫీ చేసి చేతులు దులుపుకొన్నది. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వడం లేదు. రూ.500 బోనస్ ఏమోగానీ కనీసం ఎంఎస్పీ కూడా దక్కడం లేదు. కాళేశ్వరంపై అక్కసుతో పంటలను ఎండబెట్టారు. కరెంటు కోతలతో మోటర్లు కాలిపోతున్నయి. వైండింగ్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తామని చెప్పి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి బీఆర్ఎస్ పాలనను నిరంతరం రైతులకు గుర్తుచేస్తున్నారు.
100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని చెప్పి ఏడాది కావస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ.2500, పింఛన్ల పెంపు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం తదితర హామీల ఊసే లేదు. యువతకు ఇచ్చిన హామీల ఎగవేత నిరాటంకంగా కొనసాగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన ఉద్యోగాలకే నియామక పత్రాలిచ్చి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. గత డీఎస్సీకి కొన్ని పోస్టులు జతచేయడం తప్పితే కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. పైగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని నిరసన చేస్తున్న యువతపై లాఠీచార్జి చేయడం హేయం. యువతకు కొలువులు రాకపోగా.. కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ అప్పట్లో అశోక్‌నగర్ చుట్టూ తిరిగిన మేధావులకు మాత్రం పదవులు దక్కాయి. ఇప్పుడు వారు అటుదిక్కే చూడటం లేదు.
ఉద్యోగులది మరీ దారుణమైన పరిస్థితి. రాష్ట్ర చరిత్రలో తొలిసారి డీఏ ఇవ్వడానికి కమిటీ ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పెండింగ్ డీఏలు చెల్లిస్తామని వాగ్దానం చేసి, 11 నెలల తర్వాత ఒక డీఏ మాత్రమే ఇచ్చి సర్దుకోవాలని పాలకులు ప్రవచనాలు చెప్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన కొందరికే జీతాలు చెల్లిస్తూ అందరికీ ఇస్తున్నామని దబాయిస్తున్నారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన 7 వేల మంది ఉద్యోగులకు రావలసిన రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించడానికి వారికి చేతులు రావడం లేదు. అంతేకాదు, 11 నెలలుగా పీఆర్సీ కమిటీ కాల పరిమితిని పొడిగిస్తూనే ఉన్నారు. ఓపీఎస్ అమలుచేస్తామన్న వాగ్దానం కూడా అటకెక్కింది. హెల్త్‌కార్డుల ఊసే లేదు. ప్రభు త్వం నియమించిన కోదండరామ్, చిన్నారెడ్డిలకు మొన్నటివరకు ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇప్పుడు కేశవరావు రంగప్రవేశం చేశారు. దీంతో మళ్లీ పాత పాటే పాడాల్సి వస్తున్నది. అంగన్వాడీ, ఆశావర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర చిన్నస్థాయి ఉద్యోగుల వేతనాల పెంపు మాటే లేదు.
బీసీ రిజర్వేషన్లు అమలుచేయకుండా సర్వే పేరిట కాంగ్రెస్ సర్కార్ డ్రామా చేస్తున్నది. బడ్జెట్లో ఏటా బీసీల కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పిననాడే కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టమైంది. అంతేకాదు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది.
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తానంటూ ఆయన నెలకొల్పిన గురుకులాలను రేవంత్‌రెడ్డి విధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే గురుకులాల్లో వివిధ కారణాల వల్ల 50 మందికి పైగా విద్యార్థులు తనువు చాలించారు. అయినా సర్కార్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదు. గురుకుల వ్యవస్థను ఎత్తివేసి పేద పిల్లలకు విద్య అందకుండా చేయాలనే కుట్ర దీనివెనుక దాగి ఉన్నది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ హైడ్రామా షురూ చేసింది. పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూలుస్తూ వారిని నిరాశ్రయులను చేస్తున్నది. తద్వారా ప్రజలను, పరిశ్రమ వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నది. హైడ్రాపై వ్యతిరేకత వస్తుండటం, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో మూసీ పునరుజ్జీవం పేరిట మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. బ్యూటిఫికేషన్ పేరిట పెద్ద ఎత్తున లూటిఫికేషన్‌కు కాంగ్రెస్ పాలకులు సిద్ధమవుతున్నారు.
మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్‌కు ఒక ప్రణాళిక అంటూ లేనే లేదు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని
కమీషన్ల కోసం ఏకంగా రూ.లక్షన్నర కోట్లకు పెంచేశారు. మూసీని పరిరక్షించేందుకు బీఆర్ఎస్ సర్కార్ గతంలో నడుం బిగించింది. అందుకు ముందుగా మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం నీరుగారుస్తున్నది.
రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఆరు గ్యారెంటీల అమలుకోసం గొంతెత్తుతున్న కేటీఆర్, హరీశ్‌రావు తదితర బీఆర్ఎస్ నేతలపై దాడులే అందుకు నిదర్శనం. అంతేకాదు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న యువతపై కూడా దౌర్జన్యకాండ కొనసాగుతున్నది. అవినీతిని ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తూ రాజీలేని రణం చేస్తున్న కేటీఆర్, హరీశ్‌పై అక్రమ కేసులు పెట్టి, వారిని జైల్లో పెట్టాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే, లక్షలాది బైనాక్యులర్లతో వెతుకుతున్నా ఏమీ దొరుకకపోవడంతో ఒత్తిడికి గురై ఆయన తిట్ల దండకం అం దుకుంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన ఉద్యోగాలకే నియామక పత్రాలిచ్చి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. గత డీఎస్సీకి కొన్ని పోస్టులు జతచేయడం తప్పితే కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. పైగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని నిరసన చేస్తున్న యువతపై లాఠీచార్జి చేయడం హేయం. యువతకు కొలువులు రాకపోగా.. కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ అప్పట్లో అశోక్‌నగర్ చుట్టూ తిరిగిన మేధావులకు మాత్రం పదవులు దక్కాయి. ఇప్పుడు వారు అటుదిక్కే చూడటం లేదు.
11 నెలల రేవంత్ పాలనలో కూల్చివేతలు తప్ప, నిర్మాణాలు జరగలేదు. సంక్షోభం తప్ప, సంక్షేమం లేదు. విధ్వంసం తప్ప, వికాసం లేదు. అంధకారం తప్ప, అభివృద్ధి కానరావడం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను తిడితే తాను గొప్పవాడినవుతానని ఆయన భావిస్తున్నట్టున్నారు. భారతదేశ పటంలో తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్‌ను తిట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని అధికార మదంతో, అహంకారంతో రేవంత్ చేతులారా పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాగే మౌనంగా ఉంటే తెలంగాణ విధ్వంసానికి సాక్షులుగా మిలిగిపోతామని గ్రహించిన సబ్బండవర్గాలు పోరాటాలకు సమాయత్తమవుతున్నారు.
-(వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్)
– ( దేవీప్రసాద్ )