Telangana | తెలంగాణ రాకముందు కూడా నీళ్లుండేవి. కాకపోతే ఆ నీళ్లు రైతు కండ్లల్లో మాత్రమే ఉండేవి. తెలంగాణ రాకముందు కూడా చెట్లుండేవి. కాకపోతే, ఆ చెట్లకు పండ్ల కంటే ఎక్కువగా ఉరితాళ్లే మొలిచేవి. డెబ్బై శాతానికి పైగా జీవనదులు పారే నేలలో.. డెబ్బై శాతం మంది ఆధారపడి బతికే వ్యవసాయం విధ్వంసంగా ఎందుకు మారింది? వ్యవసాయాన్ని దండుగగా మార్చేసిన సమైక్య దౌర్భాగ్యం నుంచి వ్యవసాయాన్ని పండుగగా మార్చిన స్వరాష్ట్ర సౌభాగ్యంలోకి ఒక్కసారి తొంగిచూస్తే ఒక గొప్ప వ్యవసాయ విప్లవమే కనిపిస్తుంది.
నాటి పరాయి పాలనలో తన పంటకు పట్టిన చీడ పురుగు లెక్కనే ఉండేది రైతు పరిస్థితి. ఆ చీడ పురుగులు తినటానికి కనీసం ఆ పంటైనా ఉండేది. కానీ, రైతుకు మాత్రం ఆ పురుగుల కోసం తెచ్చిన మందుడబ్బాలే గతి అయ్యేవి. పొలాలల్లో నీళ్లకంటే రైతులు తాగిపడేసిన మందు డబ్బాలే ఎక్కువగా కనిపించేవి. వర్షం మోసం చేసేది, విత్తనం మోసం చేసేది, ఆఖరికి పంట కూడా మోసం చేసేది. పంట కోసం చేసిన అప్పులన్నీ పండించిన పంటలను పురుగుల కంటే దారుణంగా తినేస్తున్న దుస్థితిలో నాగలి సైతం అలిసిపోయింది, వ్యవసాయం నరకమైంది. అర్ధరాత్రి ఎప్పుడొస్తదో తెల్వని కరెంట్ కోసం, పాములకు, తేళ్లకు బలైపోయిన జీవితాల నుంచీ, అప్పులకూ, వడ్డీలకూ నలిగిపోయిన రైతు చరిత్ర ప్రతీ ఎకరంలో కనిపిస్తుండేది. ఒక్కో ఎకరంలో నాటి న విత్తనాల కంటే ఆ పంటకు నీళ్లివ్వటం కోసం వేసిన బోర్లే ఎక్కువుండేవి. బోర్లల్లో నీళ్ల కోసం చూసీచూసీ రైతుల కండ్లల్లో కూడా నీళ్లింకిపోయాయి. ఈ దరిద్రాలు చాలవన్నట్టు నీళ్లివ్వటం చేతకాని ప్రభుత్వాలే కరెంటు బిల్లులు పెంచటం, ‘ఎందుకు పెంచుతున్నార’ని అడిగినందుకు రైతులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపటం. ఇలా తెలంగాణలో వ్యవసాయాన్ని విధ్వంసం చేయ టం కోసం సమైక్య పాలనలో జరిగిన దారుణాలెన్నో.
ఏ సంక్షోభాన్నైనా కూకటివేళ్లతో సహా పెకిలించినప్పుడే ఒక గొప్ప మార్పు సాధ్యమవుతుందని నమ్మిన నాయకుడే మన పాలకుడు కావటం తెలంగాణ చేసుకున్న అదృష్టం. తెలంగాణ వ్యవసాయానికి కలుపు మొక్కలుగా మారినవి నీళ్లు, కరెంటు లేకపోవటం. ముందుగాల ఆ సమస్యలను పరిష్కరించాలి. అందుకే, స్వరాష్ట్ర కల సాకారమైన వెంటనే తెలంగాణ ప్రభుత్వం మొదటగా దృష్టి పెట్టింది కరెంటు, సాగునీటి ప్రాజెక్టుల మీదనే. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ భారీ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తూ ప్రతీ ఎకరానికి నీళ్లివ్వాలనే లక్ష్య సాధనలో తెలంగాణ అద్భుతమైన విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు 24 గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయటంతో పాటుగా, కాకతీయుల నుంచి వారసత్వంగా వచ్చిన చెరువుల్లో పూడికలు తీయటం వాగుల మీద ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టడంతో తెలంగాణలో జల వనరులు భారీగా పెరిగాయి.
భూగర్భ జలాలు అతి తక్కువకాలంలో ఇంత భారీగా పెరగటమనేది కచ్చితంగా అభినందించాల్సిన విషయమే. ఇకపోతే వ్యవసాయాన్ని నిలబెట్టాలంటే కరెంటూ, నీళ్లు మాత్రమే సరిపోవు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న అన్ని సమస్యల్లోంచీ బయటపడేసినప్పుడే వారి ఆదాయం పెరుగుతుంది. అయితే రైతు అప్పులు చేసేది కేవలం పంట సాయం కోసం మాత్రమే కాదు, బిడ్డల పెండ్లిళ్ల కోసం, వాళ్ల బిడ్డల బారసాలల కోసం. పండుగల కోసం.. ఇలా చాలా సామాజిక అవసరాల కోసం రైతులు అప్పులు చేస్తుంటారు. ఈ అప్పుల వల్ల పంటలను కూడా తక్కువ ధరకే అప్పిచ్చిన వాళ్లకే అమ్ముకునే దుస్థితి ఉండేది. ఒకవైపు రైతుకు పంట సాయం చేస్తూనే మిగతా ఖర్చుల్లో అండగా నిలబడినప్పుడే ఆ రైతును అన్నిరకాలుగా నిలబెట్టడం సాధ్యమవుతుంది. అందుకే అటు రైతుబంధు, ఇటు కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి అద్భుతమైన పథకాలు అమలుచేస్తూ.. మరో పక్క రుణమాఫీని కూడా అమలుచేసి రైతులను అప్పుల ఊబిలోంచి బయటపడేస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే కాబట్టి ప్రభుత్వ దవాఖానలను అద్భుతంగా మార్చేస్తున్నారు. ప్రభు త్వ దవాఖానల్లో గణనీయంగా పెరిగిన కాన్పు లే దీనికి ఉదాహరణ.
అన్ని అరిష్టాలూ దాటుకొని పంట పండించటం ఎంత కష్టమో, ఆ పంటను సరైన ధరకు అమ్ముకోవడం కూడా అంతే కష్టం. పంట పైసలు ఎప్పుడు చేతికొస్తయో తెల్వని దరిద్రం ఉండేది. పైగా ట్రాక్టర్ల కిరాయిలు, మిల్లులు అంటూ సగం డబ్బులు అటే పోయేవి. కానీ, ఇప్పుడు స్వరాష్ట్ర పాలనలో ప్రభుత్వమే రైతుల దగ్గరికి వచ్చి పంట కొనుగోలు చేస్తున్నది. పంట డబ్బులను ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నది.
సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఒకప్పటిలా సేట్ల చుట్టూ, బీట్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రైతులు సంతోషంగా తమ పంటలు అమ్ముకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. దురదృష్టవశాత్తూ ఇంటికి పెద్ద దిక్కయిన రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగంకావొద్దు, వాళ్ల వ్యవసాయం ఆగిపోవద్దనే ఆలోచనతో దినవారంలోపే వాళ్లకు ధీమాను అందిస్తూ రైతులను, వ్యవసాయాన్నీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న రైతుబిడ్డ కేసీఆరే అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
కండ్లముందే వందల కిలోమీటర్ల కాల్వలు కనిపిస్తున్నాయి. ఆ కాల్వల నిండా నీళ్లు కనిపిస్తున్నాయి. పెరిగిన సాగు కండ్లముందే ఉన్నది. పెరిగిన పంట దిగుబడి కండ్లముందే ఉన్నది. పచ్చదనం పెరిగింది, నీటి వనరులు పెరిగినయి. భూగర్భ జలాలు పెరిగినయి. తలసరి ఆదాయం పెరిగింది. రైతు ఆదాయం పెరిగింది. ఆత్మహత్యలు తగ్గిపోయినయి. అప్పులు తగ్గిపోయినయి. ఇవన్నీ ప్రతిపక్షాల కండ్లకు కనిపించటం లేదు. కానీ, ప్రజలు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నరు. కరువును జూసిన అదే కండ్లతో నమ్మశక్యం కాని మార్పును తమ కండ్ల ముందే చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో అర్థమైంది. కానీ, ప్రతిపక్షాలకే ఇంకా విషయం అర్థం కావట్లేదు. కేవలం పదేండ్లలోనే ధాన్యం దిగుబడిలో మాత్రమే కాకుండా తలసరి ఆదాయంలో కూడా నెంబర్-1గా దూసుకుపోతున్న తెలంగాణ అభివృద్ధి తమ పాలనలో ఉన్న రాష్ర్టాల్లో ఎక్కడా లేకపోవటంతో ఇక్కడి ప్రజలు తమను ఎలా నమ్ముతారనే నైరాశ్యంలో ప్రతిపక్షాలు మునిగిపోతున్నాయి.
తెలంగాణలో అద్భుతాలు చేస్తామని చెప్పుకొంటున్న ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ర్టాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కనీసం 9 గంటల కరెంటు కూడా సక్కగ ఇవ్వటం లేదు. వాళ్ల రాష్ర్టాల్లో రైతు బీమా లేదు. రైతుబంధు లేదు. కానీ, ఇక్కడ మాత్రం అద్భుతాలు చేస్తామని మాయమాటలు చెప్తున్నారు. పెరిగిన సాగు అబద్ధమాడదు, పెరిగిన నీళ్లు అబద్ధమాడవు. పచ్చదనం అబద్ధమాడదు. రైతు కండ్లల్లో ఆనందబాష్పాలు అబద్ధం చెప్పవు. అందుకే కేసీఆర్ మీద ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎవ్వరూ నమ్మడం లేదు. ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ర్టాల్లోంచి తెలంగాణ పొలాల్లో కూలీ పనుల కోసం వస్తున్న కూలీలే తెలంగాణ వ్యవసాయరంగంలో సాధించిన గొప్ప మార్పుకు నిదర్శనం. ఇది ప్రతిపక్షాలు సైతం ఒప్పుకొని తీరాల్సిన నిజం. అందుకే తెలంగాణలో ఎద్దు నవ్వింది. ఎవుసం లేసింది. రైతు నవ్విండు, రాజ్యం బాగుపడ్డది. కృష్ణమ్మను కండ్లల్లో, గోదారిని గుండెల్లో సంకల్పంగా నింపుకున్న ఒక దార్శనిక మహర్షి పట్టుదలతోనే ఒకప్పటి కరువు నేల ఇయ్యాల దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలబడింది. తెలంగాణ పొలంలో రైతులను పండిస్తున్న రైతు బిడ్డకు, తెలంగాణ నాగలి చేతులెత్తి నమస్కారం చేస్తున్నది.
ఇంగ్లిష్ రమేష్
90630 92644