తెలంగాణ రైతుల అభిప్రాయాలను పక్కనపెట్టి ప్రభుత్వం కేవలం ఏడు సన్నరకాల వరి విత్తనాలకే ప్రాధాన్యత ఇవ్వడం రైతాంగంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నది. ఏ ప్రాంతంలో ఏ రకం విత్తనం మెరుగైన దిగుబడులు ఇస్తుందో, మార్కెట్లో ఏ రకానికి డిమాండ్ ఉన్నదో రైతులకే ఎక్కువ తెలుస్తుంది. నేల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలను బట్టి రైతులు పంటలను ఎంపిక చేసుకుంటారు. కానీ రైతుల స్వేచ్ఛను పరిమితం చేయడం అంటే వారి హక్కులను కాలరాయడమే. దశాబ్దాలుగా వివిధ రకాల విత్తనాలను సాగు చేస్తున్న రైతులను ఒకే విధానంలో బంధించడం వ్యవసాయ రంగానికి మేలు చేయదు. ప్రభుత్వ ఆంక్షల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.
సమైక్య రాష్ట్రంలో రైతుల కష్టాలు, కన్నీళ్లు, ఆత్మహత్యలు, సాగునీటి కొరత, విద్యుత్తు సమస్యలను ప్రత్యక్షంగా చూసిన నాటి ఉద్యమనాయకుడు కేసీఆర్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా వ్యవసాయ స్థిరీకరణ కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారు. అద్భుతమైన ప్రణాళికలను అమలు చేశారు. వ్యవసాయానికి జీవనాడిగా నిలిచే నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించారు. భూగర్భ జలాల పెరుగుదలకు, సాగునీటి లభ్యతకు దోహదపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించి, వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా ‘రైతు బంధు’ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం జమ చేసే విధానాన్ని అమలు చేశారు. ఏదైనా కారణంతో మరణించిన రైతు కుటుంబానికి ‘రైతుబీమా’ పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రైతుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, కల్పించిన ఆశలు ఆచరణలో కనిపించడం లేదు. రైతుబంధు స్థానంలో తీసుకొచ్చిన రైతుభరోసా విధానాలపై సందిగ్ధత నెలకొన్నది. పెట్టుబడి సాయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు, రైతులకు నమ్మకం లేదు. నాడు రైతు కుటుంబాలకు ఆపన్నహస్తంగా నిలిచిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ పాలకులు అటకెక్కించారు. కనీసం ప్రీమియం చెల్లించకుండా చోద్యం చూస్తున్నారు. ఇక అన్ని పంటలకు బోనస్ ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ హామీ బోగస్ అయింది. రైతులు యూరియా కోసం లైన్లలో చెప్పులుపెట్టి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి, మక్క, జొన్న, కందులు వంటి పంటల కొనుగోళ్లలో జాప్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పంటను విక్రయించేందుకు వారాలు, నెలల తరబడి ఎదురుచూస్తూ అన్నదాతలు కన్నీటి కష్టాలు అనుభవిస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏడు సన్న వరి రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తున్నది. ఈ నిర్ణయం రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఏ పంట వేయాలి? ఏ రకం విత్తనం సాగు చేయాలి? అనే నిర్ణయం రైతు అవసరాలు, భూమి స్వభావం, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఉండాలి. ప్రభుత్వ ఆంక్షల ఆధారంగా ఉండకూడదు.
ఒకప్పుడు భరోసాతో సాగు చేసిన రైతులు, నేడు అనిశ్చితితో బతుకుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని సమస్యల్లోకి నెడుతున్నది. తెలంగాణ రైతుల అభిప్రాయాలు, అవసరాలు, భవిష్యత్తును పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. దశాబ్దాల క్రితం విడుదలైన కొన్ని కాలం చెల్లిన సన్నరకాలను మాత్రమే ప్రోత్సహిస్తూ, వాటిని సాగు చేస్తేనే బోనస్ ఇస్తామని ప్రకటించడం రైతులపై ఒత్తిడి తీసుకురావడమే అవుతుంది.
వ్యవసాయం నిరంతరం మారే రంగం. కొత్త రోగనిరోధకత, అధిక దిగుబడి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు అనేక కొత్త రకాలను అభివృద్ధి చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కేవలం ఏడు రకాలను మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేయడం రైతుల ఎంపిక స్వేచ్ఛను హరించడమే. ఇది రైతుల ఆదాయ అవకాశాలను కూడా తగ్గించే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఎంపిక చేసిన 7 రకాల సాగులో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. గత వానకాలంలో రాష్ట్రంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, అందులో దాదాపు 40 లక్షల ఎకరాల్లో సన్నరకాల సాగు జరిగినట్టు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అంత పెద్ద విస్తీర్ణంలో సాగు జరుగాలంటే లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. రైతులు సాగు చేయాలని సూచిస్తున్న రకాల విత్తనాలు తగినంత పరిమాణంలో అందుబాటులో లేవు. వానకాలం ప్రారంభమై ఇప్పటికే నారుమడులు వేసే సమయం దాటిపోతున్నప్పటికీ, ఏ రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయి, ఎంత మేరకు సరఫరా జరుగుతుందో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదు.
తెలంగాణలో సుమారు 40 లక్షల ఎకరాల్లో సన్నరకాల వరి సాగు లక్ష్యంగా పెట్టుకొంటే అందుకు దాదాపు 8 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల వద్ద కలిపి కేవలం 43 వేల క్వింటాళ్ల విత్తనం మాత్రమే అందుబాటులో ఉన్నది. అంటే అవసరమైన విత్తనంలో చాలా స్వల్ప భాగం (5.3 శాతం) మాత్రమే ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్నది. మిగిలిన విత్తనం ప్రైవేట్ విత్తన సంస్థల వద్ద ఉన్నది. విత్తనాల విషయంలో గందరగోళం సృష్టించే నిర్ణయాల కంటే రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వానకాలం సాగు సీజన్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయం ప్రభుత్వ కార్యాలయాల్లో కాదు, పొలాల్లో జరుగుతుంది. రైతుల అనుభవాన్ని, సూచనలను గౌరవించకుండా తీసుకునే నిర్ణయాలు అన్నదాతల భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉన్నది. సన్నాల రకాల ఎంపికపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించి రైతులకు స్వేచ్ఛ కల్పించాలి.
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సవాళ్ల మధ్య నడుస్తున్నది. పెట్టుబడి సాయం, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, పంటల కొనుగోళ్లు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమల్లో అనిశ్చితి నెలకొన్నది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా? అవసరమైన సమయంలో విత్తనం, ఎరువు అందుతుందా? ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తుందా? అసలు కొనుగోలు చేస్తుందా లేదా? అనే ప్రశ్నలు రైతుల మనసును వేధిస్తున్నాయి.
వ్యవసాయం బలోపేతం కావాలంటే రైతును కేంద్రబిందువుగా చేసుకున్న ప్రభుత్వ పాలన విధానాలు అవసరం. రైతు సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని నమ్మే పాలన సాగినప్పుడే వ్యవసాయ రంగం పురోగమిస్తుంది. తెలంగాణలో సాగు సంక్షోభాన్ని అధిగమించి రాష్ట్రం సంపూర్ణ అన్నపూర్ణగా ఎదగాలంటే, రైతుకు గౌరవం, భద్రత, ఆర్థిక స్వావలంబన మళ్లీ రావాలంటే కేసీఆర్ సార్ పాలన రావాల్సిన అవసరం ఉన్నది. రైతు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. ఈ దిశగా ప్రజలంతా ఆలోచించాలి. రైతు గోస తీర్చేందుకు కృషి చేయాలి.