‘పంటలకు నీళ్లు లెవ్వు.. కరెంట్‌కు కటకటనే.. పెట్టుబడి సాయానికి పాతర పెట్టింది.. రుణమాఫీ ఊసే లేదు.. ఆరు గ్యారెంటీల సంగతేమో కానీ, ఉన్నవాటిని ఊడగొట్టి.. పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది..’ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నది రాష్ట్ర రైతాంగం. ఆ పార్టీ నాయకుల తీరుపై రైతన్న కన్నెర్ర జేస్తున్నడు. కానీ, ఆ రైతన్న మీద కాంగ్రెస్ పార్టీకి కొంతైనా కనికరం లేకుండాపోయింది.
Congress | అబద్ధాలు, గోబెల్స్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు హాయిగా ఉన్నారు. పాపం రైతులేమో ఎండిన పంటలు చూసి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. గత మూడు, నాలుగు నెలలుగా తమాషా చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎండిపోతున్న పంటల వైపు కనీసం కన్నెత్తి చూడలేని కబోధిలా వ్యవహరిస్తున్నది. ఢిల్లీ రాయబారాలు, విమానాల్లో చక్కర్లు, పదవుల పందేరాలు, ఎన్నికల హంగామాలతో కాంగ్రెస్ నాయకులు సందడి చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, కరెంటు, పెట్టుబడి సాయం.. సరైన సమయంలో రైతులకు అందించింది. తత్ఫలితంగా బీఆర్ఎస్ పదేండ్ల పాలనా కాలంలో రైతులు దర్జాగా బతికారు. ఇది ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంపై అసత్య ప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలు చేసి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? డిసెంబర్ 9న రైతుల రుణమాఫీ, రైతుభరోసా పథకాలు అమలుచేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు కనీసం రైతుల గోడు పట్టించుకోకుండా మొఖం చాటేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని రైతుల వద్దకు వెళ్లడం లేదు. ఎండిపోతున్న పంటలను కూడా కనీసం పరిశీలించడం లేదు.
గత పదేండ్లు రైతుల పక్షాన అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోనూ రైతులకు అండగా ఉంటున్నది. ఎండిన పంటలను పరిశీలిస్తూ రైతులకు భరోసా ఇస్తున్నది. ‘కేసీఆర్ ప్రభుత్వంలోనే వ్యవసాయం బాగుపడ్డది. రైతులు మంచిగ బతికిండ్రు. నీళ్లకు, కరెంటుకు, రైతుబంధుకు ఇబ్బంది లేకుండే. తెలంగాణ రైతాంగం పరిస్థితులు ఇప్పుడు అల్లకల్లోలమైనయి’ అని గుండె నిండా బాధతో రైతు రంధి పడుతున్నడు. అప్పోసప్పో జేసి పంటలు వేస్తే నీళ్లందక అవి ఎండిపోతున్నాయి.
అన్నదాత బతుకు ఆగమయ్యే రోజులు మళ్లీ వచ్చాయని రోదిస్తున్నాడు. కరువు వచ్చింది. కరువంటే మామూలు కరువు కాదు, కనీసం తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేని కరువు వచ్చింది. జుక్కల్ ప్రాంతంలో ఐదు రోజుల నుంచి మంచినీళ్లు లేకపోవడంతో మహిళలు అరిగోస పడుతున్నారు. ఇదే పరిస్థితి దాదాపు రాష్ట్రమంతా ఉన్నది. మార్చి చివరలోనే ఇట్లా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో ఊహించుకుంటేనే భయం వేస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించింది. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ మధ్య తాము డీలా పడిపోయమా అనే నిర్వేదంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నట్టు అర్థమవుతున్నది. కొత్త ఎత్తుగడలతో, ప్రజలను ఎలా మాయ చేయాలో, మభ్యపెట్టాల్నో అని ఆలోచిస్తున్నారు. ఎటొచ్చీ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కడమే కాంగ్రెస్ వ్యూహం. లేకుంటే హైకమాండ్ దగ్గర ఉన్న పలుకుబడి పోయి అసలుకే ఎసరు వస్తుందేమోనని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
వారి అంచనాలకు తగ్గట్టుగానే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు మారుతున్నది. ప్రజల్లో కేసీఆర్ పట్ల ఆదరణ పెరుగుతున్నది. రాష్ట్ర ప్రజానీకం మంచి ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామనే బాధలో, పునరాలోచనలో ఉన్నది. నీళ్లిచ్చే పరిస్థితి ఉన్నా, కాళేశ్వరంపై కుట్ర చేసి ప్రాజెక్ట్‌ను ఎండబెడుతున్నది. వ్యవసాయానికి నీళ్లు అందించకుండా చేతులెత్తేసి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నది. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు తెలంగాణ ఎడారిని తలపిస్తున్నది. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ఆరు గ్యారెంటీల భ్రమలో పడి.. ఉన్న ఎవుసాన్ని ఎడారి చేసుకున్నామని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే సాగు, తాగునీటికి, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందు జాగ్రత తీసుకుంటుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాటి జోలికే పోవడం లేదు. తొమ్మిదిన్నరేండ్ల పాటు కరెంటు కష్టాలుండేనా? లేవు. నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తునందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కింది. సాగు, తాగునీటికి ఎన్నడూ ఇబ్బందులు తలెత్తకుండా ఆయన చర్యలు తీసుకున్నరు. ఏటా రెండు పంటలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌ది. కానీ, నేడు రాష్ట్రంలో రైతు బతుకు ఆగమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు ఎండిపోయి పొలాలు బీళ్లుగా మారాయి. అన్నదాతల్లో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. గత తొమ్మిదేండ్లుగా కరువన్నది ఎరగని రైతన్న ఈ మూడు, నాలుగు నెలల్లోనే కరువుతోనే కాలం ఎల్లదీస్తున్నాడు. కరువుకాలం అంటే ఇదేనేమో!
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-చిటుకుల మైసారెడ్డి
94905 24724